పార్లమెంట్‌లో కేంద్రంపై ఒత్తిడి తెస్తాం



విభజన హక్కులను సాధించుకుంటాం
హోదా సాధనలో టీడీపీ ఘోరంగా విఫలం
పోలవరం సందర్శణలో వాస్తవాలన్నీ బయటపడ్డాయి
ట్రాన్స్‌ట్రాయ్‌ 2020 అంటే మీరు 2018 జూన్‌లో ఎలా పూర్తి చేస్తారు బాబూ
మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తారా
ఢిల్లీ: విభజన సమయంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేలా పార్లమెంట్‌లో చర్చించి ఒత్తిడి తెస్తామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. పోలవరం, ప్రత్యేక హోదా అంశాలను చంద్రబాబు నీరుగారుస్తున్నాడని మండిపడ్డారు. ఢిల్లీలో పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో కలిసి మేకపాటి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన హక్కులను సాధించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అందువల్ల రాష్ట్రం పూర్తిగా నష్టపోయిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చివుంటే ఈ పాటికి అభివృద్ధి చెందేవారమని, చంద్రబాబు హోదాను నీరుగారుస్తున్నా.. ప్రతిపక్షంగా హోదా కోసం పోరాడుతూనే ఉన్నామన్నారు. ఎప్పటికైనా ప్రత్యేక హోదాను రాష్ట్రానికి తీసుకువస్తామని దీమా వ్యక్తం చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును కూడా చంద్రబాబు నీరుగార్చేందుకు యత్నిస్తున్నాడని మేకపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును తీసుకొని వచ్చి రకరకాల తిరకాసులు పెడుతుండడంతో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు సమాధి కాకుండా ఉండేందుకు ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ముఖ్యనేతలందరం కలిసి వెళ్లి పోలవరం ప్రాజెక్టును పరిశీలించామన్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సమయంలో చాలా విషయాలు బయటపడ్డాయన్నారు.
 
– కాంక్రీట్‌ 30 లక్షల క్యూబిక్‌ మీటర్లు చేయాల్సి ఉంటే ఇప్పటికీ 4 లక్షలు కూడా పూర్తి కాలేదు. రోజుకు 3 వేల క్యూబిక్‌ మీటర్లు మాత్రమే చేస్తున్నారు.
– ఎర్త్‌ వర్క్‌ కూడా 10.5 కోట్ల క్యూబిక్‌ మీటర్లు ఉంటే 7.5 కోట్ల మీటర్లు చేశారు. అది కూడా పోలవరం రైట్, లెఫ్ట్‌ కెనాల్‌ దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి తవ్వబట్టి దాంతో అంత క్వాంటిటీ వచ్చింది. ఇంకా మూడు కోట్ల క్యూబిక్‌ మీటర్లు జరగాల్సి ఉందని సాంకేతిక నిపుణులు చెప్పారు. 
– కాఫర్‌ డ్యాం ఇంకా మొదలు పెట్టలేదు. కాఫర్‌ డ్యాం కట్టిన తరువాతే రాక్‌పిల్లర్స్‌ డ్యాం కట్టాలి. ఇటువంటి పరిస్థితుల్లో జూన్‌కే నీళ్లు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది. 
– ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ వారు 2020 జూన్‌ వరకు సరిగ్గా లెక్కలు ముట్టచెబితేనే పూర్తిచేయగలం అని చెబుతుంటే.. చంద్రబాబు 2018 జూన్‌ వరకు ఇస్తామని చెప్పడం ఏంటీ? అంటే మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారా? 

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక హోదా, పోలవరం అంశాలపై ప్రస్తావిస్తామని మేకపాటి చెప్పారు. రేపు జరగబోయే అఖిలపక్షాల సమావేశంలో కూడా ఈ విషయాలను చర్చిస్తామన్నారు. పోలవరం, ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్, దుగ్గరాజపట్నం పోర్టు వంటి అంశాలను ప్రస్తావిస్తాం. వీటిని సాధించుకునేందుకు ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. రాష్ట్ర హక్కులను సాధించుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. అదే విధంగా ఫిరాయింపులపై కూడా చర్చిస్తామన్నారు. 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను టీడీపీ వారు లాక్కున్నారు. ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం వేటు వేయాల్సిందేనన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏ విధంగా రాజ్యసభ సభులపై వేటు వేశారో.. అదే విధంగా పార్లమెంట్, అసెంబ్లీల్లో రూల్స్‌ బ్రేక్‌ చేసిన వారిపై వేటు వేయాలన్నారు. వీరికో న్యాయం.. వారికో న్యాయం ఉంటుందా అని నిలదీశారు. 
Back to Top