నీ అపార అనుభవం ఇదేనా బాబు: అమర్‌నాథ్

  • 8 నెలల పాలనలో చేసింది శూన్యం
  • పరిపాలనంతా లోకేష్ చేస్తున్నాడు
  • వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్ ధ్వజం
  • రెండోరోజూ రైతు దీక్షకు  పోటెత్తిన విశాఖ వాసులు

సాక్షి, విశాఖపట్నం: తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా..పదేళ్లు ప్రతి పక్ష నేతగా అపార అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గడిచిన ఎనిమిది నెలల పాలనలో చేసిందేమిటని వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ప్రశ్నించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వైఎస్సార్ సీపీ అధినేత, శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న రైతు దీక్షకు రెండవ రోజైన ఆదివారం కూడా విశాఖ వాసులు పోటెత్తారు.

జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో రైతు దీక్షలో పాల్గొన్నారు. ఈ దీక్షలో జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడతో పాటు ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు, ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వర రావు, బూడి ముత్యాల నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, చెంగల వెంకట్రావు, తైనాల విజయకుమార్, మళ్ల విజయప్రసాద్, కరణం ధర్మశ్రీ,కర్రి సీతారాం, తిప్పల గురుమూర్తిరెడ్డి, పార్టీ కో-ఆర్డినేటర్లు తిప్పల నాగిరెడ్డి, ప్రగడ నాగేశ్వరరావు, పార్టీ నేతలు బొడ్డేటి ప్రసాద్, కొయ్యప్రసాద్‌రెడ్డి, జాన్‌వెస్లీ, కంపా హనోక్, శ్రీకాంత్‌రాజు, పక్కి దివాకర్, రవిరెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

కేంద్రం నుంచి నిధులు రాబట్టలేకపోయారు
గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ మోడీతో కలిసి మంచి పాలన అందిస్తానని నమ్మబలికిన చంద్రబాబు నేటికీ కేంద్రం నుంచి నవ్యాంధ్రకు ఒక్క రూపాయి నిధులు కూడా సాధించలేకపోయారని విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి లోకేష్ రాష్ర్ట పాలన సాగిస్తున్నాడని, ఆ రోజు లక్ష్మీపార్వతి ఇదే విధంగా చేస్తోందని ఆరోపించి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్న చంద్ర బాబు నేడు కొడుకు విషయంలో ఎందుకు మాట్లాడడం లేదన్నారు.

లోకేష్‌కు అధికారమిచ్చే దమ్ముందా నీకు? అని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారానికి భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న పవన్‌కళ్యాణ్... ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానని చెప్పుకున్నారని, ఆయన వేదికపై ఉండగానే చంద్రబాబు హామీలు గుప్పించారని..నేడు ఆ హామీలు నేరవేర్చలేకపోతున్నా పవన్‌కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.

Back to Top