భూపంపిణీతో పాటు బోర్లు వేయిస్తా

  • వ్యవసాయం పండుగలా జరిపిస్తా
  • వైయస్‌ఆర్‌ కొడుకుగా రెండు అడుగులు ముందుకు వేస్తా
  • ఆయనకంటే ఒక లక్ష ఎక్కవ భూపంపిణీకి ప్రయత్నిస్తా
  • ఎస్సీ, ఎస్టీలకు 200ల యూనిట్ల వరకు కరెంట్‌ ఫ్రీ
  • కరెంటోడిని బిల్లుల కోసం మీ దగ్గరకు రానివ్వను

చిత్తూరు: పేదలకు భూ పంపిణీతో పాటు వ్యవసాయం చేసుకునేందుకు ఉచితంగా బోర్లు కూడా వేయించి వ్యవసాయాన్ని పండుగలా జరిపిస్తానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 32 లక్షల ఎకరాలు పంపిణీ చేస్తే ఆయన కొడుకుగా రెండు అడుగులు ముందుకు వేసి ఒక లక్ష  ఎకరాలు ఎక్కవగా పంచేందుకు ప్రయత్నిస్తానని వైయస్‌ జగన్‌ ఎస్సీలకు భరోసా ఇచ్చారు. సత్యవేడు నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పల్లమాల వద్ద ఎస్సీలతో వైయస్‌ జగన్‌ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా జననేత మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ కాలనీల నుంచే భూ పంపిణీ కార్యక్రమం మొదలై బీసీ, మైనార్టీల వరకు చేరుతుందన్నారు. అప్పుడే పేద కుటుంబాలు కాస్తో.. కూస్తో బాగుపడతాయన్నారు. ఆ పరిస్థితిని తీసుకురావడం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తానని వైయస్‌ జగన్‌  హామీ ఇచ్చారు.

బాబుకు ఎస్సీలంటే చులకన.. 

ఎస్సీ, ఎస్టీ కాలనీలకు బిల్లుల కోసం కరెంటు వాడు రాకుండా చేస్తానని వైయస్‌ జగన్‌ అన్నారు. ఎన్నికల సమయంలో కరెంటు బిల్లులు షాక్‌ కొడుతున్నాయని చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచాడన్నారు. పాదయాత్ర చేస్తుండగా ఒక చిట్టితల్లి నా దగ్గరకు వచ్చి అన్నా మా ఇంట్లో ఒక ఫ్యాన్, రెండు లైట్లు ఉన్నాయని, మా ఇంటికి రూ. 5,400ల బిల్లు వచ్చింది ఎలా కట్టాలని ఆవేదన చెందిందని గుర్తు చేశారు. తన సొంత నియోజకవర్గం  పులివెందులలోని సొంత గ్రామం బలపనూరుకు  తమ్ముడు ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి వెళ్లి దళిత వాడను సందర్శించినప్పుడు కరెంటు బిల్లులు చూస్తే ఒకొక్కరికి రూ. 3, 4, 5 వేలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యవేడు నియోజకవర్గం నుంచి కూడా చెల్లయ్య అన్న కూడా రూ. 20 వేల కరెంటు బిల్లు వచ్చిందని చెప్పారన్నారు. చంద్రబాబుకు ఎస్సీలంటే ఎంత చులకన అంటే కరెంటు వాళ్లను పంపించి వారి ఇంట్లో దూరి ఇష్టారీతిగా బిల్లులు వసూలు చేయిస్తున్నాడని మండిపడ్డారు. వైయస్ ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అలాంటి పరిస్థితులు ఉండవని, ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఎవరూ కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేకుండా చేస్తానని భరోసా ఇచ్చారు. నాలుగు లైట్లు, ఒక టీవీ, రెండు ఫ్యాన్‌లు, ఒక సెల్‌ఫోన్‌ చార్జర్‌ ఇంతకంటే ఎక్కవ ఏ కుటుంబంలో ఉండవని, ఇవన్నీ లెక్కేసుకున్నా 150 యూనిట్లు కావన్నారు. 200 యూనిట్లు దాటినా ఏ కరెంటు వాడు మీ దగ్గరకు రాని పరిస్థితిని తీసుకుస్తానన్నారు. 

Back to Top