ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగుతాం

నెల్లూరు: స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయించినట్లు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లాలోని ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలతో నెల్లూరులో వీరు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాలు, గడపగడపకు వైయస్సార్‌ కార్యక్రమం సాగుతున్న తీరు, చంద్రబాబు పరిపాలన అంశాలపై చర్చించారు.

అనంతరం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీలు మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో చర్చించి రెండు, మూడు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. పెద్ద నోట్ల రద్దై 45 రోజులు గడిచినా ఏటీఎంలు, బ్యాంకుల వద్ద పరిస్థితి మారలేదన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా నల్లధనం నిరోధానికి చర్యలు తీసుకోవాలని కోరారు.


Back to Top