చేనేత రంగాన్ని ఆదుకుంటాం.. ప్రభుత్వం ఒత్తిడి తెస్తాం


అమృత్‌నగర్‌ (ప్రొద్దుటూరు): ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదివారం ఉదయం  ప్రొద్దుటూరులోని అమృత నగర్‌ లో చేనేత కార్మికులతో భేటీ అయ్యారు. చేనేతకార్మికుల సమస్యలను అడిగి తెలుసుకుని వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామంటూ భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా చేనేత కార్మికులు తమ గోడు వెలిబుచ్చుకుంటూ, ప్రభుత్వం తమను ఆదుకోవడంలో విఫలమైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జీఎస్‌టీ ప్రభావంతో చేనేత రంగం సర్వనాశనం అయ్యిందన్నారు. బ్యాంకుల్లో రుణాలు అందడం లేదనీ, ఆరోగ్య సమస్యలను తమ వెంటాడుతున్నాయని వారు తమ బాధలను వైయస్‌ జగన్‌తో పంచుకున్నారు. పిల్లలను చదివించడానికి తాము నానా ఇబ్బందులు పడుతున్నామంటూ వివరించారు. వీరి సమస్యలన్నిటినీ అడిగి తెలుసుకున్న ఆయన చేనేత రంగానికి సంబంధించిన అన్ని అంశాలపై తనకు అవగాహన ఉందని, వారి సమస్యల పరిష్కార దిశలో తాము చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
పిల్లలను అందరూ చదివించాలనీ, కాలేజీ విద్యార్ధులకే కాదు,స్కూల్ పిల్లలకు ఆర్ధిక సాయం అందిస్తామని అన్నారు. 
కాలేజీ విద్యార్ధులకు పూర్తి ఫీజ్ రీయింబర్స్ మెంట్ తో పాటు..ఖర్చుల కోసం ఏటా రూ.20వేల నగదు సాయం కూడా అందించేలా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. అంతే కాకుండా వారి తక్షణ అవసరాలు, ఇతర అత్యవసర సమస్యల విషయంలో శ్రద్ధ కనపరిచేలా ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు కార్యక్రమాలను చేపట్టాలని స్థానిక పార్టీ నేతలకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సూచించారు. 
Back to Top