హైదరాబాద్: రూ.20 కోట్లు కాదు కదా రూ.100 కోట్లు ఇచ్చినా తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టేది లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ స్పష్టం చేశారు. తాము శాశ్వతంగా వైఎస్ఆర్ సీపీలోనే కొనసాగుతామని చెప్పారు. ఎప్పటికైనా టీడీపీ ఓ మునిగే పడవ అని ఆమె అన్నారు. వైఎస్సార్సీపీకి చెందిన గిరిజన ఎమ్మెల్యేలను ఎలాగైనా లాక్కోవాలని చంద్రబాబు డబ్బులు ఎర చూపుతున్నారని, అది మానుకోవాలని ఈశ్వరి బాబుకు హితవు పలికారు. <br/>ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలని టీడీపీ కుట్రలు చేస్తుందని ఆమె మండిపడ్డారు. అందుకే రంపచోడవరం వంతల రాజేశ్వరీకి రూ.20 కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టారని అన్నారు. గిరిజన బిడ్డలమైన తాము వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే అసెంబ్లీలో అడుగుపెట్టగలిగామని చెప్పారు. తాము ఇవాళ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యామంటే అది తమ అధ్యక్షులు వైఎస్ జగన్ పెట్టిన రాజకీయ బిక్షవల్లేనని చెప్పారు.