నంద్యాలలో వైయస్సార్సీపీ జెండా ఎగరవేస్తాం

  • సొంతింటికి వచ్చినందుకు ఆనందంగా ఉంది
  • వైయస్ఆర్ దయవల్లే రెండుసార్లు ఎమ్మెల్యే, మంత్రినయ్యా
  • నియోజకవర్గంలో అనేక సమస్యలున్నాయి
  • చంద్రబాబు నాన్చుడు ధోరణితో విసిగిపోయాం
  • ప్రభుత్వానికి ప్రజా సమస్యలే పట్టడం లేదు
  • పార్టీ బలోపేతం కోసం మా శక్తియుక్తులన్నీ ఉపయోగిస్తాం
  • వైయస్సార్సీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి
హైదరాబాద్ః గతంలో అనివార్య కారణాల వల్ల పార్టీలోకి రాలేకపోయినప్పటికీ...తిరిగి సొంత ఇంటికొచ్చినందుకు ఆనందంగా ఉందని వైయస్సార్సీపీలో చేరిన సందర్భంగా శిల్పామోహన్ రెడ్డి చెప్పారు. తమ గురువు దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి దయ వల్లే రెండు సార్లు ఎమ్మెల్యే, ఓ సారి మంత్రి అయ్యానని శిల్పా చెప్పారు. వైయస్ జగన్ సమక్షంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో తన అనుచరులతో కలిసి పార్టీలో చేరిన సందర్భంగా శిల్పా మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కుటుంబంపై అభిమానం ఉన్నాగతంలో పార్టీలోకి రాలేకపోయామన్నారు. ఈసారైనా పార్టీకి, వైయస్ జగన్ కు అండగా ఉండాలని వైయస్సార్సీపీలో చేరామన్నారు. తనతో పాటు మున్సిపల్ చైర్ పర్సన్,  25 మంది కౌన్సిలర్లు, ఎంపిటీసీలు, జడ్పిటీసీలు, సర్పంచ్ లు అందరూ టీడీపీకి రాజీనామా చేసి వైయస్సార్సీపీలోకి వచ్చామని స్పష్టం చేశారు. పార్టీ నాయకులను, క్యాడర్ ను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఆయా సమస్యలపై బాబు నాన్చుడు ధోరణి అవలంభిస్తున్నారని శిల్ప విమర్శించారు. ఎలాంటి టెండర్లు, పర్సంటేజీల జోళికి వెళ్లకుండా సమర్థవంతంగా నిజాయితీగా పనిచేస్తున్నా టీడీపీ నాయకత్వం గుర్తించడం లేదని...అలాంటి పార్టీలో ఉండడం దండగనే క్యాడర్ ను కాపాడుకోవడానికి తిరిగి సొంతింటికి వచ్చానని శిల్పామోహన్ రెడ్డి తెలిపారు. నంద్యాలలో వైయస్సార్సీపీ జెండా ఎగరవేస్తామని శిల్పా తేల్చిచెప్పారు. టికెట్ విషయంలో అధినేత వైయస్ జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని మోహన్ రెడ్డి చెప్పారు. కర్నూలు జిల్లాలో వైయస్సార్సీపీని బలోపేతం చేసేందుకు తమ శక్తియుక్తులన్నీ ఉపయోగిస్తామన్నారు. 

టీడీపీలో అంతర్గత విబేధాలకు చంద్రబాబే కారణమని శిల్పామోహన్ రెడ్డి అన్నారు. సమీక్షలు, వీడియోకాన్ఫరెన్స్ ల పేరిట సమయం వృథా చేస్తున్నారే తప్ప ప్రజా సమస్యలపై దృష్టిపెట్టడం లేదని ఆరోపించారు.  నంద్యాల నియోజకవర్గంలో  పెన్షన్లు, రేషన్, ఇళ్లు సహా అనేక సమస్యలున్నాయని శిల్పా తెలిపారు. భూమా నాగిరెడ్డి టీడీపీలోకి వచ్చా నంద్యాలలో సమస్యలు మరింత ఎక్కువయ్యాయన్నారు.  భూమా పార్టీలోకి వచ్చాక ఎన్నో సమస్యలపై ఘర్షణ పడ్డామని, నువ్వా, నేనా అనే స్థాయికి వెళ్లిందన్నారు.  ఆయన దురదృష్టవశాత్తు చనిపోయాక అఖిలప్రియ మంత్రి అయ్యాక కూడ నియోజకవర్గంలో పరిస్థితి ఏమాత్రం మారలేదన్నారు. నియోజకవర్గ సమస్యలపై  కౌన్సిలర్లు, ఎంపిటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్ లు ఎవరిని సంప్రదించకుండా అఖిలప్రియ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. భూమా నాగిరెడ్డి చనిపోయాక నంద్యాల టికెట్ విషయంలో చంద్రబాబు అలసత్వ ధోరణి ప్రదర్శించారన్నారు. అఖిలప్రియకు మంత్రి పదవి విషయంలో తాము ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదన్నారు.  కానీ, నంద్యాల టికెట్ విషయంలోనూ ముఖ్యమంత్రి తమను సర్దుకుపోవాలని చెప్పడం బాధించిందన్నారు. 

నియోజకవర్గంలో ఎస్పీవై రెడ్డి, భూమా, ఫరూక్ మూడు వర్గాల ఆధిపత్య పోరు సాగుతుందన్నారు. తమకు టికెట్ ఇస్తే ఓడిస్తామని ఎస్పీవై రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారని శిల్పా చెప్పారు.  నియోజకవర్గంలో తమకున్న ఇబ్బందులు, కార్యకర్తలను కాపాడుకోవాలన్న ఉద్దేశ్యంతో టికెట్ కావాలని ముఖ్యమంత్రిని అడిగితే  ఏమాత్రం పట్టించుకోలేదన్నారు.  సమర్థవంతంగా, నిజాయితీగా, ఏమీ ఆశించకుండా పనిచేసినా  పార్టీ గుర్తించలేదన్నారు. ఎప్పుడూ సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్ లే కాదు పార్టీపై దృష్టిపెట్టాలని చెప్పినా బాబు పట్టించుకోలేదన్నారు. నియోజకవర్గాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యే పరిస్థితి దారుణంగా ఉందన్నారు.  నియోజకవర్గంలో మా క్యాడర్ ను చాలా ఇబ్బందులకు గురిచేశారని శిల్పా ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో బాబు జిల్లాకు ఒక్క ఇండస్ట్రీ తీసుకొచ్చిన పాపాన పోలేదన్నారు. సమీక్షల్లో ఎక్కడ జిల్లా అభివృద్ధిపై చర్చ జరగలేదన్నారు. ఎంతసేపు అమరావతి, పోలవరం అంటున్నారే తప్ప రాయలసీమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. గోదావరి, కృష్ణాపుష్కరాల పేరిట వేల కోట్లు ఖర్చుపెడుతున్న ప్రభుత్వం రైతులకు రుణమాఫీ ఇవ్వలేకపోయిందన్నారు.  నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారని దుయ్యబట్టారు. 


Back to Top