ప్రశ్నిస్తానన్న పవన్ క‌ళ్యాణ్ ఎక్కడ?

- వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా
రాజమహేంద్రవరం: చంద్రబాబు ఇచ్చే హామీలకు నాది పూచీ అన్న పవన్ కల్యాణ్ ఇప్పడు ఎక్కడున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా ప్ర‌శ్నించారు.  సినిమాల్లోలాగా ఎప్పుడో ఒకసారి అలా వచ్చి మెరిసిపోతున్నారని ఆక్షేపించారు. ప్రశ్నించేందుకు పార్టీ పెట్టానన్న వ్యక్తి ఇప్పుడు కనిపించకుండాపోయాడని విమర్శించారు. రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలోని ఒక ప్రైవేటు హోట‌ల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 

జనసేన పార్టీ పెట్టి ప్రజలకు ఏం సేవ చేశారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఒకసారి, పోటీ చేయడానికి తన దగ్గర డబ్బులు లేవని మరోసారి చెబుతూ గందరగోళం స్పష్టిస్తున్నారని మండిపడ్డారు. 

ఇంటికో ఉద్యోగం, లేదంటే నెలకు రూ.రెండు వేల నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, గద్దెనెక్కిన సీఎం చంద్రబాబు రెండేళ్లైనా వాటిని అమలు చేయకుండా యువతను మోసం చేశారని ధ్వజమెత్తారు.  యువత తల్చుకుంటే ప్రభుత్వాలు కూలిపోయిన ఘటనలను చంద్రబాబు గుర్తుచేసుకోవాలని సూచించారు. కాపులను బీసీల్లో చేరుస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు కమిషన్ పేరుతో తాత్సారం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు కాపుల నమ్మకాన్ని కోల్పోయారన్నారు.తనను నమ్మి టీడీపీకి ఓట్లేసిన కాపు యువతను పవన్ కల్యాణ్ ఏమి సమాధానం చెబుతారని ధ్వజమెత్తారు.
Back to Top