టీడీపీ నాయకుల పెత్తనమేంటి?

పామ్రరు: ప్రభుత్వ నిధులతో నిర్వహించే కార్యక్రమాలలో టీడీపీ నాయకుల పెత్తనం ఏంటని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసన సభ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ ఉప్పులేటి కల్పన మండిపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమాలను అధికార పార్టీ వేడుకలా నిర్వహిస్తూ ప్రొటోకాల్‌ను విస్మరించారని ఆమె నిప్పులు చెరిగారు. శనివారం స్థానిక గుడివాడ రోడ్డులో వ్యవసాయశాఖ నూతన భవనానికి శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక ప్రజా ప్రతినిధిని సంప్రదించకుండా అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన వర్ల రామయ్య శంకుస్థాపన తేదీని నిర్ణయంచడం వ్యవసాయశాఖ అధికారుల దుశ్చర్యగా పేర్కొన్నారు. కనీసం స్థానిక ప్రజా ప్రతినిధికి ఈ తేదీ అనుకూలమా?, లేదా? అని తెలుసుకోకుండా హఠాత్తుగా ఓడిపోయిన అభ్యర్థి నిర్ణయించిన తేదీని అధికారులు ఏవిధంగా ఖరారు చేశారని ధ్వజమెత్తారు. శుక్రవారం రాత్రి వ్యవసాయ శాఖ అధికారులు  తనకు శంకుస్థాపన సమాచారం ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. ఇది ప్రజాస్వామ్యంలా లేదని   నిరంకుశ పాలనలా టీడీపీ నాయకుల  వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎంపీటీసీలు, సర్పంచ్‌లు ఉండగా ప్రక్క మండలం పమిడిముక్కల ఎంపీపీతో శంకుస్థాపన చేయించి, కొబ్బరికాయ కొట్టించడం ఎంతవరకు సమంజసమన్నారు. టీడీపీ నిధులతో నిర్మిస్తున్న కార్యక్రమంలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధి ఆధ్వర్యంలో జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని ఓడిపోయిన వ్యక్తిచే నిర్వహించడం కుసమస్కారం అన్నారు. దీనిని స్థానిక ఎంపీ కొనకళ్ల నారాయణరావు కూడా సమర్దించడంపై నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా అధికారులు ప్రోటోకాల్‌ను తప్పని సరిగా పాటించి ఎమ్మెల్యే అనుమతులను తీసుకున్న తర్వాతే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను నిర్వహిస్తే మంచిదని హితవు పలికారు.

Back to Top