ప్రాణాలు పోతుంటే ఏం చేస్తున్నావ్..?

  • వరదతో రాష్ట్రం మునుగుతుంటే పార్టీ ఫిరాయింపులా?
  • దోమలపై దండయాత్ర..ర్యాలీలేంటి బాబూ..?
  • ఇంత నిర్లక్ష్యపు ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు
  • ప్రకృతి వైపరిత్యాన్ని అవినీతికి ఆసరాగా మల్చుకోవడం దారుణం
  • బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి
  • వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స డిమాండ్
హైదరాబాద్‌: ఆంధ్రరాష్ట్ర ప్రజలు విషజ్వరాలు, అకాల వర్షాలతో అతలాకుతలం అవుతున్నా సీఎం చంద్రబాబుకు చీమకుట్టినట్లు కూడా లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. వర్షాలతో రాష్ట్ర ప్రజలంతా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఎలాంటి చర్యలు తీసుకోకుండా చంద్రబాబు ప్రతిపక్ష పార్టీల నుంచి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కొనుగోలు చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని కేంద్ర కార్యాలయంలో సత్యనారాయణ విలేకరులతో మాట్లాడారు. గుంటూరులో వర్ష ప్రభావంతో 20 మందికిపైగా చనిపోతే చంద్రబాబు సర్కార్‌ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. రాష్ట్రమంతా జలమయమై ప్రజలకు ఆరోగ్య, తాగునీటి సమస్య ఎక్కువగా ఏర్పడిందన్నారు. తినడానికి తిండిలేక ప్రజలు అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

రహదారులు, రైల్వే మార్గాలు పూర్తిగా ధ్వంసమై ప్రజల రాకపోకలకు ఇబ్బందికరంగా మారాయన్నారు. ప్రజల ప్రయాణానికి తక్షణ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాజకీయాలు తరువాత చూసుకోవాలని ప్రస్తుత ప్రజల ఇక్కట్లను తొలగించాలని సూచించారు. వర్షాలతో ప్రజలు ఏ ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారో ఇప్పటి వరకు అధికారులతో కలిసి చంద్రబాబు రివ్యూ నిర్వహించకపోవడం దారుణమన్నారు. అధిక వర్షపాతం నమోదై ప్రజలంతా అతలాకుతలమైన గుంటూరు, విజయవాడ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్‌లతో ఇప్పటి వరకు సమీక్ష నిర్వహించి సహాయక చర్యలు చేపట్టకపోవడం దుర్మార్గమన్నారు. 

ఇంత నిర్లక్ష్యపు ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు
దోమలపై దండయాత్ర చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిడం విడ్డూరంగా ఉందని బొత్స వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలతో దోమలపై ఉద్యమం చేయాలని బాబు ర్యాలీలు నిర్వహిస్తున్నారన్నారు. దోమలు రాకుండా ఏం చేయాలో ఆలోచించకుండా ర్యాలీలు చేపట్టడం ఆశ్చర్యంగా ఉందన్నారు. దోమల నివారణకు మున్సిపాలిటీ, పంచాయతీలకు నిధులు సమకూర్చకుండా యుద్ధం ప్రకటనలు చేయడం శోచనీయమన్నారు. ఇంత నిర్లక్ష్యపు ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదని చెప్పారు. సుమారు 3 లక్షలకు పైగా పంటనష్టం జరిగితే లక్షా 10వేల ఎకరాలని ప్రభుత్వం ప్రకటించడం బాధాకరమన్నారు. ధూళిపాలలో రైల్వేట్రాక్‌ కొట్టుకుపోతే మరమ్మత్తుల చేపడుతున్న కాంట్రాక్టర్‌ను సాక్షాత్తు స్పీకర్‌ కుమారుడు 30 శాతం నిధులను డిమాండ్‌ చేయడంపై బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకపక్క ప్రకృతి భీభత్సం సృష్టిస్తుంటే మరోపక్క అధికార పార్టీ నేతలు దాన్ని అవినీతికి ఆసరాగా మల్చుకుంటున్నారని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం స్పందించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సూచించారు. ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని, వరద ముంపుతో చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా రైతుల పంటనష్టానికి పరిహారం చెల్లించి ఇన్‌పుట్‌ సబ్సీడీ అందించాలని కోరారు. 

వరద ప్రాంతాలకు వైయస్‌ జగన్‌
వరద బాధితులను వైయస్‌ఆర్‌ సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించనున్నట్లు బొత్స సత్యనారాయణ తెలిపారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో సోమ, మంగళవారాల్లో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. వర్షం దాటికి నష్టపోయిన రైతులను, మృత్యువాత పడిన బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా కల్పించనున్నట్లు చెప్పారు. 
 
Back to Top