ఎవరూ భయపడొద్దు

 
వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు 

 విజయనగరం :  త్వ‌ర‌లోనే రాజన్న రాజ్యం వ‌స్తుంద‌ని ఎవ‌రూ భ‌య‌ప‌డొద్దు అని వైయ‌స్ఆర్‌సీపీ  జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీని వాసరావు(చిన్న శ్రీను) అన్నారు. బొబ్బిలి మండలం మెట్టవలస గ్రామంలో గురువారం పర్యటించిన ఆయన ముందుగా గ్రామంలోని వైయ‌స్ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయ‌న‌ మాట్లాడారు. సంక్షేమ ఫలాలు వైయ‌స్ రాజశేఖర్‌రెడ్డి అందరికీ అందించారని, పింఛన్లు, ఇళ్లు పార్టీలకు అతీతంగా పంపిణీ చేశారని, అదే చంద్రబాబునాయుడు అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారని, వైయ‌స్‌ జగన్‌ అధికారంలోకి వస్తే ఏ రాష్ట్రంలో చికిత్సచేయించుకున్నా ఆరోగ్యశ్రీ వర్తించేలా పథకం అమలు చేస్తారన్నారు. 

మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు వైయ‌స్ఆర్‌సీపీ ఫ్యాన్‌ గుర్తుపై గెలిచి తమ ఆస్తులు కాపాడుకునేందుకు, పదవి కోసం పార్టీమారారని విమర్శించారు. ఆయన రెండేళ్ల పదవీకాలంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. చెరకు రైతుల బకాయిలపై ఎన్‌సీఎస్‌ యాజమాన్యాన్ని నిలదీశారా....? మూడు వేలమంది కార్మికులను రోడ్డున పడేసిన జ్యూట్‌ మిల్లు యాజమాన్యాన్ని ప్రశ్నించి కార్మికులను కాపాడారా...? అని ప్రశ్నించారు. తాము పీఏలు లేని నాయకులమని, 24గంటలూ అందుబాటులో ఉంటామని, అపాయింట్‌మెంట్‌ లేకుండా కలవొచ్చన్నారు. ఎంపీ అశోక్‌ను ఎవరైనా చూసారా...? ఆయన మనకు కనిపించని నాయకుడని, బొత్స సత్యనారాయణ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. బొబ్బిలి నియోజకవర్గ సమన్వయకర్త శంబంగి వెంకట చిన అప్పలనాయుడు,  మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఇంటి గోపాలరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు సావు కృష్ణమూర్తినాయుడు, పెద్దింటి రామారావు, బోను అప్పలనాయుడు, తెంటు సత్యంనాయుడు, శంబంగి వేణుగోపాలనాయుడు, అల్లాడ నగేష్, పువ్వల నరసింహులునాయుడు, అడబాల కృష్ణారావు, రేజేటి విసు, డమ్మా అప్పాజీ, పాలవలస ఉమాశంకరరావు, ఇంటిగోవిందరావు, దిబ్బగోపి తదితరులు పాల్గొన్నారు.


Back to Top