దేశ సంస్కృతిని మంటగలుపుతున్న ఏపీ సీఎంబాబు బికినీ ఫెస్టివల్‌పై బీజేపీ స్టాండ్ ఏంటో?వెంకయ్య మంగళ సూత్రాలు అందిస్తారా?బికినీ ఫెస్టివల్‌కు వైయస్‌ఆర్ సీపీ వ్యతిరేకంవైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబుగుంటూరు: విదేశాల మోజుతో చంద్రబాబు వింతగా ప్రవర్తిస్తున్నారని, బీచ్ ఫెస్టివల్ పేరుతో దేశ సంస్కృతిని మంటగలుపుతున్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. దేశ ఆచారాలను గౌరవించకపోగా విదేశీ విష సంస్కృతిని దించాలనుకోవడం సరైంది కాదన్నారు. బికినీ ఫెస్టివల్‌కు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని, ఈ విషయంలో చంద్రబాబు పునరాలోచించుకోవాలని అంబటి సూచించారు. గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా విదేశాలపై చంద్రబాబుకు అంతగా మోజుంటే కుటుంబ సమేతంగా వెళ్లాలి కానీ, విదేశీ సంస్కృతిని తీసుకురావడం చాలా బాధాకరమన్నారు. బాబు బీచ్ ఫెస్టివల్‌ను మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, స్వచ్చంద సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు.
చంద్రబాబుకు తోడైన మరో ప్రేమపక్షి భారతీయ జనతా పార్టీ దీనికి సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబుతో చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న వెంకయ్య బీచ్ ఫెస్టివల్‌పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ స్టాండ్ ఏంటో చెప్పాల్సిన బాధ్యత వెంకయ్యకు ఉందన్నారు. ఫిబ్రవరి 14వ తేదిన జరిపే ప్రేమికుల రోజును వ్యతిరేకించే బీజేపీ అనుబంధ సంస్థలు (ఏబీవీపీ, జనసంఘ్, ఆర్‌ఎస్‌ఎస్, భజరంగ్‌దళ్) పార్కుల్లో ప్రేమజంటలు కనిపిస్తే చట్టాలకు వ్యతిరేకంగా దాడులు చేసి మంగళ సూత్రాలు ఇచ్చి పెళ్లీళ్లు చేస్తాయన్నారు. బీజేపీ అనుబంధ శాఖలన్నీ విదేశీ విష సంస్కృతికి వ్యతిరేకంగా వ్యవహరిస్తాయని చెప్పారు. మరి విశాఖ బీచ్ ఫెస్టివల్‌కు చంద్రబాబు 9 వేల మందిని ఆహ్వానిస్తుంటే వారికి 9 వేల మంగళ సూత్రాలు ఇచ్చి పెళ్లీళ్లు చేసేందుకు మీ పార్టీ అనుబంధ సంస్థలు కృషి చేస్తాయా వెంకయ్యనాయుడు అని ప్రశ్నించారు.
కమీషన్ల కోసమే ఈ తంతుదేశ ఆచారాలను కించపరిచే చంద్రబాబు బికినీ ఫెస్టివల్ నిర్వహిస్తుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ హరిబాబు సొంగేసుకొని చూస్తున్నారు తప్ప అడ్డుకునే బాధ్యత లేదా అని అంబటి ప్రశ్నించారు. రాజధాని నిర్మాణంలోలాగే బీచ్ ఫెస్టివల్‌లో కూడా కమీషన్ల కక్కుర్తి ఉందని విమర్శించారు. మనవాళ్లు రాజధాని కడితే మురికివాడలవుతాయని చెప్పిన చంద్రబాబు విదేశీయులు కడితే బ్రహ్మాండంగా ఉంటుందని మాట్లాడారని గుర్తు చేశారు. ఈ ఫెస్టివల్‌లో కూడా అదే తంతు జరుగుతుందన్నారు. బాంబేకి సంబంధించిన ‘పాజిటివ్ గ్లోబల్ సర్వీస్ అండ్ కన్సల్టెన్సీ అనే సంస్థకు వందల కోట్లు డబ్బు ఇచ్చి జరిపిస్తున్నారన్నారు. వారి నుంచి చంద్రబాబు తనయుడు లోకేష్ కమీషన్ల రూపంలో దండుకొనే పిచ్చి కార్యక్రమం అని ఎద్దేవా చేశారు. బీచ్ ఫెస్టివల్‌ను ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా నిర్వహిస్తుంటే వారికి అనుమతులు ఇవ్వాలా వద్దా అని ఆలోచించాల్సిన ప్రభుత్వమే ఇలా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. ఈ ఫెస్టివల్‌ను బీజేపీ అనుబంధ సంస్థలు వ్యతిరేకిస్తే వారికి వైయస్‌ఆర్ సీపీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. చూస్తూ ఊరుకుంటే బాబు రేపోమాపో పేకాట క్లబ్బులు, రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహిస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. పర్యాటక రంగం వంకతో విష సంస్కృతిని తీసుకువస్తున్న ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ఈ ఫెస్టివల్‌పై పునరాలోచించాలని సూచించారు. లేనిపక్షంలో ప్రధాన ప్రతిపక్షంగా చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.
త్వరలో విజయవాడకు పార్టీ కార్యాలయంసాధ్యమైనంత త్వరలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని అంబటి స్పష్టం చేశారు. పార్టీ ఆఫీస్ తరలించాలనే ఆలోచనలో అధిష్టానం ఉందని చెప్పారు. శాసనసభ, మండలి సమావేశాలు విజయవాడలోనే నిర్వహిస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించారని, తాత్కాలిక కార్యాలయంలో, తాత్కాలిక మండలి, తాత్కాలిక శాసనసభలో నిర్వహించ తలపెట్టిన దృష్ట్యా అతి త్వరలోనే వైయస్‌ఆర్ సీపీ కార్యాలయం ఏర్పాటవుతుందని చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించారు.