ప్రభుత్వం మెడలు వంచైనా నీళ్లు తీసుకొస్తాం

జలదీక్షను విరమించిన రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి
వైయస్‌ఆర్‌ జిల్లా:ప్రభుత్వం మెడలు వంచైనా ప్రొద్దుటూరుకు నీళ్లు తీసుకొని వస్తానని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి హెచ్చరించారు.  ప్రొద్దుటూరు పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని 24 గంటల పాటు జలదీక్ష చేపట్టిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మంగళవారం విరమించారు. మొదటి నుంచి దీక్షా శిబిరాన్ని పడగొట్టి, ఎమ్మెల్యేను అరెస్టు చేసినా ఆయన వెనుకడుగు వేయకుండా 24 గంటల పాటు దీక్ష కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జలదీక్షను భగ్నం చేసేందుకు ఈ ప్రభుత్వం ఆది నుంచి కూడా ఎన్నో ప్రయత్నాలు చేసిందని మండిపడ్డారు. దీక్ష చేయకుండా తనను, తన భార్యను, చెల్లెళ్లను, పార్టీ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్ని అవంతరాలు సృష్టించినా కూడా ప్రజల పక్షాన బాధ్యత కలిగిన వ్యక్తిగా 24 గంటలు కాదు గదా..35 గంటలు దీక్షను కొనసాగించానని చెప్పారు. ఈ జలదీక్షకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని తెలిపారు. అన్ని సంఘాలు కూడా ఈ దీక్షకు మద్దతు ప్రకటించాయని తెలిపారు. అయితే ప్రభుత్వం కానీ, అధికారులు కానీ కనీసం ఒక ప్రకటన కూడా చేయకపోవడం బాధాకరమన్నారు. గండికోట నుంచి మైలవరం, అక్కడి నుంచి ప్రొద్దుటూరుకు నీళ్లు మళ్లిస్తామనికానీ, నీటి సమస్యను పరిష్కరిస్తామని కానీ, ప్రత్యామ్నయ మార్గాలు అన్వేషించకపోవడం దురదృష్టకరమన్నారు.ఈ ప్రభుత్వానికి మరొక్క వారం రోజులు గడువిస్తున్నామని, గండికోట నుంచి పెన్నాకు నీళ్లు వదలకపోతే ప్రొద్దుటూరు నుంచి కడప కలెక్టరేట్‌ వరకు వేలాది మంది కార్యకర్తలు, ప్రజలతో కలిసి పాదయాత్ర చేస్తానని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి హెచ్చరించారు.

తాజా వీడియోలు

Back to Top