ఎస్సీ, ఎస్టీ కాలనీల నుంచే భూ పంపిణీప్రతి జిల్లాలో పర్యటించి సమస్యలపై అధ్యయనం
పాదయాత్ర అనంతరం ఎస్సీ గర్జన
పల్లమాల ఎస్సీ ఆత్మీయ సమ్మేళనంలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

చిత్తూరు: అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీ కాలనీల నుంచే భూ పంపిణీ కార్యక్రమం మొదలుపెడతామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం పల్లమాలలో కొనసాగుతున్న పాదయాత్రలో భాగంగా ఎస్సీలతో వైయస్‌ జగన్‌ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా జననేత మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీల నుంచి మొదలుపెట్టి బీసీ, మైనార్టీలకు కూడా భూ పంపిణీ చేపడుతామని భరోసా ఇచ్చారు. ఎస్సీ కమిటీని ఒకటి ఏర్పాటు చేయబోతున్నాం. ఆ కమిటీ ప్రతి ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో పర్యటించి ఇంకా ఎక్కవ మేలు ఏమైనా చేయగలుగుతామా అనే విషయాలపై అధ్యయనం చేస్తుంది. మేరుగు నాగార్జున ఆధ్వర్యంలో కమిటీ ప్రతి జిల్లా తిరుగుతుంది. నాకు చెప్పుకోలేకపోయిన వారు సలహాలు, సూచనలు నాగార్జునకు ఇవ్వండి, పాదయాత్ర అయిపోయిన తరువాత ఎస్సీ గర్జన చేసి ఎస్సీలకు ఏం చేయబోతున్నామో క్లీయర్‌గా చెబుతాం. 

శ్రీసిటీలో ఉద్యోగాలు ఇవ్వడం లేదు

సురేష్‌: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో  నారాయణస్వామి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 50 వేల ఉద్యోగాలు ఇస్తే 17 వేల మంది ఎస్సీలే చేరారు. మా మండలం నుంచే 80 మంది ఎస్సీలు ఉద్యోగులుగా ఉన్నారు. చంద్రబాబు, కిరణ్‌కుమార్‌ ప్రభుత్వంలో ఎస్సీలు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఎస్సీలంటే ఆదినారాయణరెడ్డికి గిట్టదు. రాజశేఖరరెడ్డి పుణ్యమా అని 2004 నుంచి 2009 వరకు ఎస్సీలు చదుకున్నాం. వైయస్‌ఆర్‌ది ప్రజల ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ ప్రజలకు ప్రైవేట్‌ పరంగా ఉద్యోగాలు కల్పించేందుకు శ్రీసిటీ స్థాపించారు. కానీ ఇప్పుడు శ్రీసిటీలో ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడం లేదు.  

ఉద్యోగాలు వేరేవారికి ఇస్తే ఎవడొప్పుకుంటాడు..

వైయస్‌ జగన్‌: శ్రీసిటీ ఇదే నియోజకవర్గంలో ఉంది. ఉద్యోగాలు ఇవ్వాలని నాన్నగారు శ్రీసిటీని స్థాపించారు. దాదాపు 80కిపైగా కంపెనీలు వచ్చాయి. కానీ ఉద్యోగాలు మాత్రం ఇతర రాష్ట్రాల ప్రజలకు ఇస్తున్నారు. దేవుడి దయ వల్ల మన ప్రభుత్వం రాగానే పరిశ్రమలకు నోటీసులు పంపించి కచ్చితంగా ఉద్యోగాలు స్థానికులు 75 శాతం ఇవ్వాలనే రూల్‌ తీసుకువస్తాం. వీరందరికీ భూములు మనం ఇవ్వాలి. కరెంటు తక్కువ రేటుకు ఇవ్వాలి, నీరు మనమే ఇవ్వాలి. అన్నీ మనమిచ్చి ఉద్యోగాలు మాత్రం గుజరాత్, పంజాబ్‌ నుంచి వస్తే ఎవడు ఎప్పుకుంటాడు. ఇదే శ్రీసిటీలో ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్న వారందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తా. 

––––––––––––––––––––––––
భూమికి భూమి ఇచ్చే చట్టం తేవాలి

చిన్నా: ఎస్సీ, ఎస్టీలకు భూపంపిణీ చేస్తే ఆ భూములు ప్రభుత్వం లాక్కోకుండా భూమికి భూమి ఇచ్చేలా చేయాలి. నియోజకవర్గంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు రైతులు ఉన్నారు. తెలుగుగంగా కాలువ ఇక్కడ నుంచి పోతుంటే గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా.. తెలుగుగంగా లీకై పోలాలకు వస్తే రైతులను జైల్లో పెట్టారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఎమ్మెల్యే నారాయణస్వామి సహకారంతో రూ. 110 కోట్లు నిధులు వెచ్చించి ప్రతి చెరువుకు నీరు ఇప్పించారు. రబీ సీజన్‌లో తెలుగుగంగా ద్వారా నీరు రాక ఇబ్బందులు పడుతున్నాం. 
ఎస్సీ, ఎస్టీ భూములపై చట్టాన్ని మారుస్తాం..

వైయస్‌ జగన్‌: ఎవరైనా ఎస్సీ, ఎస్టీల భూములు అత్తగారి భూములు అన్నట్లుగా లాక్కుంటున్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదట జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీ భూములపై చట్టాన్ని మారుస్తాం. ఆ యాక్ట్‌లో ఎస్సీ, ఎస్టీల భూములు ప్రభుత్వం కూడా తీసుకోవడానికి వీల్లేకుండా చేస్తాం. తప్పనిసరిగా తీసుకోవాల్సని పరిస్థితి ఉంటే పది రూపాయలు ఎక్కవగా ఇచ్చి తీసుకునేలా చేస్తాం. భూములు ఒకసారి వారికి ఇస్తే అది వారి హక్కు. ఎస్సీ, ఎస్టీల భూములను అమ్ముకునే స్వేచ్ఛ కొన్ని సంవత్సరాలకు కల్పించారు. కానీ ఆ స్వేచ్ఛను ఎస్సీ, ఎస్టీ భూములు అత్తగారి సొత్తు అన్నట్లుగా లాక్కుంటున్నారు.  భూముల రక్షణ కోసం ఏం చేయాలో అవన్నీ చేస్తాం. 
–––––––––––––––––
చంద్రబాబు దళిత ద్రోహి
రాజేంద్ర: చంద్రబాబు దళిత ద్రోహి, దళితులను అన్యాయం చేస్తూ వారిపై దాడికి పాల్పడుతున్నాడు. వైయస్‌ఆర్‌ హయాంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ వేస్తే బ్రహ్మాండంగా పనిచేసింది. ప్రతి ఒక్కరికి ఇల్లు, భూములు, రేషన్‌ కార్డులు, బోర్లు వేయించి మామిడి చెట్లు పెట్టించారు. ఎస్సీలుగా ఎలా పుట్టాలని ఒక ముఖ్యమంత్రి అంటే ఎలా బ్రతుకుతారు సార్‌. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే దళితులపై దాడులు జరుగుతున్నాయి. మీరు ముఖ్యమంత్రి అయిన తరువాత దళితులను ఆదుకుంటారని ఆశిస్తున్నాం. 
–––––––––––––––––––
సబ్‌ప్లాన్‌ నిధులు వినియోగించడం లేదు

గురునాథం: ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు సక్రమంగా వినియోగించుకోవడం లేదు. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు వేయాల్సిన రోడ్లు కూడా దుర్మార్గంగా ఉన్నాయి. ఓసీలకు బ్రరెల కొట్టాలకు ఎస్సీల పేరు చెప్పి రోడ్లు వేయిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలు ఎవరైనా అడిగినా దాడులు చేస్తున్నారు. బ్రరెల కొట్టం కాడికి రూ. 52 లక్షలు నిధులు వెచ్చిస్తున్నారు. ఎస్సీలమంతా ధర్నాలు చేస్తే మా ప్రభుత్వం మీరు ఎస్సీలు ప్రశ్నించే హక్కుల లేదని మాట్లాడుతున్నారు. 
వందశాతం సబ్‌ప్లాన్‌ అమలు చేస్తాం..
వైయస్‌ జగన్‌: చంద్రబాబు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను వంద శాతం అమలు చేస్తాం. చంద్రబాబు తన మేనిఫెస్టోలో అతిక్రమించే వారిని శిక్షిస్తామన్నారు. నాలుగేళ్లలో ఒక్క సంవత్సరం అయినా అమలు చేశాడా.. శిక్షించాలంటే ఎవరిని శిక్షించాలి. 

––––––––––––––––––––––––
మా గ్రామానికి కలెక్టర్‌ కూడా రానివ్వలేదు..

కిష్టమ్మ: మాకు నీరు రావడం లేదు. మా గ్రామాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. కలెక్టర్‌ వచ్చినా మా గ్రామానికి రానివ్వలేదు. 70 ఇళ్లకు ఒక బోరు మాత్రమే ఉంది. వైయస్‌ఆర్‌ కట్టించిన ఇల్లు మాత్రమే మా కాలనీలో ఉన్నాయి. మాకు నీరు అందించాలి. 
––––––––––––––––––––
వైయస్‌ఆర్‌ సీపీ అని బిల్లు ఇవ్వడం లేదు..
వెంకటయ్య: వైయస్‌ఆర్‌ హయాంలో ఇల్లు కట్టించుకున్నాం.. తరువాత బిల్లు ఇవ్వమంటే చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఇన్‌స్పెక్టర్‌ను అడిగితే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వారికి ఇవ్వమని చెబుతున్నారు. 
ఇంకో సంవత్సరం ఓపిక పట్టు..
వైయస్‌ జగన్‌: ఇంకో సంవత్సరం ఓపిక పట్టు. ఈ ప్రభుత్వం చేయదు. నా కొడుకు వచ్చినాక చేయించుకుంటానని అందరికీ గట్టిగా చెప్పు. 
––––––––––––––––
ఎస్సీలని తొక్కేస్తున్నారు..

జీవా: మాది చిలమ్మత్తూరు, మా ఊరిలో 200 ఎకరాలు ఎస్సీలకు ఇచ్చారు. దాన్ని 60 వేలు, 25 వేలు తీసి ఇచ్చేసి నేను ఎంబీఏ చదివాను. కాంట్రాక్టులో రూ. 7 వేలకు పనిచేస్తున్నా. నాకు పని వచ్చినా ఎస్సీ అని ముందుకుపోనివ్వడం లేదు. రూ. 10 వేల జీతం దాటనివ్వడం లేదు. టోల్‌గేట్‌లో 23 సంవత్సరాలు దాటితే ఉద్యోగాలు ఇవ్వరంట. ఒకటవ తేదీ ఇవ్వాల్సిన జీతం 17వ తేదీ ఇస్తున్నారు. అది కూడా బ్యాంక్‌ల చుట్టూ తిరగాలి. చిలమ్మతూరు పక్కన అటవి భూమిని 200 ఎకరాలను రూ. 70 వేలకు తీసుకున్నారు. ఇప్పుడు అది ఎకరా కోటికి పోతుంది. మాకు న్యాయం చేయండి. ఈ సంవత్సరం 2 ఇల్లు వచ్చాయి. మాకొద్దని చెప్పాం. 

మా అన్న వస్తున్నాడని చెప్పు...
వైయస్‌ జగన్‌: మా అన్న వస్తున్నాడు.. అప్పుడు ఇల్లు కట్టుకుంటాం అని చెప్పు. నీ సమస్యలన్నీ పరిష్కరిస్తా. అందరికీ సమాన జీతం ఇవ్వాలనే నిబంధన తీసుకువస్తాం. 
––––––––––––––––––––––––––
మా ఊరు ఏం అన్యాయం చేసింది..
నాగనందాపురం మాది మాకు నీరు లేదు, రోడ్డు లేదు. ఊరూరికి సిమెంట్‌ రోడ్లు వేస్తున్నారు. కానీ మా ఊరు ఏం అన్యాయం చేసింది. మాకు ఇళ్లు కట్టించడం లేదు. 
నా కొడుకు వచ్చాక తీసుకుంటానని చెప్పు..
వైయస్‌ జగన్‌: గట్టిగా దేవుడిని మొక్కుకో.. రెండు టెంకాయలు ఎక్కవగా కొట్టు. నా కొడుకు వచ్చినా చేయించుకుంటాం అని చెప్పు. మనం వచ్చిన తరువాత నీకు ఇల్లు నేను కట్టిస్తా. 

Back to Top