పక్కా గృహాల హామీ ఏమైంది బాబూ..?

నెల్లూరు రూరల్‌: పేదలకు పక్కా గృహాల మంజూరులోప్రభుత్వానికి జాప్యం ఎందుకని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రశ్నించారు. నియోజకవర్గ పరిధిలోని 31వ డివిజన్, కొత్తూరు, అరుందతీయవాడలో అగ్ని ప్రమాదంతో ఇళ్లు దగ్ధమై రోడ్డునపడ్డ బాధితులను ఎమ్మెల్యే పరామర్శించారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు నిత్యవసర వస్తువులు తదితర ఆర్థిక సాయం చేసి అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..పేదలందరికీ పక్కా గృహాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా...ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క ఇళ్లు కూడా కట్టించలేదన్నారు. ఎన్నికల్లో ఓటు దండుకోవడానికి అబద్ధపు హామీలను ప్రజలపై కురిపించి అధికారంలోకి రాగానే వారి జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే పేదలకు పక్కా గృహాలను కట్టించాలని డిమాండ్‌ చేశారు.


Back to Top