రైతు సమస్యలపై కేంద్రమంత్రికి నివేదిస్తాం

గూడూరు ః తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని, రైతు సమస్యలపై ఢిల్లీకి వెళ్లి కేంద్ర వ్యవసాయశాఖామంత్రిని కలిసి ఇక్కడి పరిస్థితులను నివేదిస్తానని తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు తెలిపారు. బుధవారం గూడూరు రూరల్‌ మండలంలోని తిప్పవరప్పాడు ప్రాంతంలో నీరు లేక పూర్తిగా ఎండిపోయిన సవక తోటలను ఆయన పరిశీలించారు. ఎండిపోయిన సవకను నరికివేయడాన్ని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పంటలు కాపాడుకోలేక రైతులు కన్నీరు పెడుతున్నారని, రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ ప్రాంత రైతుల అభ్యర్థనలను స్వీకరించి ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రికి నివేదించి కరువు కింద రైతులకు సాయం అందించేలా కృషిచేస్తామన్నారు. అనంతరం సచిన్‌ దత్తత గ్రామం పీఆర్‌కండ్రిగలో చేపట్టిన అభివృద్ధి పనులను ఎంపీ పరిశీలించారు. ఆయన వెంట వైయస్సార్‌సీపీ సీఈసీ సభ్యులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, గూడూరు, సైదాపురం మండల కన్వీనర్లు మల్లు విజయకుమార్‌రెడ్డి, కమలపూడి కృష్ణారెడ్డి, ట్రేడ్‌యూనియన్‌ జిల్లా కార్యదర్శి నోటి రమణారెడ్డి, మెట్టా రాధాకృష్ణారెడ్డి, తదితరులు ఉన్నారు.

Back to Top