చంద్రబాబు, కిరణ్ చేసిన మేలేమిటి?

రాచపల్లి(రమణ మహర్షి ఆశ్రమం) తూర్పు గోదావరి జిల్లా 19 జూన్ 2013:

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు, ఇప్పుడు కిరణ్ ఎస్టీలకు ఏం మేలు చేశారని శ్రీమతి వైయస్ షర్మిల ప్రశ్నించారు. ఎస్టీలకు అదిచేశా ఇది చేశానని చెప్పుకుంటూ టీవీలలో ప్రకటనలకే కిరణ్ కుమార్ రెడ్డి పరిమితమవుతున్నాడనీ, ఆయనేమైనా చేశారా చెప్పగలరా అని కూడా ఆమె అడిగారు. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని రమణ మహర్షి ఆశ్రమం వెలిసిన రాచపల్లి గ్రామంలో శ్రీమతి షర్మిల బుధవారం సాయంత్రం రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత ఆమె స్థానికుల సమస్యలను సావధానంగా విన్నారు. తదనంతరం ప్రసంగిస్తూ తనదైన శైలిలో కిరణ్, చంద్రబాబు వైఖరిపై నిప్పులు కురిపించారు. వారిద్దరికీ ఎస్టీలమీద ప్రేమ లేదన్నారు. ప్రచారం చేసుకోకుండా ఎస్సీ, ఎస్టీల మీద ప్రేమ చూపించిన ఏకైక వ్యక్తి దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారని ఆమె అన్నప్పడు ఆ ప్రాంతం చప్పట్లతో మార్మోగింది. ప్రేమ ఉంది కనకే రాజన్న 20 లక్షల ఎకరాల అటవీ భూమిపై ఎస్టీలకు హక్కు కల్పించారని గుర్తుచేశారు. ఇది రాష్ట్ర చరిత్రలో ఎవరూ చేయలేదని స్పష్టంచేశారు. అలా భూమి పొందిన వారు ఇప్పటికీ రాజశేఖరరెడ్డి గారిని తమ గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారని తెలిపారు. రాజన్న ప్రతి పథకంలోనూ ఎస్టీలకు, వెనుకబడిన తరగతుల వారికీ పెద్ద పీట వేశారనీ, చదువుకోవాలని వారిని కూడా ఫీజు రీయింబర్సుమెంటు పథకంలో చేర్చారని చెప్పారు. ఎస్టీలందరినీ ఆరోగ్యశ్రీలో చేర్చారు. ప్రతి ఒక్కరికీ వైద్యం అందాలి.. ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలి అని ఆయన అభిలషించారన్నారు. ఆయన ఉన్నంత వరకూ అంతా బాగానే ఉంది. ఎస్టీలకు 150 రోజుల పాటు 120రూపాయల చొప్పున ఉపాధి హామీ కింద ఉపాధి కల్పించారని చెప్పారు. ఇచ్చిన భూములను సాగులోకి తేవడానికి అవసరమైన పనులను కూడా రాజశేఖరరెడ్డిగారు ఉపాధి హామీలోనే చేర్చారని శ్రీమతి షర్మిల తెలిపారు.

ప్రస్తుతం ఉపాధి హామీలో పనిచేస్తున్న వారికి ఎవరికైనా కూలీ ఇస్తున్నారా,  వంద రోజులు మించి పని ఇస్తున్నారా  అని ప్రశ్నించగా లేదని గిరిజనులు సమాధానం చెప్పారు. మూణ్ణెల్లకోసారి 80, 100రూపాయల చొప్పున ఇస్తున్నారని శ్రీమతి షర్మిల ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎవరికైనా వంద రూపాయలు మించి రావడంలేదన్నారు. కొన్ని చోట్ల యాబై, ముప్పై, ఇరవైరెండు రూపాయలు ఇచ్చారట. దీన్ని శ్రమ దోపిడీ అనరా? ఇది రాక్షస రాజ్యం కాదా? అని అడిగారు. ఈ ప్రభుత్వం మనసు, మానవత్వం ఉన్నట్లు కనిపిస్తోందా.. పేదలంటే కనికరం ఉందా.. ఎస్టీలంటే ప్రేమ ఉందా అని అడిగినప్పుడు లేదు..లేదు.. అని పెద్ద పెట్టున సమాధానం చెప్పారు. అన్నీ ఉత్తి మాటలే చెబుతున్నారనీ, కిరణ్ మాటలన్నీ ప్రకటనలు ఇచ్చుకోవడానికే పనికొస్తున్నాయనీ తెలిపారు. యువకిరణాలు అంటున్నారు గానీ..ఉద్యోగాలు రావడం లేదనీ ఒకామె చెప్పిందన్నారు. పావలా వడ్డీ రుణాలంటున్నారు గానీ ఎవరికీ అందడం లేదంటున్నారని తెలిపారు.

ఒక కొత్త ఇల్లు, రేషను కార్డు, పింఛను రాలేదన్నారు. ఈ ప్రభుత్వానికి మనసు లేదనడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదన్నారు. వారికిచ్చే 200, 500లలో కత్తెర పెడుతున్నారంటే రాక్షసులు కాక వీరినేమనాలి అని ప్రశ్నించారు. మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు, ఆపై అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయనీ, రాజన్న రాజ్యం రావాలని మీరంతా కోరుకుంటే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీనీ, జగన్మోహన్ రెడ్డినీ గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. జగనన్న ఏ తప్పు చేయలేదన్నారు. త్వరలోనే బయటికొస్తారనీ, ధర్మం తప్పక గెలుస్తుందనీ శ్రీమతి షర్మిల స్పష్టంచేశారు. జగనన్న వచ్చిన తర్వాత రాజన్న రాజ్యాన్ని తెస్తాడన్నారు.

రాజన్న రాజ్యంలో జగనన్న చెప్పిన ప్రతి మాటనూ నిలబెట్టుకుంటాడని చెప్పారు. అందరికీ 30 కిలోల బియ్యం తప్పకుండా ఇస్తారు. ఎస్టీలు, ప్రతి పేదవాడికీ పక్కా ఇల్లు కట్టించే బాధ్యతను జగనన్న తన భుజాలమీద వేసుకుంటాడన్నారు. మన పిల్లలు పెద్ద చదువులు చదువుకుంటారని భరోసా ఇచ్చారు. పెద్ద ఉద్యోగాలూ చేస్తారన్నారు. భూమి మీద హక్కురావాలన్నా.. మంచి రోడ్డు కావాలన్నా ఏం కావాలన్నా మంచి వాడు రాజు కావాలి. రాజు మంచి మనసున్న వాడైతేనే ప్రజలకు మేలు చేయగలుగుతాడు. రాజన్నను మీరు దగ్గరినుంచి చూశారు. జగన్మోహన్ రెడ్డిగారికి కూడా అంతే మంచి మనసుంది. మీరు ఆశీర్వదిస్తే రాజన్న రాజ్యం తప్పకుండా వస్తుందన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత వైయస్ఆర్ అమ్మ ఒడి అనే అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెడతారని చెప్పారు. అందులో మన అక్క చెల్లళ్ళకు వారి ఇద్దరి పిల్లలను చదివించుకునేందుకు నెలకు 500 చొప్పున ఏడాదికి ఆరు వేల రూపాయలు అమ్మ బ్యాంకుఖాతాలోనే జమవుతుందని శ్రీమతి షర్మిల తెలిపారు. ఇంటర్ 700, డిగ్రీకి  వెయ్యి చొప్పున బ్యాంకులో పడుతుంది. రైతులు, మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తారు. ఇది కిరణ్ మాదిరిగా ఉత్త మాట కాదు. ఇది రాజన్న తనయుడి మాట. ఆయనిచ్చిన మాటకు విలువుంది మీరు నమ్మాలి. ఇవన్నీ నెరవేరాలంటే ఏ ఎన్నికలొచ్చినా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని శ్రీమతి షర్మిల విజ్ఞప్తి చేశారు.

అంతకు ముందు ఆమె గ్రామంలో గిరిజనులు తమ జీవన విధానం ఎలా ఉంటుందో తెలిపేలా ఏర్పాటు చేసిన ప్రయోగాత్మక ప్రదర్శనను తిలకించారు. వారి ఆటపాటలను చూశారు. వారితో మమేకమై మాట్లాడారు.

Back to Top