ధరల స్థిరీకరణ నిధి ఎక్కడ బాబూ..?

పామర్రు:  రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులను ఆపద సమయాలలో ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం అన్నదాతను తీవ్రంగా మోసం చేసిందని వైయస్సార్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు కొలుసు పార్థ సారథి మండిపడ్డారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ .... ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకోకుండా గాలికొదిలేసిందని విమర్శించారు. ధరల స్థిరీకరణ నిధితో రైతులకు సహాయం అందజేస్తామని ఎన్నికల ముందు ప్రభుత్వం చేసిన వాగ్ధానాన్ని ఆయన గుర్తుచేశారు. కానీ, ఇంత వరకు ఆ వాగ్ధానాన్ని ప్రభుత్వం ఎందుకు నెరవేర్చలేకపోయిందని ప్రశ్నించారు. పంటకు సరైన గిట్టుబాటు ధరలేక పోవడంతో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. 

–పంటకు గిట్టుబాటు ధర లేక రైతుల అవస్థలు
మిర్చి ధర గతంలో క్వింటాలు రూ. 14వేలు ఉండగా ప్రస్తుతం రూ.3,500లకు పడిపోయిందన్నారు. మినుములు బస్తా గతంలో రూ.12–14వేలు ఉండగా ప్రస్తుతం రూ. 6 వేలకు తగ్గిపోయిందన్నారు. పసుపు రైతుల పరిస్థితి ఇదే మాదిరి ఉందన్నారు. మామిడి గతంలో టన్ను రూ.20–23వేల ధర ఉండగా ప్రస్తుతం ఇదిరూ.4–5వేలకు తగ్గిపోయిందన్నారు. రైతులకు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక అప్పుల ఊబిలో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వం స్పందించని పరిస్థితి నేడు రాష్ట్రంలోఉందన్నారు.

–వడ్డీలేని రుణాలు
గత ప్రభుత్వాలు రైతులకు వడ్డిలేని రుణాలను అందజేయటం వలన అసలు మాత్రమే చెల్లించి కొంత వరకు లాభపడేవారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రుణ మాఫీ పేరుతో వడ్డీలకు వడ్డీలను రైతుల నుంచి గుంజుతోందన్నారు. రైతాంగాన్ని గాలికి వదిలేసిన తీరు ప్రస్తుత ప్రభుత్వంలో కనబడుతోందన్నారు. ఈ రుణమాఫీ ఓ ప్రహసనంలా ఉందని, రైతులకు సంతృప్తి లేకుండా పోయిందన్నారు.

–రైతు దీక్షకు తరలిరావాలి
గిట్టుబాటు ధరలేక, రుణాలు మాఫీకాక, ఆత్మహత్యల బాట పడుతున్న రైతులకు అండగా నిలిచేందుకు ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 26,27 తేదీలలో గుంటూరులో రైతు దీక్ష చేయనున్నారని పార్థసారథి తెలిపారు. ఈ దీక్షకు పార్టీలకు అతీతంగా రైతులు అందరూ తరలి రావాలని ఆయన పిలుపు నిచ్చారు. రాష్ట్రంలోని నలుమూలలనుంచి రైతులు అధికసంఖ్యలో ఈ రైతు దీక్షకు హాజరు కావాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త కైలే అనీల్‌కుమార్, పెదపారుపూడి మండలకన్వీనర్‌గోగంసురేష్, రాష్ట్ర పార్టీ వాణిజ్య విభాగంసభ్యులు గోళ్లసోమేశ్వరరావు, పామర్రు టౌన్‌ పార్టీ అధ్యక్షులు అరుమళ్ల శ్రీనాద్‌రెడ్డి, మండల ప్రచార కమిటీసభ్యులు కూసంపెదవెంకటరెడ్డి, పార్టీముఖ్య నేతలు దొంతిరెడ్డి శ్రీరామిరెడ్డి,బొమ్మారెడ్డి అప్పిరెడ్డి, టీ శ్రీనివాసరావు,ఎన్‌సాంబిరెడ్డి, లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు దాసు గంగాధరరావు, వార్డు మెంబరు ధనాల నాగేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
 
Back to Top