సెంటు భూమి లాక్కున్నా ఊరుకోం

  • – బందర్‌ పోర్టు బాధితులకు వైయస్‌ జగన్‌ భరోసా 
  • – బుద్దాలవారిపాలెంలో రైతులతో ముఖాముఖి
  • – బలవంతపు భూ ఆక్రమణ సహించమని హెచ్చరిక 
కృష్ణాః బందర్‌ పోర్టు బాధితులకు అండగా వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కృష్ణాజిల్లా బందర్‌ మండలం బుద్దాలవారిపాలెం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో వైయస్‌ జగన్‌ రైతులతో మాట్లాడారు. బందర్‌ పోర్టు బాధిత రైతు కుటుంబాలకు వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అడ్డగోలు పాలన కొనసాగిస్తున్న చంద్రబాబు పాలనను బంగాళాఖాతంలో కలిపే రోజు దగ్గర్లోనే ఉందని మరో రెండేళ్లు ఓపిగ్గా భరించాలని రైతులకు సూచించారు. ఇప్పటికే మూడేళ్లు ఈ రాక్షస పాలనను భరించాం మరో రెండేళ్లు ఓపికపడితే రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక అవసరానికి మించి ఒక్క సెంటు కూడా తీసుకోమని స్పష్టం చేశారు. నిపుణుల సూచించన ప్రాంతంలోనే ప్రతిష్టాత్మకంగా పోర్టు నిర్మాణం చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌సీపీ బందర్‌పోర్టు నిర్మాణానికి వ్యతిరేకం కాదని అడ్డగోలు భూదోపిడీని మాత్రమే అడ్డుకుంటుందని పేర్కొన్నారు. 

నాడు 5 వేలు చాలన్నారు.. ఇప్పుడు 1.5లక్షల ఎకరాలా
ఎన్నికలకు ముందు ఈ ప్రాంతంలో ప్రచారం నిర్వహించిన చంద్రబాబు బందరు పోర్టు నిర్మానానికి 4800 ఎకరాల భూమి చాలని చెప్పిన విషయాన్ని వైయస్‌ జగన్‌ గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక పలుమార్లు మాటమార్చి 5200 ఎకరాలు, 22వేల ఎకరాలు.. 30 వేల ఎకరాలు.. ఇప్పుడేమో ఏకంగా లక్షా 5వేల ఎకరాలను కాజేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరానికి మించి ఒక్క సెంటు భూమి తీసుకున్నా వైయస్‌ఆర్‌సీపీ చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రైతులను ఒప్పించి వారికి అవగాహన కల్పించి బాధితులకు సరైన పరిహారం చెల్లించి భూములు తీసుకోవాలే తప్ప బెదిరించి లాక్కోవడం సహించేది లేదన్నారు. స్థానిక మంత్రి కొల్లు రవీంద్ర అధికార మదంతో అమాయక రైతుల భూములు లాక్కోవడం,  ఇవ్వని వారిని బెదిరించడం తగదన్నారు. 

రూ. 40 లక్షలు నష్ట పరిహారం ఇవ్వలేరా..
మూడు పంటలు పండే భూములు లాక్కుని పరిహారంగా రైతులకు ఇచ్చే నష్టపరిహారంపై వైయస్‌ జగన్‌ మండిపడ్డారు. రెండు పంటలు పండే భూమికి ఎకరాకు 30వేలు, మూడు పంటలు పండేవాటికి 50వేలు ఇస్తామంటున్నారని రైతులు చెప్పగా మన భూములు లాక్కుని మనకే బిచ్చంగా వేస్తారా అని సీఎంను ప్రశ్నించారు. అది కూడా మరీ దారుణంగా పదేళ్లు మాత్రమే ఇవ్వడం ఏంటని.. ఆ మొత్తం ఒకేసారి బ్యాంకుల్లో వేసుకున్నా నెలకు 30వేలు వడ్డీలే వస్తాయి కదా అని రైతులకు తెలిపారు. నీ సొంత అవసరాలకు ప్రజల సొమ్మును కోట్లకు కోట్లు వాడుకుంటున్నప్పుడు భూములు త్యాగం చేసే రైతులకు కనీసం ఎకరాకు 40 లక్షలు నష్ట పరిహారం చెల్లించలేవా అని మండిపడ్డారు. 

అమాయక రైతులను బెదిరిస్తే సహించం
ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో అమాయక రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బాధితులకు వైయస్‌ఆర్‌సీపీ అండగా వుంటుందని భరోసా ఇచ్చారు. మంత్రి కొల్లు రవీంద్ర, సీఎం చంద్రబాబు నాయుడులకు ప్రజలే బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. భూములు ఇవ్వడానికి రైతులు ఒప్పుకోవడం లేదని కోపంతో పొలాలకు నీటిని ఆపడం.. రైతులకు బ్యాంకు లోన్లు రాకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. పిల్లలకు పెళ్లిల్లు చేయడానికి డబ్బుల్లేక పొలాలు అమ్ముకుందామన్నా రిజిస్ట్రేషన్లు కూడా ఆపేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ము ధైర్యం ఉంటే ప్రజాహిత పాలన సాగించాలి లేదంటే రైతులను వారి మానాన వారిని వదిలేయాలి అంతేతప్ప పిచ్చిపాలన సాగిస్తే రైతులు నష్టపోయే పరిస్థితి ఉంటుందని హితవు పలికారు. పిల్లలను చదివించుకోవడానికి ఫీజులు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో లోను కోసం రైతులు బ్యాంకులకెళితే గడప తొక్కనీయడం లేదన్నారు. ఆనాడు వైయస్‌ఆర్‌ హయాంలో పైసా ఖర్చు లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోనే చదువులు పూర్తయ్యేవన్నారు. కానీ నేడు బాబు కార్పొరేట్‌ కాలేజీలతో కుమ్మక్కై ఫీజులను 70 వేలకు పెంచారన్నారు. కానీ ఫీయి రీయింబర్స్‌మెంట్‌ మాత్రం 30 వేలకు ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వడం లేదన్నారు. అప్పులు చేసి పిల్లలను చదివించుకునే దౌర్భాగ్యం వచ్చిందన్నారు. తాను అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం తీసుకొస్తానని రైతులకు హామీ ఇచ్చారు. 

గాయత్రి, బుద్దవారిపాలెం 
మా ఊరిలో 700 ఎకరాలు లాక్కుంటున్నారు. అందులోనే  అంగన్‌వాడీ కేంద్ర భవనం, పంటపొలాలున్నాయి. మేము సెంట్‌ భూమి కూడా ఇచ్చేది లేదు. ఏ ఒక్క రైతూ భూములు ఇచ్చేందుకు అంగీకరించకపోయినా చంద్రబాబు మాత్రం టీవీల్లో రైతులు సంతోషంగా భూములు ఇస్తున్నారని అబద్ధాలు చెబుతున్నాడు..

కల్యాణి, సర్పంచ్, చంద్రహారం
మా అత్తగారింటి దగ్గర మొదలెట్టి పుట్టింటి దాకా 12 కిలోమీటర్ల వరకు మూడు వేల ఎకరాలు భూములు లాక్కుంటున్నారు. మా నాన్న పసుపు కుంకుమ కింద ఇచ్చిన భూమి కూడా ల్యాండ్‌ పూలింగ్‌లోనే ఉంది. రెండు పంటలు పండే భూమి మాది. నా కొడుకు కాలేజీ ఫీజులకు బ్యాంకులకు లోన్‌ కోసం వెళితే ఇవ్వడం లేదు. పొలాలకు నీళ్లు ఆపేశారు. మాకు అండగా నిలబడిన వైయస్ఆర్‌ సీపీ నాయకుడు పేర్ని నానికి గాజులు వేస్తామని టీడీపీ నాయకులు అన్నారు. టీడీపీ నాయకులకు మహిళలంటే అంత చులకనా?

నాగేశ్వరావు, హుస్సేన్‌పాలెం...
నాది పదెకరాల పొలం ఉంది. ముగ్గురు కూతుళ్లున్నారు. లోన్లు రాలేదు.. నీళ్లు రాలేదు. మూడు పంటలు పండే పొలాలు. బాబు దొంగతనంగా మా పొలాలు లాగేసుకునే కుట్ర చేస్తున్నారు. మా పిల్లలకు కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి. దానికి పొలాలు అమ్ముకోవాలి. కానీ రిజిరేష్ట్రన్లు ఆపేశారు. ఏం చేయాలో అర్థం కాక అయోమయంగా ఉంది. 


Back to Top