'టి' నిర్ణయానికి ప్రాతిపదిక ఏమిటి: అంబటి

హైదరాబాద్ 13 ఆగస్టు 2013:

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ నాయకత్వం రోజుకో కొత్త నాటకమాడుతోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంటి రాంబాబు మండిపడ్డారు. రాజ్యసభలో సోమవారంనాడు తెలంగాణ అంశంపై చర్చ తర్వాత చిదంబరం ఇచ్చిన సమాధానాన్ని సునిశితంగా పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుందని ఆయన పేర్కొన్నారు. రాజ్యసభలో చిదంబరం పొంతనలేని సమాధానాలు చెప్పారన్నారు.  రాష్ట్ర విభజనకు ఏ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ వెల్లడించిన అభిప్రాయాన్నే ప్రాతిపదికగా తీసుకున్నారా? లేక జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకున్నారా? ఇదీ కాకపోతే తెలుగు దేశం పార్టీ ఇచ్చిన లేఖే దీనికి కారణమా? వెంటనే స్పష్టంచేయాలని అంబటి నిలదీశారు. ఇవేవీ కావు.. తాము తీసుకున్న నిర్ణయంతోనే ముందుకు వెడతామనో లేదా. .. నిర్ణయం తమ ఇష్టమనో చెప్పదలచుకున్నప్పటికీ కాంగ్రెస్ దానిని విస్పష్టంగా ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. తెలంగాణపై నిర్ణయం అయిపోయింది ఈ సమావేశంలోనో వచ్చే సమావేశంలోనో బిల్లు పెడతారని కాంగ్రెస్ నాయకులు, దానికి కాలపరిమితి లేదనీ..తేదీ చెప్పలేననీ రాజ్యసభలో చిదంబరం చెబుతున్నారని చెప్పారు. తద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందని అంబటి మండిపడ్డారు. నిర్ణయానికి ముందు చర్చలు జరిగినట్లు చిదంబరం రాజ్యసభలో చెప్పారనీ.. ఎవరితో చర్చించి రాజకీయ పార్టీగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందో చెప్పాలన్నారు. తెలంగాణ నిర్ణయంపై ఇక వెనక్కి తగ్గేది లేదని సోనియా గాంధీ అంటుండగా, అది కేవలం పార్టీ నిర్ణయం మాత్రమేనని చిదంబరం చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని అడిగారు. చర్చలు, సంప్రతింపులు ముగిశాయన్నప్పుడు ఆంటోని కమిటీని ఎందుకు వేశారు? చెప్పదలచుకున్న అంశాలను ఆ కమిటీ దృష్టి తీసుకెళ్ళాలని అనడం వెనుక ఉద్దేశమేమిటని అంబటి అడిగారు. కాంగ్రెస్ పార్టీగా తన నిర్ణయం ప్రకటించిన తర్వాత దానిపై అన్ని ప్రాంతాల అభిప్రాయాలూ తీసుకుని ఓ తండ్రి హోదాలో నిర్ణయం తీసుకోవాలని తాము కోరుతున్నామని చెప్పారు. అలాకాకుండా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తన సొంత వ్యవహారమని భావిస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయన్నారు. ఈ అంశంపై చిదంబరం రాజ్యసభను తప్పుదోవ పట్టించారని దుయ్యబట్టారు.

శ్రీకృష్ణ కమిటీ ఆరో సిఫార్సును ఎందుకు విస్మరించారు?
రాష్ట్ర విభజన నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ రావడానికి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఎంతో సమాచారాన్నిచ్చిందని చిదంబరం చెప్పారనీ, అంటే ఆ కమిటీ నివేదికను దీనికి ప్రాతిపదికగా తీసుకున్నారని భావించవచ్చా అని అడిగారు. ఇదే నిజమైతే ఆ కమిటీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం అన్నింటికంటే ఉత్తమమైనదని చేసిన ఆరో సిఫార్సును కాంగ్రెస్ విస్మరించిందా అని ప్రశ్నించారు. తమది తొందరపాటు నిర్ణయం కాదని ఒకవైపు చెబుతూనే అందరితో మాట్లాడాతమనడంలోని గూఢార్థమేమిటన్నారు. హైదరాబాద్ అంశంపై అందరితో మాట్లాడతామంటున్నారనీ... అంటే మిగిలిన అన్ని అంశాలూ పరిష్కారమైనట్లేనా? అనేది స్పష్టతనివ్వాలన్నారు. జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఏర్పాటుకు రెండేళ్ళ సమయం పట్టిందంటున్నారనీ... ఇది ఎన్నికలకోసం ఆడుతున్న నాటకం కాక మరేమిటని అంబటి ప్రశ్నించారు. 'ఒకసారేమో అందరితో చర్చిస్తామంటారు. మరోసారేమో అనేక చర్చలు, సంప్రతింపుల తర్వాతే నిర్ణయం తీసుకున్నామంటారు. ఇంకోసారేమో పార్టీల అంతర్గత విషయాలను చర్చించడానికి ఇది వేదిక కాదంటారు. మళ్ళీ నిర్ణయం తీసుకునే ముందు ప్రతి రాజకీయ పార్టీ అభిప్రయాన్ని తీసుకునే తెలంగాణపై ముందుకెళతామంటారు. తెలంగాణ ఇవ్వాలని తాము తీసుకున్నది తొందరపాటు నిర్ణయం కాదంటారు. కొత్త రాష్ట్రాల ఏర్రాటులో అనేక అంశాలపై చర్చించాల్సి ఉందంటారు. రాజ్యసభలో ఇప్పుడా విషయాలను చర్చించడం అపరిపక్వత అంటారు. క్యాబినెట్ నిర్ణయం తర్వాత గ్రూప్ ఆఫ్ మినిస్టర్ నేతృత్వంలోని కమిటీకి అన్ని విషయాలూ చర్చించ వచ్చంటారు. తెలంగాణకు అనుకూలంగా టీడీపీ లేఖ ఇచ్చిందంటారు. రాజ్యసభలో మీరు ఈ రకంగా చెబుతుంటే బయట మీ పార్టీ నేతలేమో ఆంటోనీ కమిటీ వేశాం.. ఏదైనా ఉంటే ఆ కమిటీతో చెప్పుకోవాలంటారు. ఏమిటిదంతా. రాష్ట్రమంటేనే మీకు తమాషా అయిపోయింది.' అంటూ రాంబాబు కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ప్రజలను అభద్రతా భావానికి గురిచేస్తున్నారు
2009 డిసెంబర్ 9న ప్రకటన చేసి అదేనెల 23న వెనక్కి తీసుకున్న చిదంబరం మూడున్నర సంవత్సరాల త్వాత తాజాగా రాజ్యసభలోనూ అంలాంటి గందరగోళమైన మాటలే చెప్పారని విమర్శించారు. రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి రాష్ట్ర ప్రజలను తీవ్రమైన గందరగోళంలోకి నెట్టి.. అభద్రతాభావానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలేమైపోయినా పరవాలేదు.. కేవలం ఓట్లు, సీట్ల లెక్కలతో ముందుకెడతామని కాంగ్రెస్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని, తమ పార్టీ ముందునుంచీ ఇదే విషయాన్ని చెబుతోందని పేర్కొంటూ సరైన సమయంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెబుతారని అంబటి రాంబాబు హెచ్చరించారు.

Back to Top