సీబీఐ విచారణకు సిద్ధమా బాబు..?

సాక్షి కథనాలతో మంత్రులకు ముచ్చెమటలు
ప్రస్టేషన్ లో వైఎస్ జగన్ పై దిగజారుడు వ్యాఖ్యలు
రాజధాని ముసుగులో లక్షల కోట్ల భూదోపిడీ
రాజధానిలో నీకేం పని నారాయణ..?
మూటలు పంచాడనే బాబు బినామీగా పెట్టుకున్నాడుఃఅంబటి

హైదరాబాద్ః  టీడీపీ రాజధాని ముసుగులో లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడుతుందని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  చెప్పిందే జరిగిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు  అన్నారు.  సాక్షి సాక్ష్యాధారలతో సహా మంత్రివర్గం, లోకేష్ ల భూ దోపిడీని వెలుగులోకి తేవడంతో టీడీపీ నేతలకు  చెమటలు పట్టాయన్నారు. తమ బినామీ బాగోతం బట్టబయలవడంతో మంత్రులు  ప్రత్తిపాటి, నారాయణ లు ప్రస్టేషన్ తో మాట్లాడుతున్నారని అంబటి ఎద్దేవా చేశారు. సాక్షిమీద, ఎడిటర్ మీద సివిల్ అండ్ క్రిమినల్ కేసు వేస్తామని బెదిరించడం దుర్మార్గమన్నారు. ఇంతకుముందు కూడా చంద్రబాబు  ఇలాగే బెదిరించారని దుయ్యబట్టారు. దమ్ముంటే చంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధపడాలని అంబటి సవాల్ విసిరారు. 

శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రాకుండానే, నారాయణతో కమిటీ వేసి  తుళ్లూరు పరిసరాల్లో రాజధాని అంటూ చంద్రబాబు ఆదరాబాదరాగ  ప్రకటించారని అంబటి అన్నారు. చంద్రబాబు బినామీదారులంతా పక్కా ప్లాన్ తో ముందే వేల ఎకరాలు కొనుక్కున్నాకే.... రాజధాని నిర్మాణం ప్రకటన చేశారని అంబటి మండిపడ్డారు. మంత్రులపై ఆధారాలతో సహా వాస్తవాలు వెలుగుచూస్తే...దానికి సమాధానం చెప్పుకోకుండా తమ అధ్యక్షులు వైఎస్ జగన్ పై బురదజల్లడం దారుణమన్నారు. బినామీల పేరిట భూదోపిడీ జరగకపోతే....ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని మంత్రులు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. పేదల కడుపులు కొట్టి కోటీశ్వరులు కావాలంటే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. 

రెవెన్యూ మినిస్టర్ ఉండగా... మున్సిపల్ మంత్రిగా ఉన్న నారాయణ రాజధానిలో ఎందుకు తిరుగుతున్నారని అంబటి ప్రశ్నించారు. ఎన్నికల్లో మూటలు పంచాడనే చంద్రబాబు నారాయణను దొడ్డిదారిన మంత్రిని చేసి బినామీగా పెట్టుకున్నాడని అంబటి విమర్శించారు. డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదని నారాయణ మాట్లాడడాన్ని అంబటి ఖండించారు.  నారాయణ చేస్తున్నది లోకేష్ సేవ తప్ప ప్రజాసేవ కాదన్నారు. చంద్రబాబు, నారాయణల మధ్య ఉన్నది క్యాష్ సంబంధం మాత్రమేనని అన్నారు. నిజంగా ప్రజాసేవ చేయాలంటే రాజకీయాలు అవసరం లేదని నారాయణకు హితవు పలికారు. మథర్ థెరిసా లాగ నారాయణకు ఫాదర్ థెరిసా ఇవ్వాలేమోనని ఎత్తిపొడిచారు. మీకు మీరు డబ్బాలు కొట్టుకొని వైఎస్ జగన్ విమర్శించడం మానుకోవాలన్నారు. 

ఎక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా బినామీలకు దోచిపెట్టాకే చంద్రబాబు పని మొదలుపెడతారని  అంబటి ఫైరయ్యారు. అన్యాక్రాంతంగా దోచుకున్న  సొమ్ముతోనే ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు వెదజల్లుతున్నారని విమర్శించారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాయొద్దని చంద్రబాబు పత్రికలను, ఛానళ్లను బెదిరించడం దురదృష్టకరమన్నారు. ఎల్లకాలం చంద్రబాబు ఆటలు సాగవన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని రాజధాని అభివృద్ధికి పూనుకోవాలని సూచించారు. ఎదుటివారి మీద బురదజల్లడం మాని చేసిన తప్పులను సరిదిద్దుకోవాలన్నారు. లేకపోతే ప్రజలే చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతారన్నారు. 



Back to Top