సమైక్యం కోసం ఆ పార్టీలు ఏం చేస్తున్నాయి?

హైదరాబాద్ :

రాష్ట్రం ముక్కలు కాకుండా సమైక్యంగా ఉంచేందుకు కాంగ్రెస్, టీడీపీలు ఒక్క ప్రయత్నమైనా చేస్తున్నాయా? అని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ కేంద్ర పాలక‌ మండలి సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు సూటిగా ప్రశ్నించారు. సమైక్యాంధ్ర కోసం వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి జాతీయ పార్టీల నేతలను కలవడంతో పాటు అన్ని ప్రాంతీయ పార్టీల అధినేతలను, ముఖ్యమంత్రులను కలసి మద్దతు కూడగడుతున్నారని ఆయన తెలిపారు. దానిని ఓర్వలేక కాంగ్రెస్, టీడీపీ నాయకులు కలసి ఒకే మాటను వల్లెవేస్తూ తమపై బురద చల్లుతున్నారని దుయ్యబట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జూపూడి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న దుర్మార్గమైన చర్యలను తిప్పికొట్టాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆ పని చేయకపోగా కొబ్బరికాయ సలహాలిస్తూ విభజనను వెనకేసుకు వస్తున్నారని జూపూడి మండిపడ్డారు. జూలై 30న సీడబ్ల్యూసీ ప్రకటన వెలువడిన తర్వాత నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు కావాలని చంద్రబాబు అడగటం, అదే లైన్‌లో కేంద్రం ముందుకు వెళ్లడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

సీమాంధ్ర ఎంపీలు, కేంద్రమంత్రులు తెలుగు ప్రజల మనోభావాలను గాలికి వదిలేసి సిగ్గు లేకుండా సొల్లు కబుర్లు చెబుతున్నారని జూపూడి దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేసిందంటూ దొంగ ఏడుపు ఏడుస్తున్న లగడపాటి రాజగోపా‌ల్ ఇంకా అదే పార్టీలో ఎందుకు కొనసాగుతు‌న్నారని సూటిగా ప్రశ్నించారు. వారికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు వెంటనే రాష్ట్రపతి వద్దకు వెళ్లి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు.

బం‌ద్‌కు బాబు ఎందుకు మద్దతు ఇవ్వలేదు? - వాసిరెడ్డి పద్మ :
రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ, దీనివల్ల నష్టపోయే ప్రాంతాల్లో జరుగుతున్న బం‌ద్‌కు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎందుకు మద్దతివ్వలేదని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. విభజన‌ వల్ల సీమాంధ్ర ప్రాంతానికి నష్టం జరగడంలేదని బాబు భావిస్తున్నారా? విభజనను సమర్థిస్తున్నారా? అని అడిగారు. వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ పిలుపు మేరకు బం‌ద్‌ను విజయవంతం చేసినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యున‌ల్‌ను అడ్డుపెట్టుకొని కృష్ణానదీ మిగులు జలాలు దక్కకుండా చేసిన సోనియాగాంధీ చర్యలను సుప్రీంకోర్టులో సవాలు చేయాలని తమ అధినేత శ్రీ జగన్ నిర్ణయించారని చెప్పారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top