సీఎంనని చెప్పుకోవడానికి విదేశీ పర్యటనలు

  • లోకేష్, సీఎం రమేష్‌లు దేనిలో పరిజ్ఞానవంతులు చంద్రబాబూ
  • దోపిడీ సొమ్ము ఎలా దాచుకోవాలో లోకేష్‌కు నేర్పిస్తున్నారా?
  • మీ పార్టీ ఎంపీనే బాబు టూర్లతో ఒరిగిదేమీలేదంటున్నారు
  • నాలుగేళ్లగా తెచ్చిన పరిశ్రమలను ఏ మూలన దాచిపెట్టారు
  • 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చామనడం సిగ్గుచేటు
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిని అని ప్రపంచానికి చెప్పుకోవడానికి చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బహ్మానందరెడ్డి విమర్శించారు. చంద్రబాబు పర్యటనలతో ఆంధ్రరాష్టం అప్పులపాలైందని ధ్వజమెత్తారు. సింగపూర్, జపాన్, చైనా, అమెరికా, బ్రిటన్, దావోస్, లండన్, థాయ్‌లాండ్, దక్షిణ కొరియా దాదాపు 17 సార్లు తిరిగి సాధించింది ఏంటీ చంద్రబాబూ అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో బత్తుల బ్రహ్మానందరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విదేవీ పర్యటనల పేరుతో దాదాపు 50 నుంచి 55 రోజులు విదేశీల్లో సాధించింది శూన్యమన్నారు. బాబాయ్‌ హోటల్‌ పెట్టి కౌంటర్‌ ఏర్పాటు చేసుకొని కావాల్సింది తింటూ బస్సుల్లో ప్రచారం చేసుకుంటూ.. సీఎంనని చంద్రబాబు అందరికీ పరిచయం చేసుకుంటున్నారన్నారు.
 
చంద్రబాబు పర్యటన తీరుపై బత్తుల బ్రహ్మానందరెడ్డి ఒక ఊదాహరణ చెప్పారు. ‘అనుభవం సంపాదించాను నాన్న అమెరికా వెళ్తే వ్యాపారం బాగుంటుందంటే ఆ తండ్రి కొడుకుకు రూ. 2 కోట్లు తెచ్చిస్తాడు. వాటిని తీసుకొని కొడుకు విదేశాలకు వెళ్లి జల్సాలు చేస్తుంటాడు. అవి చాలక ఇంకా డబ్బులు పంపించమంటాడు. తండ్రి స్తోమతకు మించి అప్పులు చేసి పంపిస్తూనే ఉంటాడు.. కొడుకు జల్సాలు చేస్తూనే ఉంటాడు. విదేశాలు తిరిగి కొడుకు ఏం సాధించాడంటే.. రూ. 25 కోట్లు అప్పు. కొడుకు గాలితిరుగుడుతో ఆ కుటుంబం దివాలా తీసింద’ని చెప్పారు. అలాగే ఆంధ్రరాష్ట్ర పరిస్థితి కూడా తయారైందన్నారు. అనుభవం ఉందని చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తే విదేశాలు తిరుగుతూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడని మండిపడ్డారు. 

సీఎం రమేష్‌కు, లోకేష్‌లు దేనిలో అనుభవజ్ఞులు, దేనిలో పరిజ్ఞానవంతులని వారిని విదేశాలకు తీసుకెళ్తున్నారు బాబూ అని బత్తుల బ్రహ్మానందరెడ్డి ప్రశ్నించారు. వారిని ఉపయోగించి సాధించిన ప్రగతి ఏంటని విరుచుకుపడ్డారు. సీఎంకు కాంట్రాక్టులు చేయడంలో తప్ప దేనిలోనైనా అనుభవం ఉందా.. అలాగే లోకేష్‌కు దేనిలో అనుభవం ఉందో.. ప్రపంచానికి మొత్తం తెలుసని ఎద్దేవా చేశారు. దోపిడీ సొమ్మును తీసుకెళ్లి విదేశాల్లో ఏ విధంగా దాచుకోవాల్సిన తెలియజేసేందుకు తీసుకెళ్లారని స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. 

చంద్రబాబు 42 సార్లు ఢిల్లీ పర్యటనతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్‌ చెబుతున్నారని బత్తుల గుర్తు చేశారు. ఢిల్లీకి వెళ్లి ఏం సాధించారంటే సరైన సమాధానం లేదన్నారు. ప్రత్యేక హోదాను సాధించారా.. ప్యాకేజీని తీసుకువచ్చారా..? విభజన చట్టంలోని 13వ షెడ్యుల్‌ ప్రకారం ఏ ఒక్కటైనా అమలు జరిగిందా అని బత్తుల ప్రభుత్వాన్ని నిలదీశారు. చంద్రబాబు తన రాజకీయ స్వార్థం కోసం, దోపిడీ సొమ్మును రక్షణ కల్పించుకునేందుకు ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారన్నారు. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న విదేశీ పర్యటనలను ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గాలి పర్యటనలుగా భావిస్తుందని బత్తుల స్పష్టం చేశారు. 2016 మొదటి సీఐఐ సమ్మిట్‌లో రూ. 4,78,788 కోట్ల పెట్టుబడులు తెస్తా. 10,27,121 ఉద్యోగాలు తెస్తున్నామని ప్రకటించారు ఒక్క రూపాయి అయినా తీసుకువచ్చారా..? 2017లో రెండో సీఐఐ సమ్మిట్‌లో రూ. 10.54 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. 22.34 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నామని ప్రకటించారు. మీరు చెప్పిన వాటిల్లో ఒక్క వెయ్యి మందికి ఉద్యోగాలు ఇచ్చారా..చంద్రబాబూ అని ప్రశ్నించారు. పరిశ్రమలు వస్తే ఆంధ్రరాష్ట్రంలో ఏ మూలన దాచిపెట్టారో చెప్పండీ అని ఎద్దేవా చేశారు. 

తెలుగుదేశం పార్టీ అబద్ధాల బాగోతాన్ని వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ఎండగట్టారని బత్తుల గుర్తు చేశారు. రెండు పాట్నర్‌షిప్‌ సమ్మిట్‌లలో కలిపి రూ.15,33,219 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 16,29 వేల ప్రాజెక్టులకు ఒప్పందాలు జరగగా. అత్యధిక ఎంఓయూలు డీపీఆర్‌లకే నోచుకోలేదని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి అర్జున్‌రావు మేఘవాల్‌ సమాధానం ఇచ్చారన్నారు. అంటే చంద్రబాబు ప్రతీది మసిపూపి మారేడు కాయచేసినట్లు ప్రచారం చేసుకోవడం తప్ప.. సాధించింది ఏమైనా ఉందా..అని నిలదీశారు. 2017 జనవరిలో విశాఖ మహిళా పారిశ్రామిక సదస్సులో 18 శాఖల పరిధిలో 19 వందల ఎంఓయూలు కుదుర్చుకున్నారని, వీటికి సంబంధించి రూ.13.47 లక్షల కోట్ల పెట్టుబడులు, 30 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి.. 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు. మీ గారడీ మాటలతో ఇంకా ఎంతకాలం మోసం చేస్తారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా పరిపాలన చేస్తుంటే ఎవరైనా మీ మొహం చూపి పెట్టుబడులు పెట్టేందుకు వస్తారా చంద్రబాబూ అని నిలదీశారు.  
 
Back to Top