నాటి హామీలు ఏమయ్యాయి నాయుళ్లు..?

()ప్రత్యేక హోదా.. ఆంధ్రుల హక్కు
()టీడీపీ, బీజేపీలు ఏపీకి మోసం చేశాయి
()హోదా వచ్చేదాకా వైయస్సార్సీపీ పోరాడుతుంది
()వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి స్పష్టీకరణ

హైదరాబాద్ః ఆర్థిక సంఘం, నీతి అయోగ్‌ల పేరు చెప్పి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా తప్పించుకునేందుకు టీడీపీ, బీజేపీలు కుట్రపన్నాయని వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు.  రెండు పార్టీలు రెండు వేళ్లుగా మారి తెలుగు తల్లి రెండు కళ్లను పొడిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీలు ఆంధ్రప్రదేశ్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి రాష్ట్రానికి బీజేపీ ప్రత్యేకంగా ఏమిచ్చిందో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఐదుకోట్ల ప్రజల ప్రత్యేక హోదా హక్కును వెంకయ్యనాయుడు గొర్రెలు, మేక మెడలో వేలాడే అవయవాలతో పోల్చడం దురదృష్టకరమన్నారు. టీడీపీ, బీజేపీలు ఏపీ ప్రజలను చులకనగా చూస్తున్నాయని మండిపడ్డారు.  వెంకయ్యనాయుడు భాషా పరిజ్ఙానం, ప్రాసలతో ఎడాపెడా మాట్లాడేసి చివరకు అదే మాటలతో తెలుగు ప్రజల పొట్టలు కొట్టారని ఆరోపించారు. పోలవరానికి అంతిస్తాం ఇంతిస్తాం.. ఎంతైనా ఇస్తామని చెప్పడం కాదని,  నిర్దిష్టంగా కేంద్రం నుంచి ఎంత నిధులు కేటాయిస్తున్నారో చెప్పాలన్నారు. హైదరాబాద్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్థసారథి మాట్లాడారు. 

ఆనాటి హీరోయిజం నేడు ఏమైంది
అన్ని పార్టీలు కాదన్నా పదేళ్లు ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టి సాధించానని చెప్పుకుంటున్న వెంకయ్య ఆ పోరాటం నేడు ఏమైందని ప్రశ్నించారు. వెస్ట్‌బెంగాల్, ఒరిస్సా తదితర రాష్ట్రాల ఎంపీలు ప్రత్యేక హోదాకు అడ్డుచెప్పినా తాను మాత్రం తెలుగు ప్రజల ఆకాంక్ష మేరకు పార్లమెంట్‌లో పోరాడానని చెప్పిన మాటలు గుర్తుకు రాకపోవడం దారుణమన్నారు. రాజధాని నిర్మాణం కోసం నిధులు కేటాయిద్దామంటే ప్రాజెక్టు సిద్దం కాలేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు ఇద్దరు నాయుళ్లు కలిసి తెలుగు ప్రజలను మోసం చేసేందుకు కుట్రపన్నారన్నారు. 

విదేశీ పర్యటనలకు తీరికుంది కానీ..
స్విస్‌ చాలెంజ్‌ కోసం టోక్యో, సింగపూర్‌లని విదేశీ పర్యటనలు చేసిన ముఖ్యమంత్రికి ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టే తీరికలేదన్నారు. ప్రత్యేక హోదా అదిగో ఇదిగో అంటూ ఊరించి ప్రత్యేక ప్యాకేజీ పేరుతో అర్ధరాత్రి తెలుగు ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి సుజనా చౌదరి ప్రత్యేక హోదా వచ్చేసింది.. ప్రకటనే తరువాయి అన్నట్టు ప్రకటనలిచ్చి కేంద్రం చివరకు అత్తెసరు ప్యాకేజీతో సరిపెట్టినా మాట్లాడక పోవడం చూస్తుంటే ప్రత్యేక హోదాపై టీడీపీకి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందన్నారు. పైగా హోదా కోసం పట్టుబట్టకుండా ప్యాకేజీకి అంగీకరిస్తున్నట్లు అర్థరాత్రి ప్రకటించిన చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తన సొంతలాభాలకు తాకట్టు పెట్టారని విమర్శించారు. టీడీపీ, బీజేపీలు పరస్పర విరుద్ధ ప్రకటనలతో తెలుగు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని పేర్కొన్నారు. 

మోడీ పుట్టిన రోజునైనా ఇస్తారనుకుంటే...
అమరావతి రాజధాని ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని మోడీ మట్టి, నీళ్లు తప్ప ఏమిచ్చారని ప్రశ్నించారు. ఎన్నికల ముందు తిరుపతి సభలో ఏడు కొండల వెంకన్న సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చిన మోడీ నేడు ప్రకటన ఎందుకు చేయించలేకపోయారన్నారు. చట్టాలు పేరు చెప్పి ప్రత్యేక హోదా ఇవ్వకుండా తప్పించుకుంటున్న కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం ప్రకారం కేంద్రం చేపట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును రాష్ట్రానికి కేటాయించినప్పుడు చట్టాలు అడ్డు రాలేదా అన్ని ప్రశ్నించారు. మీకు నచ్చిన వారికి ప్రాజెక్టులను అడ్డదారిన కట్టబెట్టేందుకు చట్టాలు అడ్డులేనప్పుడు 5 కోట్ల ప్రజల ప్రయోజనాల కోసం చట్టాలు అడ్డొచ్చాయా అని సూటిగా ప్రశ్నించారు

రాష్ట్రానికి ఏమిచ్చారో స్పష్టం చేయండి
ఇప్పటికే రాష్ట్రానికి ఎంతో ఇచ్చామని చెప్పుకుంటున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇతర రాష్ట్రాలకు ఇవ్వనిది రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏమిచ్చారో చెప్పాలని స్పష్టం చేయాలన్నారు. ఐఐటీ, ఎన్‌ఐఐటీలు లాంటి యూనివర్సిటీలు ఆంధ్రప్రదేశ్‌లాంటి పెద్ద రాష్ట్రాలకు ఇవ్వడంలో వింతేమీ లేదన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని మీ పార్టీ మేనిఫెస్టోలో చెప్పుకున్న బీజేపీ నాయకులు.. నేడు ప్రజలు, యువకులు, పార్టీలు డిమాండ్‌ చేస్తుంటే ఆర్థికసంఘం అడ్డుకుంటోందని వారి మీదకు నెట్టేసి రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. టీడీపీ, బీజేపీలు సొంత ప్రయోజనాలకు పెద్ద పీట వేసి రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కిందన్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు.                

 
Back to Top