అధైర్యపడొద్దు.. న్యాయం కోసం పోరాడుదాం

బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలి 

విజయవాడ: అగ్రిగోల్డ్‌ బాధితుల పక్షాన పోరాడేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందని అగ్రిగోల్డ్‌ బాసట కమిటీ కోఆర్డినేటర్‌ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులను ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితుల ఆక్రంధనలు ఆకాశాన్ని అంటుతున్నా.. ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. నూతన చట్టాన్ని తీసుకువస్తానని ప్రజలను మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దని, నిబంధనలు పెట్టకుండా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేకమైన సెల్‌ ఏర్పాటు చేసిన బాధితులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. 

కోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘిస్తున్న బాబు: వెల్లంపల్లి శ్రీనివాస్‌

అగ్రిగోల్డ్‌ బాధితులపై కోర్టు అనేక విధానాలను ప్రకటించినా చంద్రబాబు కోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదని వెల్లంపల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు. 70 నుంచి 80 శాతం వరకు ఉన్న చిన్న మొత్తంలో పొదుపు చేసుకున్న వారిని అగ్రిగోల్డ్‌ ఆస్తులను జప్తు చేసుకొని ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. ప్రకటన చేసిన సంవత్సర కాలం దాటినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులపై ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలన్నారు. లేనిపక్షంలో అగ్రిగోల్డ్‌ బాసట కమిటీ ఇప్పటికే ఒక కార్యచరణ రూపొందించుకుందని, బాధితులకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. 
Back to Top