రాష్ట్రం ఎటుపోతోంది?

  • వ్యవసాయ రంగంపై బాబుకు చులకన భావం
  • కలెక్టర్లకు కాకిలెక్కలు చెబుతున్న సీఎం
  • ఊకదంపుడు ఉపన్యాసాలతో ఉపయోగం లేదు
  • సమస్యలు పక్కనబెట్టి మంత్రులు, అధికారులతో బాబు షాపింగ్‌
  • వ్యవసాయ రంగాన్ని విస్మరిస్తే టీడీపీకి పుట్టగతులుండవ్
  • వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ
హైదరాబాద్‌: రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుదేలవ్వడానికి సీఎం చంద్రబాబే కారణమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. వృద్ధిరేటుకు కొలమానమేంటో తెలుసుకోకుండా సీఎం పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. అధిక శాతం మంది ప్రజలు ఆధారపడ్డ వ్యవసాయ రంగంపై సదస్సులో చర్చించారా అని ప్రశ్నించారు. వ్యవసాయ రంగమంటే బాబుకు చులకన భావమని బొత్స సత్యనారాయణ అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అధికశాతం జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడ్డారని తెలిపారు. ఇంత ప్రాధాన్యత గల రంగాన్ని ప్రభుత్వం విస్మరించిందన్నారు. రెండు రోజుల పాటు కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్ష  ఏర్పాటు చేసి ఈ రంగంపై చర్చించకపోవడం దుర్మార్గమన్నారు. వ్యవసాయ రంగంలో ఎలాంటి మార్పులు సంభవించాయి, రబీలో సాగు విస్తీర్ణమెంత అనే అంశాలపై చర్చించలేదన్నారు. నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ప్రజా సమస్యలను పక్కనబెట్టి మంత్రులు, అధికారులతో సీఎం షాపింగ్‌ చేయించారని బొత్స ఎద్దేవా చేశారు.

రబీలో తగ్గిన సాగు విస్తీర్ణం
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ ఏడాది రబీ సాగు విస్తీర్ణం ఐదు లక్షల హెక్టార్లు తగ్గిందని వైయస్‌ఆర్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలో 14 లక్షల హెక్టార్లలో రబీ సాగు చేసేవారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వ్యవసాయరంగం కుదేలైందన్నారు. సీఎం డ్యాష్‌బోర్డు లెక్కల ప్రకారం బాబు అధికారంలోకి వచ్చాక మొదటి సంవత్సరం 12.72 లక్షల హెక్టార్లు, రెండో ఏటా 13.14 లక్షల హెక్టార్లు సాగు చేశారన్నారు. ఈ ఏడాది 9 లక్షల హెక్టార్లకే సాగును పరిమితం చేశారన్నారు. రబీలో దేశ వ్యాప్తంగా సాగు పెరిగితే.. ఏపీలో తగ్గిపోయిందని, వీటిని బట్టీ ఈ ప్రభుత్వ పనితీరు ఎలాగుందో ఆలోచించాలని ప్రజలకు సూచించారు.   ఐదు లక్షల హెక్టార్ల మేర రాష్ట్రంలో సాగు తగ్గిందని, నదుల అనుసంధానం చేశామని గొప్పలు చెప్పుకున్నావారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

ఏపీ వృద్ధి రేటు 5 శాతమే
ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధిరేటు 5 శాశమే అని, దీనిపై చర్చకు వైయస్‌ఆర్‌సీపీ సిద్ధంగా ఉందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్‌ విసిరారు. చంద్రబాబుకు వృద్ధిరేటు కొలమానం ఏంటో తెలియదని ఎద్దేవా చేశారు. వ్యవసాయరంగం, సర్వీస్‌ సెక్టార్, పరిశ్రమలతో వృద్ధిరేటును కొలుస్తారన్నారు. అయితే రాష్ట్రంలో ప్రధానమైన వ్యవసాయరంగంపై టీడీపీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని మండిపడ్డారు. కలెక్టర్లకు కాకిలెక్కలు చెబుతూ..ఊకదంపుడు ఉపన్యాసాలతో ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్రం అట్టుడుకుంతుందన్నారు. చంద్రబాబు ఇచ్చిన లేఖ వల్లే నోట్ల రద్దు చేశారని గొప్పలు చెప్పుకోవడం తప్ప, కరెన్సీ కష్టాల నుంచి ప్రజలను ఎలా గట్టెక్కించాలో ప్రభుత్వం ఆలోచించడం లేదన్నారు. నోట్ల రద్దు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీతో రైతులు అప్పులపాలు అయ్యారని, బ్యాంకుల్లో రుణాలు పుట్టడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల వద్ద ప్రస్తుతం చిల్లిగవ్వ కూడా లేదని, కూలీలకు కూలి డబ్బులు ఇచ్చేందుకు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎంతసేపు డిజిటల్, ఆన్‌లైన్‌ లావాదేవీలు అంటూ కాలయాపన చేస్తున్నారని బొత్స సత్యనారాయణ విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని విస్మరిస్తే టీడీపీకి పుట్టగతులుండవని ఆయన హెచ్చరించారు.
 
Back to Top