అసెంబ్లీ సమావేశం కోసం పట్టుపడతాం

హైదరాబాద్, 18 అక్టోబర్ 2013:

శాసనసభను తక్షణమే సమావేశ పరిచి, సమైక్యాంధ్ర తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చాలా రోజులుగా డిమాండ్‌ చేస్తున్నదని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. అయితే, తమ డిమాండ్‌ను పట్టించుకోకుండా సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తుంగలో తొక్కారని ఆరోపించారు. సోనియాగాంధీ ఆదేశాల మేరకే కిరణ్‌ నడుస్తున్నారని తమకు అర్థం అవుతోందన్నారు. కిరణ్, లగడపాటి రాజగోపాల్‌ సోనియా దర్శకత్వంలో నడుస్తూ.. తమ పార్టీని విభజన సమస్యలో ఇరికించాలని యెల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం మధ్యాహ్నం సిఎం ఇంటి ముట్టడికి వెళ్ళే ముందు పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ నోట్‌ రాదంటూ అబద్ధాలు చెప్పి సీమాంధ్ర ప్రజలను సిఎం కిరణ్‌ మోసం చేశారని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ అధిష్టానం ఆదేశాల మేరకు మాత్రమే పనిచేస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డిని తప్పకుండా విభజన విషయంలో తామంతా నిలదీస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించమని, సమైక్య వాదాన్ని ముందుకు తీసుకువెళ్ళమని డిమాండ్‌ చేస్తామన్నారు. సమైక్యాంధ్ర కోసం ఉధృతంగా ఉద్యమిస్తున్న ఉద్యోగులను కూడా ఏవేవో సాకులు చూపించి వారిని నీరుగారుస్తున్నారని ఆరోపించారు.

సమైక్యాంధ్ర విషయంలో శ్రీ జగన్మోహన్‌రెడ్డి తీసుకున్న విధానాన్ని ప్రతిఒక్కరూ స్వాగతిస్తున్నారని, మద్దతిస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. తాను నిర్బంధంలో ఉన్నప్పటికీ ఆయన నీతి నిజాయితీతో కూడిన రాజకీయమే చేశారన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఈ నెల 26న హైదరాబాద్‌లోని ఎల్.బి. స్టేడియంలో నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభ ఒక గొప్ప మలుపు తిప్పుతుందన్న ధీమాను ఆయన వ్యక్తంచేశారు. స్వచ్ఛందంగా తాము చేస్తున్న ఉద్యమాన్ని గుర్తించి తోడుగా నిలుస్తున్నదని ఒక్క వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే అని ప్రజలు గుర్తిస్తున్నారని అన్నారు.

అసెంబ్లీని సమావేశపరచాలని, సమైక్య తీర్మానం చేయాలని గవర్నర్‌ను రెండుసార్లు కలిశామని, ముఖ్యమంత్రిని, అసెంబ్లతీ స్పీకర్‌ను కూడా కలిసి తీవ్రంగా ఒత్తిడి చేస్తామన్నారు.

Back to Top