12 రోజులైనా నోరెత్తవా..?

– బడ్జెట్‌పై చంద్రబాబు ప్రశ్నించకపోవడం అన్యాయం
– ఎన్నికలు సమీపిస్తుండటంతో కొత్త నాటకాలు
– చంద్రబాబు అసమర్థతత వలనే ఏపీకి అన్యాయం
– వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ

హైదరాబాద్: పార్లమెంట్‌లో అటూ ఇటూ కాని ప్రసంగం చేసి.. సత్కారాలు, సన్మానాలు తీసుకోవడం చూస్తుంటే తెలుగు ప్రజలను నవ్వులపాలు చేసేదిగా ఉందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బడ్జెట్‌పై జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని ప్రశ్నించకుండా సన్మానాల పేరుతో టీడీపీ కొత్త నాటకానికి తెరదీసిందని ఆమె పేర్కొన్నారు. గల్లా జయదేవ్‌కు సన్మానం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వీరోచితమైన పోరాటం చేస్తే రాష్ట్రానికి వచ్చింది ఏంటో చెప్పాలి. ఒక ప్రసంగానికే ఎంపీకి సన్మానం చేస్తే.. నాలుగేళ్లుగా నోరు మెదపకుండా చేసిన మోసానికి చంద్రబాబుకు ఎలాంటి శిక్ష వేయాలన్నారు. కేవలం ఒక్క వ్యక్తి వలన రాష్ట్రమంతా నష్టపోతుందని ప్రజలంతా చర్చించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సన్మానాలు చేయించుకోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టి 12 రోజులు గడిచిన మాట్లాడని చంద్రబాబు వ్యవహారం చూస్తుంటే.. మడుగులో దాక్కున్న దుర్యోధనుడే గుర్తుకొస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఇంకా ఏమన్నారంటే... ‘నాలుగేళ్లుగా అన్యాయాన్ని సమర్థిస్తూ 26 పేజీల పుస్తకంలో విస్తృతంగా ప్రచారం చేసి ఇప్పుడు ఉన్నట్టుండి మీకు నష్టం జరగబోతోందని డ్రామాలు ఆడటం చూసి ప్రజలు సిగ్గుపడుతున్నారు. ఈ 12 రోజులుగా చంద్రబాబు మీడియాకు కనపడకుండా దాక్కుంటున్నారు. చంద్రబాబు కేంద్రాన్ని ఏమీ అనరు... ఎంపీలు, ఎమ్మెల్యేలతో మీడియా ముందు తిట్టిస్తారు. రాష్ట్రానికి నష్టం జరిగిపోయిందని ప్రజలంతా బాధపడుతుంటే చంద్రబాబులో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించడం లేదు. కేవలం చంద్రబాబు వల్లనే రాష్ట్రానికి అన్యాయం జరిగింది. చంద్రబాబు చరిత్ర చూస్తే ఏనాడూ ప్రజా సమస్యలపై ఉద్యమం చేసింది లేదు.. ఆయన జీవితమంతా వెన్నుపోట్లు, కుట్రలతోనే సాగింది. ఆయనకు తోడల్లుడు, తమ్ముడు, బావమరిది, వదిన అనే తేడా ఉండదు. అధికారం కోసం ఏమైనా చేస్తారు. కేసులకు భయపడి కేసీఆర్‌కు సగం పార్టీని, కాంగ్రెస్‌ పార్టీని అమ్మేశాడు. చంద్రబాబు స్థానంలో ఒక సామాన్య వ్యక్తి ఉన్నా రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మాట్లాడేవారు. విభజన హామీలు నెరవేరకపోయినా, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా నాలుగేళ్లుగా మాట్లాడని∙చంద్రబాబు ఇప్పుడు ఉన్నట్టుండి బీజేపీ మీద డ్యాన్సులు కట్టడం అంతా డ్రామానే. నిజంగా అన్యాయం మీద ప్రశ్నించదలిస్తే కేంద్రమంత్రులను ఇప్పటికీ కొనసాగించి ఉండేవాడు కాదు. 600 హామీలకు సమాధానం లేదు.. మొదటి 5 సంతకాలకు న్యాయం చేసింది లేదు.. అబద్ధాలు, మోసాలతో ఇప్పటికీ పాలన సాగిస్తున్నారు. ప్రజలు ప్రశ్నిస్తారనే ఎవరికీ కనపడకుండా తప్పించుకుతిరుగుతున్నారు. హిట్లర్‌ వల్ల జర్మనీ ఎలా నష్టపోయిందో చంద్రబాబు అసమర్థత వలన ఆంధ్ర జాతి నష్టపోతోంది. కుంభకర్ణుడైనా ఆర్నెళ్లకోసారి నిద్ర లేస్తాడు. చొక్కాలు చించుకున్నా, గుండ్లు కొట్టించుకున్నా ప్రజలు క్షమించే పరిస్థితిని దాటిపోయార’ని ఆమె అన్నారు. 


Back to Top