పంచ గ్రామ సమస్యలన్నీ పరిష్కరిస్తాం


విశాఖపట్నం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే పంచ గ్రామ సమస్యలన్నీ పరిష్కరిస్తామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు. ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావంగా విజయసాయిరెడ్డి చేపట్టిన పాదయాత్ర ఐదో రోజు ప్రహ్లాదపురం నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా పంచ గ్రామ ప్రజలు ఎంపీ విజయసాయిరెడ్డిని కలుసుకొని తమ సమస్యలను చెప్పుకున్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రజా రంజక పరిపాలన అందిస్తారని, గ్రామంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తారన్నారు. ప్రస్తుతం ఎంపీ నిధులతో ప్రభుత్వ ఆస్పత్రిలో సదుపాయాలను మెరుగు పరుస్తానని, మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధిగా పోరాడడం లేదన్నారు. ఎంపీ పదవులకు రాజీనామాలు చేయకుండా టీడీపీ నేతలు దీక్షలు చేస్తే ప్రజలు మరోసారి నమ్మి మోసపోయే స్థితిలో లేరన్నారు. నాలుగేళ్లు కేంద్ర ప్రభుత్వంతో అంటకాగి ప్రత్యేక హోదాకు సమాధి కట్టాలని చూసిన చంద్రబాబు సర్కార్‌కు ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారన్నారు. పాదయాత్రలో ఎంపీ వెంట మాజీ ఎమ్మెల్యే కన్నబాబు, పార్టీ విశాఖ నగర  అధ్యక్షులు మళ్ల విజయప్రసాద్, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ కుమార్, సీనియర్‌ నాయకులు గుడివాడ అమర్‌నాథ్, నాయకులు నాగిరెడ్డి, కోలా గురువులు, జాన్‌వెస్లీ, పక్కి దివాకర్, ఆదిరెడ్డి మురళి, దొడ్డి కిరణ్‌లు ఉన్నారు. 
Back to Top