విదేశీ పర్యటనలపై శ్వేతపత్రం విడుదల చేయాలి

ఇప్పటి వరకు ఎన్ని పెట్టుబడులు వచ్చాయో చెప్పాలి
బాబు పర్యటనలతో ప్రజాధనం దుర్వినియోగం
ఒక పార్టీకి కొమ్ముకాస్తూ పచ్చపత్రికల్లో కథనాలు
వ్యక్తిగత జీవితాలను కించపర్చడం జర్నలిజమా?
చంద్రబాబు ఓటుకు కోటు కేసుపై చిన్న కథనమైనా రాశారా..?
సుజయకృష్ణ ముందు నీ వంశగౌరవం కాపాడుకో
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌: చంద్రబాబు విదేశీ పర్యటనలతో వచ్చిన పెట్టుబడుల కంటే ఖర్చులే అధికంగా ఉన్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. మూడున్నరేళ్లుగా విదేశీ పర్యటనలు చేస్తున్న చంద్రబాబు ఎన్ని పెట్టబడులను రాష్ట్రానికి తీసుకువచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, ఆయన తాలూకా బృందం రాష్ట్రానికి పెట్టబడులు తెచ్చేదానికంటే వారి వ్యక్తిగత ఆహ్లాదానికి చేస్తున్న కార్యక్రమాలు పర్యటనలు ఉన్నాయన్నారు. 2014 నుంచి ఎన్ని విదేవీ పర్యటనలు చేశారు. ఎన్ని నిధులు వచ్చాయి. ఎన్ని పరిశ్రమలు వచ్చాయో చెప్పాలన్నారు. అదే విధంగా వందల కోట్లు ఖర్చు చేసి నిర్వహించిన పాట్నర్‌షిప్‌ సమ్మిట్‌లలో ప్రకటించిన విధంగా నిధులు వచ్చాయా లేదా అన్న విషయాన్ని అధికారికంగా  ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పర్యటనలు చేసి వచ్చి వందల కోట్లు వస్తున్నాయని ప్రగల్భాలు పలకడం, అక్కడి తెలుగువారితో సన్మానాలు చేయించుకోవడం ఇక్కడేమో పచ్చపత్రికలు ఆహా.. ఓహో అంటూ రాతలు రాయడం ఇదే సరిపోతుందన్నారు. 

జాతీయ పత్రికలు వాస్తవాలు రాస్తుంటే ప్రాంతీయ పత్రికలు ఒక పార్టీకి ప్రయోజనం చేకూర్చడానికి మరో పార్టీకి చెందిన నాయకుల వ్యక్తిగత జీవితాలను కించపరుస్తున్నాయని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. జాతీయ పత్రికలు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, డక్కన్‌క్రానికల్ వంటి పత్రికలు మాజీ సీబీఐ డైరెక్టర్‌ కేసులో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన వారికి ఎలాంటి సంబంధం లేదని చెప్పాయన్నారు. కానీ ప్రాంతీయ పత్రికలు మాత్రం ఫోటోలతో సహా వేసి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కథనాలు రాస్తున్నాయని మండిపడ్డారు. మరి ఆ పత్రికలకు ఇచ్చిన చార్జీషీట్‌లు, ప్రాంతీయ పత్రికలు ఇచ్చిన చార్జీషీట్‌లు మారాయా అని ప్రశ్నించారు. అంటే పచ్చపత్రికల తాలూకా దుర్బుద్ధి, దురుద్దేశం బట్టబయలైందన్నారు. ఇది జర్నలిజమా.. ఇవేనా జర్నలిజం విలువలు అని నిలదీశారు. ఎక్కడైనా సీబీఐ డైరెక్టర్‌ను కలిసినట్లుగా నిరూపించగలరా..? లేని దాన్ని ఏ విధంగా సృష్టిస్తారు.. వాస్తవాలు తెలుసుకుని కథనాలు రాయాలని ఆ పత్రికలకు సూచించారు. 

ఓటుకు కోట్ల కేసులో 20 సార్లు చార్జీషీట్‌లో చంద్రబాబు పేరు ప్రస్తావిస్తే ఈ ప్రతికలు ఒక్కటైనా రాశాయా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. లేని దాన్ని బూతద్ధంలో చూపించి మా వ్యక్తిగత జీవితాలకు ఎందుకు అప్రతిష్ట కలిగించాలని ప్రశ్నించారు. ఇలాంటి చౌకబారు రాతలు రాసి చంద్రబాబు పార్టీకి ప్రయోజనం చేకూర్చాలని చూస్తున్నారా అని నిలదీశారు. 

విజయనగరం జిల్లా మంత్రి సుజయకృష్ణ రంగారావు అవాకులు.. చవాకులు పేలడం కాదు ముందు నీ వంశ గౌరవం కాపాడుకో అని బొత్స సత్యనారాయణ సూచించారు. తాండ్రపారాయుడు వంశ చరిత్ర అని చెప్పుకునే సుజయ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి టీడీపీలో చేరి మంత్రి పదవి అనుభవిస్తుంటే అసలు ఆ వంశమేనా ఈయనది అనే అనుమానం కలుగుతుందన్నారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎఫ్‌ఐఆర్‌లేని వారిల్లో నేను ఒకడినని, నా మీద ఏదైనా ఆరోపణలు వస్తే ధైర్యంగా ఎదుర్కొంటాను కానీ చంద్రబాబులా స్టేలు తెచ్చుకోనన్నారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మీరే కదా ఏదైనా తప్పు చేసి వుంటే చర్యలు తీసుకోండి. చర్యలు కూడా తీసుకోలేని చేతగాని దద్దమ్మలా అని ప్రశ్నించారు. బాధ్యత గల పదవిలో ఉన్న సుజయకృష్ణ రంగారావు ఏదైనా మాట్లాడితే ఆ మాటకు విలువ ఉండాలని సూచించారు. 

Back to Top