ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం

  • తెలుగుదేశం పార్టీ విషప్రచారం 
  • వైయస్సార్సీపీపై బాబు మీడియా దుష్ప్రచారం
  • అబద్ధపు రాతలు రాసినందుకు ఆంధ్రజ్యోతి క్షమాపణ చెప్పాలి
  • డబ్బు పంచుతున్నది ఎవరో ప్రజలు గమనిస్తున్నారు
  • నంద్యాలలో టీడీపీ అవినీతి సొమ్మును వెదజల్లుతోంది

నంద్యాలః తెలుగుదేశం పార్టీ, బాబు అనుకూల మీడియా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వైయస్సార్సీపీపై అసత్య కథనాలతో విషప్రచారం చేస్తోందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి తనయుడు రవిలు మండిపడ్డారు. వైయస్సార్సీపీకి సంబంధించిన కార్డు స్లిప్పులను ఓటర్లకు పంచుతుంటే డబ్బులు పంచుతున్నారంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అసత్య కథనాలు రాయడంపై వారు మండిపడ్డారు. డబ్బులు పంచేదెవరో ప్రజలందరికీ తెలుసునని వారు అన్నారు. అబద్ధపు రాతలు రాసినందుకు క్షమాపణ చెప్పాలని పచ్చమీడియాను  డిమాండ్ చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఆంధ్రజ్యోతి అచ్చేసిన  ఫోటోకు సంబంధించిన వీడియోను ప్లే చేసి ఆధారాలతో సహా బయటపెట్టి టీడీపీ, ఎల్లో మీడియా దుర్బిద్దిని వైయస్సార్సీపీ ఎండగట్టింది.  ప్రభుత్వం పథకం ప్రకారం అవినీతి సొమ్మును వెదజల్లుతూ వైయస్సార్సీపీ, జగన్ మీద దుష్ర్పచారం చేస్తోందని పెద్దిరెడ్డి ఫైర్ అయ్యారు. న్యాయం కోసం పాటుపడే వారికి మద్దతివ్వాలి గానీ అబద్ధపు రాతలతో దుష్ర్పచారం చేయడం దారుణమని అన్నారు. నంద్యాలలో మంత్రులు ఒక్కో నాయకునికి ఎంత రేటు కడుతున్నారు. టీడీపీ ఏవిధంగా డబ్బులు పంచుతుందో ప్రజలంతా చూస్తున్నారన్నారు. 

ఓటుకు రూ.5వేలు ఇచ్చి కొనుక్కుంటానని చంద్రబాబు కర్నూలులో స్వయంగా చెప్పిన విషయాన్ని వైయస్సార్సీపీ నేతలు గుర్తు చేశారు. ఓటుకు రూ. 5వేలు ఇస్తామంటూ తెలుగుదేశం పార్టీ ప్రచారం కూడ చేస్తోందని ఫైర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి మీటింగ్ లకు వచ్చే ప్రజల ఆదరణ చూసి తట్టుకోలేక చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను ఆపుకోవడం కోసం రూ. 300 ఇస్తోందని దుయ్యబట్టారు. ఇలాంటి నీచ రాజకీయాలు ఎక్కడా చూడలేదని తూర్పారబట్టారు. నంద్యాలలో జరిగిన వైయస్ జగన్ బహిరంగసభలో కూడ మహిళలను  రానీయకుండా రూ.300 ఇచ్చి తాళాలు వేసి మీటింగ్ తర్వాత వదిలిపెట్టారన్నారు. ప్రతి  బూతులో తెలుగుదేశం పార్టీ రోజుకు రూ.  200 ఇస్తూ  200 మంది మహిళలను పెట్టిందన్నారు. బాబుకు ఈ సొమ్మంతా ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. నంద్యాల డెవలప్ మెంట్ కోసం ఆనాడు శిల్పా మోహన్ రెడ్డి ఫండ్స్ అడిగితే నిధులు లేవని చెప్పిన బాబు.. ఈరోజు ఎలక్షన్ లు వచ్చేసరికి రూ.1300కోట్లతో పాటు ఎలక్షన్ లో గెలవడం కోసం రూ. 200కోట్లు ఖర్చుపెడుతున్నారంటే ప్రతీ ఒక్కరు ఆలోచన చేయాలన్నారు. డబ్బులు పంచే అలవాటు మొదట్నుంచి టీడీపీకే ఉందని ఎద్దేవా చేశారు.  ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో టేపులతో చంద్రబాబు ఏవిధంగా దొరికిపోయాడో అందరం చూశామని,  రాత్రికి రాత్రే హైదరాబాద్ నుంచి బిచానా ఎత్తేసి విజయవాడకు వచ్చాడని ఎద్దేవా చేశారు. ప్రజలను మోసం చేద్దామన్న దుర్బుద్ధితోనే తెలుగుదేశం పార్టీ, అనుకూల మీడియా వైయస్సార్సీపీపై దుష్ర్పచారం చేస్తోందని పెద్దిరెడ్డి, రవిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియోను  ఫోరెన్సిక్ ల్యాబ్ కు కూడ పంపిద్దాం. డబ్బులు పంచినట్టు నిరూపిస్తే శిల్పా మోహన్ రెడ్డి ఇప్పుడే  విత్ డ్రా చేసుకుంటారు, టీడీపీ కూడ అందుకు సిద్ధమా అని రవి సవాల్ విసిరారు. 


చంద్రబాబువన్నీ కలుషితమైన రాజకీయాలేనని పెద్దిరెడ్డి మండిపడ్డారు. శాసనసభలో నీచమైన భాష,  సంస్కృతిని ప్రవేశపెట్టిన ఘనుడు చంద్రబాబేనని పెద్దిరెడ్డి విమర్శించారు. ఆనాటి స్పీకర్ లు ధర్మారావు, కుతూహలమ్మలను బాబు దుర్భషలాడితే ఏవిధంగా కన్నీళ్లు పెట్టుకున్నారో అందరం చూశామన్నారు.  వైయస్సార్సీపీ సభ్యులను అలగా జనం, మీకు పిచ్చిపట్టిందా, మీ అంతుచూస్తానని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు. బాబు అధికారంలోకి రాకముందు గుంటూరులో కత్తులు, కొడవళ్లు, గొడ్డొల్లు తెండి కాంగ్రెస్ పార్టీని చంపేద్దామని మాట్లాడాడని చెప్పారు. ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా చేసిన ఇలాంటి వ్యక్తి ఏం మాట్లాడినా తప్పు లేదట...ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిన బాబును ఏం చేద్దాం...? కాల్చేయాలా వద్దా అని ప్రజల గొంతుకను ప్రశ్నిస్తే వైయస్ జగన్ వ్యక్తిత్వంపై దాడి చేయడం దారుణమన్నారు. నలుగురు మంత్రులు, శాసనసభ్యులను పెట్టుకొని వైయస్ఆర్, వైయస్ జగన్ ల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం బాబుకు అలవాటైపోయిందన్నారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే ఒరేయ్  నా కొడక పాతేస్తానంటే చర్యలు లేవు. నీవు 600హామీలిచ్చావ్. ఒక్కటీ పూర్తిస్థాయిలో నెరవేర్చలేదు. వాటి గురించి ఆలోచన చేయండి అని ప్రశ్నిస్తే వైయస్ జగన్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తారా అంటూ చంద్రబాబుపై పెద్దిరెడ్డి నిప్పులు చెరిగారు. రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేయండి. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇవ్వాలని గుర్తు చేస్తుంటే...దాన్ని స్పోర్టివ్ గా తీసుకోకుండా జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారన్నారు.  

రాయలసీమ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న బాబు సీమకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.  కేసీ కెనాల్ కింద రెండు పంటలు పండాలంటే శ్రీశైలంలో 854 అడుగుల లెవల్ మెయింటైన్ చేయాలన్నారు. కానీ, అలా చేయకుండా తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలు ఎడాపెడా నీటిని డ్రా చేస్తున్నాయన్నారు. రాయలసీమ కోసం ఏం చేస్తున్నారు బాబు..? గతంలో ఇస్తామన్న రెండు పంటలకు నీరిచ్చేదానికి ప్రయత్నిస్తున్నావా అని నిలదీశారు.  నంద్యాలలో ఉపఎన్నిక జరగకపోతే బాబు ఆ ప్రాంతాన్ని పట్టించుకునే వాళ్లు కాదన్నారు. ఎన్నిక వచ్చిందనే ఆగమేఘాల మీద రోడ్లు వేసే కార్యక్రమం చేస్తూ 1700కోట్లు విడుదల చేశామంటున్నారన్నారు. పట్టిసీమ, ఎందుకు పనికిరాని పురుషోత్తపట్నంల పేరుతో కోట్లాది రూపాయలు దండుకునే దానికంటే ... ఇక్కడ 5,6వేల కోట్లు ఖర్చు చేసినా రాయలసీమవాళ్లు సంతోషపడేవాళ్లన్నారు. వైయస్ఆర్ తీసుకొచ్చిన మన్నవరం ప్రాజెక్ట్ ను  సామర్థ్యాన్ని కూడ తగ్గించేశాడని బాబుపై ధ్వజమెత్తారు. ఎన్నికల హామీలు నెరవేర్చమంటే ఉన్మాది, సైకో అంటూ  వైయస్ జగన్ పై విమర్శలు చేయడాన్ని పెద్దిరెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు.  

Back to Top