ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా..?

  • ఐదుగురు చనిపోతే యాజమాన్యం నిర్లక్ష్యం కనిపించలేదా
  • మొన్నటి దారా జీరో కేటగిరి అన్నారు..ఇవాళ ఆరెంజ్‌ కేటగిరి అంటున్నారు
  • కాలుష్యం పది రెట్లు ఎక్కువగా ఉన్నా తుందుర్రులో అనుమతి ఎలా ఇస్తారు
  • రూ.40 కోట్ల పైప్‌లైన్‌ ఎలా నిర్మిస్తారు
  • ఫ్యాక్టరీ చుట్టూ పంట పొలాలు ఉన్నాయి
  • మొగల్తూరు ఘటనపై మెజిస్టీరియల్‌ విచారణ సరికాదు
ఏపీ అసెంబ్లీ: రాష్ట్రంలో ఎంత మంచి చనిపోయినా ముఖ్యమంత్రికి కనిపించడం లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. మొన్న రోడ్డు ప్రమాదంలో పది మంది చనిపోయినా, నిన్న ఆక్వా ఫుడ్‌ ఫ్యాక్టరీలో ఐదుగురు మృతి చెందినా ముఖ్యమంత్రి బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు మనసు రాలేదని విమర్శించారు. మొగల్తూరు ఘటనపై శుక్రవారం మంత్రి అచ్చెన్నాయుడు ఇచ్చిన ప్రకటనపై వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సభలో మాట్లాడారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఐదుగురు కార్మికులు చనిపోతే ఈ ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం గురించి మంత్రి ప్రకటనలో ఒక్క మాట కూడా చెప్పలేదని ధ్వజమెత్తారు. మంత్రి ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు సంబంధించి కొన్ని అంశాలను వైయస్‌ జగన్‌ సభలో లేవనెత్తారు. ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ఉంటే, అన్ని రోజుల పాటు వ్యర్థాలను ఎందుకు నిల్వ చేశారని వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు,  ట్రీట్‌మెంట్‌ ప్లాంటు ఉండి, దాన్ని ఉపయోగించే ఆలోచన వాళ్లకు ఉంటే గొంతేరు డ్రెయిన్‌కు పైపులు ఎందుకు వేశారని నిలదీశారు. ఆ పైప్‌లైన్‌ తీసేయమని కాలుష్య నియంత్రణ మండలి చెప్పిందన్నారు. 2014లోనే పరిశ్రమ పెట్టినప్పుడు 2016లో పీసీబీ అక్కడకు వెళ్లి పైప్‌లైన్‌ తీసేయమని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అంటే రెండేళ్ల పాటు డ్రెయిన్‌లోకి వ్యర్థాలు పంపిచినట్లే కదా అని ప్రశ్నించారు. రెండేళ్లుగా ఆ పైపులు వేసి గొంతేరు డ్రెయిన్‌కు పైపుల ద్వారా కాలుష్యాన్ని నింపేయడం వల్లే పీసీబీ వాటిని తీసేయమందని మంత్రే చెప్పారని గుర్తు చేశారు. గతంలో దీన్ని జీరో పొల్యూషన్‌ అని చంద్రబాబు చెప్పారు. ఇవాళ మంత్రి మాత్రం ఈ ఘటన జరిగిన తరువాత ప్లేట్‌ మార్చి ఇది ఆరంజ్‌ కేటగిరిలోకి వస్తుందని చెబుతున్నారని తప్పుబట్టారు. కాలుష్యానికి సంబంధించి రెడ్, ఆరంజ్, గ్రీన్, వైట్‌ అని నాలుగు విభాగాలు ఉంటాయని వైయస్‌ జగన్‌ వివరించారు.

తుందుర్రులో ఎలా అనుమతిస్తారు?
మొగల్తూరులోని ఆనంద్‌ ఫుడ్‌ పార్క్‌ యాజమాన్యానికే తుందు్రరులో మరో పరిశ్రమకు ఎలా అనుమతి ఇస్తారని వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు. మొగల్తూరు కంటే పది రెట్లు సామర్థ్యం ఎక్కువగా ఉన్న ఫుడ్‌ పార్క్‌కు ఎలా మద్దతు తెలుపుతారని నిలదీశారు. తుందు్రరు ప్రాంతంలో పది వేల మంది నివసిస్తున్నారని, జనావాసాల మధ్య ఇలాంటి ప్రాజెక్టు పెడతామని ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తుందని మండిపడ్డారు. తుందు్రరులో పచ్చని పంట పొలాల మధ్య ఇలాంటి ప్రాజెక్టు ఏర్పాటు చేయడం వల్ల వ్యవసాయం ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ఇళ్ల మధ్య, పొలాల్లో పైప్‌ లైన్‌ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ఇలాంటి పైప్‌లైన్‌ ఏర్పాటుకు ఎవరు ఒప్పుకుంటారని ప్రశ్నించారు. పొరపాటున ఏమైనా జరిగితే ఎన్నివేల మంది చనిపోతారో ఆలోచించాలని సూచించారు.

ప్రైవేట్‌ కంపెనీపై ఎందుకంత ప్రేమ
తుందుర్రులో ఏర్పాటు చేసే ఆక్వా ఫుడ్‌ పార్క్‌పై ప్రభుత్వానికి ఎందుకంత ప్రేమ అని వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు. అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో సముద్రం ఉందని, అంతదూరం పైప్‌లైన్‌ ఏర్పాటు చేసేందుకు దాదాపు రూ.40 కోట్లు ఖర్చు అవుతుందని, అది ఎవరు భరిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వమే పైప్‌లైన్‌ వేస్తామంటే ఆ కంపెనీ మీద ఎందుకంత ప్రేమ అని అనుమానం వ్యక్తం చేశారు. పైప్‌లైన్‌ లెవెల్స్‌ ఎలా ఉన్నాయని పరిశీలన చేసేందుకు ఇటీవల నాగార్జున యూనివర్సిటీ బృందం వెళ్లిన విషయాన్ని వైయస్‌ జగన్‌ ప్రస్తావించారు. తుందు్రరు, బేతపూడి గ్రామాలు సముద్ర మట్టం కన్నా తక్కువ ఎత్తులో ఉన్నాయని యూనివర్సిటీ బృందం చెప్పినట్లు వివరించారు. ఫ్యాక్టరీ చుట్టూ ఇతరుల పొలాలు ఉన్నాయని, రెండు వైపులా ఊళ్లు, పక్కనే గొంతేరు డ్రెయిన్‌ ఉన్నాయని చెప్పారు. విష వాయువులు, ప్రమాదకరమైన గ్యాస్‌ అన్నీ ఆ పైప్‌లైన్‌ నుంచి వెళ్లాల్సి ఉందన్నారు. అలాంటి పైప్‌లు వేయడానికి ఎవరైనా ఎందుకు ఒప్పుకుంటారని వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు.

మానవత్వం ఉండాలి
పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల మీదా మంత్రి అచ్చెన్నాయుడు ప్రేమ ఒలకబోస్తున్నారని వైయస్‌ జగన్‌ ఎద్దేవా చేశారు. మాటల్లో ప్రేమ చేతల్లో ఎందుకు లేదని నిలదీశారు.  ఆ జిల్లాలో ఐదుగురు చనిపోతే ముఖ్యమంత్రి, కార్మిక మంత్రి ఇంతవరకు వెళ్లలేదని తప్పుపట్టారు. చనిపోయిన వారిని అవమానించడం సరికాదని హితవు పలికారు. బస్సు ప్రమాదంలో పది మంది చనిపోతే సీఎం వెళ్లడు. కనీసం మానవత్వం చూపించాలని సూచించారు. గొంతేరు డ్రైన్‌కు సంబంధించి 30 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. సాగునీటికి ఉపయోగపడే నీరు ఈ రకంగా కలుషితనీరుతో సాగునీటికి కూడా ఉపయోగపడటం లేదు. గొంతేరు డ్రైన్‌ ఎండుతోంది. ఆక్వా ఫుడ్‌ పార్క్‌కు సంబంధించి ప్రైవేట్‌ సంస్థకు మద్దతుగా 37 మందిపై హత్యాయత్నం కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పరిశ్రమలు రాకూడదని ఎవరికీ లేదు
రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదని ఎవరికీ లేదని ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఆక్వా ఫుడ్‌ యాజమాన్యంతో కూడా తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. పరిశ్రమలు పెట్టాల్సిన చోట పెట్టాలని, వీటిని సముద్రతీరంలో పెడితే అందరూ ఆహ్వానిస్తారని చెప్పారు. మొగల్తూరు ఘటనపై మెజిస్టీరియల్‌ విచారణ వేస్తామనం సరికాదన్నారు. ఈ విచార ణ ఆర్డీవోతో  జరిపించి చేతులు దులుపుకోవాలని చూస్తుందని ధ్వజమెత్తారు. ఇక్కడ ఏం సూ^è నలిచ్చినా నిర్మాణాత్మకంగా ఉండాలని చెబుతున్నామని, ఆటకం కలిగించాలన్న ఉద్దేశం లేదని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రికి వైయస్‌ జగన్‌ సవాల్‌
విద్యార్హతలపై కామెంట్‌ చేసిన మంత్రి అచ్చెన్నాయుడికి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. తన విద్యార్హతలపై విచారణకు సిద్ధమని, అందులో నేరం రుజువు కాకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు తన పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్‌ విసిరారు. అధికారం మీ చేతుల్లో ఉంది కదా? అని మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. ఎవరి స్థాయి ఏమిటో ప్రజలకు బాగా తెలుసు అని చురకలంటించారు. తాను మొదటి సారి ఎమ్మెల్యే అని కామెంట్‌ చేస్తున్నారని తప్పుపట్టారు. ఇప్పటికే తాను రెండు సార్లు ఎంపీని, ఒక సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. కడప ఎంపీగా 5 లక్షల 45 వేల  మెజారిటî తో గెలుపొందానని, అదీ నా స్థాయి అంటూ చురకలంటించారు. ఇక్కడ ఉన్న వాళ్లలో ఎవరికి ఇంత మెజారిటీ రాలేదని,  చంద్రబాబుకు తల కింద బెట్టి కాళ్లు పైన బెట్టిన అంత మెజారిటీ తెచ్చుకోలేరని వ్యాఖ్యానించారు. 

శోభమ్మ చనిపోతే ఎక్కడున్నారు
భూమా నాగిరెడ్డి మీద ప్రేమ ఒలబోస్తున్న మీరు శోభమ్మ చనిపోతే ఎక్కడున్నారని ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు. నాడు రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి చనిపోతే టీడీపీకి చెందిన ఒక్కరైనా చూడటానికి వచ్చారా అని నిలదీశారు. ఇదే సభలో శోభమ్మకు నివాళులర్పించలేదని తప్పుపట్టారు. భూమా కుటుంబం 30 ఏళ్లు టీడీపీకి సేవ చేస్తే ఇదేనా మీరిచ్చిన గౌరవం అని ప్రశ్నించారు. ఎవరు అవుట్‌డేటెడ్‌ ఎమ్మెల్యేనో ప్రజలకు తెలుసు అని వైయస్‌ జగన్‌ ఎద్దేవా చేశారు. 
Back to Top