ఇదెక్కడి ప్రజాస్వామ్యం

చంద్రబాబు నిరంకుశ పాలన
చట్టాలను చుట్టాలుగా మార్చుకున్న బాబు
లేని అధికారాల్ని చేతుల్లోకి తీసుకొని..
చట్టాల్ని దుర్వినియోగం చేస్తున్నారు
అలా మాట్లాడినందుకు బాబును..
ఇంకెన్ని రోజులు సస్పెండ్ చేయాలి
రోజా సస్పెన్షన్ పై న్యాయపోరాటం కొనసాగిస్తాం

హైదరాబాద్ : చట్టవ్యతిరేకంగా, న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని వైఎస్సార్సీపీ మహిళలు  ఎమ్మెల్యేలు మండిపడ్డారు. లోటస్ పాండ్లో పార్టీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రోజా సభకు వెళ్లేందుకు  హైకోర్టు ఆదేశాలిచ్చినా కూడా ప్రభుత్వం అడ్డగించడం దారుణమని ఉప్పులేటి కల్పన ఫైరయ్యారు. లేని అధికారాల్ని చేతుల్లోకి తీసుకొని  చట్టాల్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. కావాలనే రోజా పట్ల ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందునే.... ప్రతిపక్ష సభ్యులను టార్గెట్ చేసి గొంతు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

న్యాయవ్యవస్థల పట్ల తమకు గౌరవముందని మాట్లాడిన చంద్రబాబు...న్యాయవస్థలు ఇచ్చిన తీర్పును ఎందుకు గౌరవించడం లేదని ప్రశ్నించారు.  ప్రతిపక్షం లేకుండా చేస్తామని చినబాబు, పెదబాబులు మాట్లాడుతున్నారని...ఇదెక్కడి ప్రజాస్వామ్యమో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణలో అలా మాట్లాడినందుకే గ్రేటర్ లో ప్రజలు టీడీపీకి ఒక్క సీటుతో సరిపెట్టారన్నారు. ప్రతిపక్షం లేకుండా చేయడం మీ వల్ల కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్దంగా, న్యాయవ్యవస్థల్ని గౌరవించడం నేర్చుకోవాలని టీడీపీకి హితవు పలికారు. 

ఎమ్మెల్యే రోజాను శాసనసభలోకి అనుమతించకపోవడం బాధాకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. రోజాను సభలోకి రాకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా అభివర్ణించారు.  హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను కూడా పట్టించుకోరా? అని ఆమె ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇవాళ శాసనసభా ప్రాంగణం యుద్ధ వాతావరణాన్ని తలపించిందని ఇదంతా చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? చంద్రబాబు నిరంకుశ పాలనలో ఉన్నామా అనిపిస్తుందన్నారు. కోర్టుకంటే తామే పెద్దవాళ్లమంటూ న్యాయస్థానాల ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్నారని మండిపడ్డారు. 

కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి మరీ రోజాను అడ్డుకోవడం దారుణమని గిడ్డి ఈశ్వరి అన్నారు. చట్టాన్ని చుట్టంగా మార్చుకుని పాలన కొనసాగిస్తున్నారని ఆమె మండిపడ్డారు. అకారణంగా రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేశారని, కనీసం ఆమెనుంచి సంజాయితీ కూడా కోరలేదన్న విషయాన్ని గుర్తు చేశారు.ఎమ్మెల్యే రోజాను టార్గెట్ చేస్తున్నారని, వ్యక్తిగత దూషణలతో పాటు, కేసులు పెట్టి వేధిస్తున్నారని గిడ్డి ఈశ్వరి కోపోద్రిక్తులయ్యారు. 

చంద్రబాబు పాలనలో మహిళలకు అన్యాయం చేస్తున్నారని, మహిళా జాతినే కించపరుస్తున్నారన్నారు. రోజా అనుచిత వ్యాఖ్యలు చేసిందనే సభ నుంచి సస్పెండ్ చేశామని చెబుతున్నారని, మరి ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అన్న చంద్రబాబు నాయుడును ఎన్నిరోజులు సస్పెండ్ చేయాలని గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలను అనుసరించి ఎమ్మెల్యే రోజాను సభకు అనుమతించాలని ఆమె డిమాండ్ చేశారు. రోజా సస్పెన్షన్పై పోరాటం కొనసాగిస్తామని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తేల్చిచెప్పారు. 
 
Back to Top