ప్రాణాలకంటే ముఖ్యమైనదేముంది? జగన్

హైదరాబాద్, ఆగస్టు 19: 'రాష్ట్రంలో మనుషులు ప్రాణాలకంటే ముఖ్యమైనవి ఏమీ లేవు. అందుకే శాంతిభద్రతల సమస్యపై చర్చ జరగాలని పట్టుబడుతున్నాం' అని శాసనసభలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం శాంతిభద్రతలపై చర్చ జరగాల్సిందేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టడం, అధికార టీడీపీ సభ్యులు ఎదురుదాడికి దిగడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ సమయంలో శ్రీ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, 'శాంతిభద్రతల సమస్యపై ఈరోజే చర్చ జరగాలి. బుధవారం దీనిపై అవకాశం ఇస్తామని చెబుతున్నారు. కానీ, బుధవారం బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ లో మీరు కేటాయింపులు చేసే అంశాలనుబట్టి నిలదీయాల్సి ఉంటుంది. ఈ రెండు రోజుల్లో మనుషుల ప్రాణాలకంటే ముఖ్యమైన చర్చలు ఏమున్నాయి? తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలైంది. ఈ మూడు నెలల్లో జరిగిన హత్యల గురించే అడుగుతున్నాను. గత చరిత్ర గురించి మాట్లడటం లేదు. వంగవీటి రంగాను చంపిన విషయం గురించి మాట్లడలేదు. ప్రజల సమస్యలపై చర్చకు ఎందుకు అవకాశమివ్వరు' అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.

Back to Top