వెంకన్న సాక్షిగా మోసం చేసి తిరుపతిలో దీక్ష చేస్తారా?

అవినీతి బయటపడుతుందనే భయం
భద్రత ఇవ్వాల్సిన వ్యక్తే ప్రజలను భద్రత కోరడం విడ్డూరం
ఆ నలుగురు రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశారు

దేవినేనికి దమ్ముంటే.. మైలవరం నుంచే పోటీ చేయాలి
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్‌ సవాల్‌

విజయవాడ: అవినీతి, అక్రమాలు బయటపడతాయనే భయంతో చంద్రబాబు ప్రజల మద్దతు కోరే ప్రయత్నం చేస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్‌ విమర్శించారు. ముఖ్యమంత్రిగా ప్రజలకు భద్రతగా ఉండాల్సిన వ్యక్తి తనకు భద్రత ఇవ్వాలని ప్రజలను కోరడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మేరకు విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో వెల్లంపల్లి శ్రీనివాస్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటుకు కోట్ల కేసులో భయపడి హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చి అమరావతిలో తలదాచుకున్న చంద్రబాబు గతంలో ఏ విధంగా భయపడుతూ.. టీఆర్‌ఎస్‌పై మాకు సీబీఐ, సీఐడీ ఉందని మాట్లాడారో.. అదే విధంగా అవినీతి బయటపడుతుందని సానుభూతితో ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నాడన్నారు. తప్పు చేశాడు కాబట్టే చంద్రబాబు కేంద్రానికి బయపడుతున్నారన్నారు. 

నాలుగేళ్లలో ఆంధ్రరాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని వెల్లంపల్లి విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రూ. 80 వేల కోట్లు ఉంటే.. విభజన తరువాత ప్రత్యేక రాష్టాన్ని రూ. 2.25 లక్షల కోట్ల అప్పుల్లో ముంచాడని ధ్వజమెత్తారు. తిరుపతిలో 30వ తేదీన దీక్ష చేస్తానని చంద్రబాబు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రాన్ని నిలువునా మోసం చేసిన చంద్రబాబుకు దీక్ష చేసే అర్హత లేదన్నారు. 2014లో తిరుపతి వెంకన్న సాక్షిగా నరేంద్రమోడీ, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, వెంకయ్యనాయుడు కలిసి రాష్ట్ర ప్రజలను వంచించారని విరుచుకుపడ్డారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బీజేపీతో కలిసి పోతుందని చంద్రబాబు తన తోకపత్రికలు, ఛానళ్ల ద్వారా ప్రచారం చేయిస్తున్నాడని మండిపడ్డారు. నిన్న కేంద్రమంత్రి రాందాస్‌ ఎన్డీయేలోకి టీడీపీని తిరిగి ఆహ్వానిస్తున్నామనే మాటలను ఎందుకు పచ్చమీడియా పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. 

దేవినేని ఉమా నీటి పారుదల శాఖామంత్రో.. లేక బూతు శాఖామంత్రో అర్థం కావడం లేదని వెల్లంపల్లి అనుమానం వ్యక్తం చేశారు. ఎప్పుడు చూసినా వైయస్‌ జగన్‌ జపం తప్ప.. మరొకటి లేదన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబుతో పాటు దేవినేని ఉమా అవినీతిలో ఇరుక్కోక తప్పదన్నారు. పట్టిసీమ, పోలవరం, పురుషోత్తపట్నం ఇలా అన్నింట్లో డబ్బులు దండుకున్నారన్నారు. దేవినేని ఉమకు దమ్మూ, ధైర్యం ఉంటే 2019 ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని సవాలు విసిరారు. ప్రజల కోసం పోరాటాలు చేసే వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడే అర్హత దేవినేని ఉమకు లేదన్నారు. 
104 ఉద్యోగులకు అండగా ఉంటాం..
దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పథకాలను నీరుగార్చేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని వెల్లంపల్లి మండిపడ్డారు. 104 ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత 12 రోజులు దీక్షలు చేస్తున్నారన్నారు. అయినా ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యోగులకు వైయస్‌ఆర్‌ సీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. వెంటనే ప్రభుత్వం దిగివచ్చి వారి సమస్యలు పరిష్కరించాలని, ప్రమాదంలో చనిపోయిన 104 డ్రైవర్, స్టాఫ్‌నర్స్‌ కుటుంబాలను ఆదుకోవాలన్నారు. లేనిపక్షంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 13 జిల్లాలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. 
Back to Top