ఎప్పుడు ఎన్నికలొచ్చినా తమదే విజయం

ప్రకాశంః వైయస్సార్సీపీకి కంచుకోటగా ఉన్న గిద్దలూరు నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా ప్రజలు తమ పార్టీకే పట్టం కడతారని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఐ.వి.రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సీఎల్‌ఆర్‌ కాంప్లెక్స్‌ ఆవరణలో పార్టీ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందన్నారు. వైయస్సార్సీపీ తరఫున గెలిచిన అశోక్‌రెడ్డి తన  పదవిని చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. 

పార్టీ నేత చేగిరెడ్డి లింగారెడ్డి మాట్లాడుతూ... నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు, సమన్వయకర్త ఐ.వి.రెడ్డికి పూర్తి మద్దతుగా నిలుస్తానన్నారు. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడమే తమ లక్ష్యమన్నారు. మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ డాక్టర్‌ రంగారెడ్డి, కంభం, బేస్తవారిపేట, కొమరోలు మండల కన్వీనర్లు గొంగటి చెన్నారెడ్డి, బాలిరెడ్డి, సార్వభౌమరావు, పార్టీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు కొండా తిరుపతిరెడ్డి, సెక్రటరీ ఖమర్, టీవీఎస్‌పీ శర్మ, మాజీ ఎంపీపీ వెంకటరాజు, కంభం ఎంపీటీసీ సభ్యుడు చిక్కుడు రోశయ్య, పట్టణ అధ్యక్షుడు రఫీ తదితరులు పాల్గొన్నారు.
Back to Top