టీడీపీ నేతల భూదోపిడీని అడ్డుకుంటాం

గుంటూరు : అమరావతిలోని అమరేశ్వరునికి సంబంధించిన సదావర్తి సత్రం భూముల్లో అంగుళం కూడా దక్కనివ్వబోమని వైయస్సార్ సీపీ పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నీతి నిజాయితీలతో స్థలాన్ని కొనుగోలు చేశామని చెబుతున్న టీడీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఈ నెల 25న వైయస్సార్ సీపీ నిజ నిర్ధారణ కమిటీ చెన్నైకి బయలుదేరి వెళ్ళి 26న స్థలాన్ని పరిశీలిస్తుందని చెప్పారు. పార్టీ రాష్ట్ర నాయకులు ధర్మాన ప్రసాద్‌రావు నేతృత్వంలో కమిటీ పర్యటిస్తుందని వివరించారు. అరండల్‌పేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో పెదకూరపాడు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కావటి మాట్లాడుతూ ఆలయం, సత్రం అభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను కేవలం లక్షల్లో దోచుకునేందుకు కుట్రలు పన్నారని మండిపడ్డారు. చెన్నైలో పర్యటించి అక్కడ మార్కెట్, రిజిస్ట్రేషన్ విలువ, స్థానిక పరిస్థితులను పూర్తిస్థాయిలో చేస్తామని చెప్పారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు పాటుపడుతున్నామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భూములను దోచుకోవటానికి కొమ్మాలపాటి పథక రచనలు చేశారని చెప్పారు. అవసరమైతే న్యాయ పోరాటానికి కూడా వెనుకాడబోమన్నారు. కార్యకర్తలపై దాడులు చేయించినంత మాత్రాన భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కార్యకర్తలకు అండగా పార్టీ ఉంటుందని, ఎటువంటి ఇబ్బంది వచ్చినా.. రాష్ట్ర, జిల్లా నాయకత్వం అండగా నిలుస్తుందని హామీనిచ్చారు. 
Back to Top