రైల్వేజోన్ కోసం ఎందాకైనా

విశాఖ‌ప‌ట్నంః ప్ర‌త్యేక రైల్వేజోన్ పోరాటం ఇక్క‌డితో ఆగ‌ద‌ని, జోన్ సాధించే వ‌ర‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంద‌ని పార్టీ సీనియ‌ర్ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌త్యేక రైల్వేజోన్ విశాఖ ప్ర‌జ‌ల హ‌క్కుగా భావించి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాల మేర‌కు జిల్లా అధ్య‌క్షుడు గుడివాడ అమ‌ర్‌నాథ్ చేప‌ట్టి `ఆత్మ‌గౌవ‌ర యాత్ర` ముగిసింది. అన‌కాల‌ప‌ల్లిలో ప్రారంభ‌మైన ఈ యాత్ర చివ‌రి రోజు త‌గ‌ర‌పువ‌ల‌స జంక్ష‌న్ వ‌ద్ద ముగిసింది. అమ‌ర్ 201 కిలోమీట‌ర్ల మేర రైల్వేజోన్ కోసం పాద‌యాత్ర చేప‌ట్టారు. ముగింపు స‌మావేశంలో పార్టీ సీనియ‌ర్ నేత‌లు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్సీ కొల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి, త‌మ్మినేని సీతారాంలు పాల్గొన్నారు. రైల్వేజోన్ కోసం పాద‌యాత్ర చేప‌ట్టిన అమ‌ర్‌ను అభినందించారు. ఈ సంద‌ర్భంగా బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ అధికారం చేప‌ట్టిన కొత్త‌లో ఏడాదిలో రైల్వేజోన్ తీసుకొస్తామ‌ని, లేనిప‌క్షంలో రాజీనామా చేస్తామ‌ని చెప్పిన టీడీపీ ప్ర‌జాప్ర‌తినిథులు మూడేళ్లు గ‌డిచినా ప‌ట్టించుకోక‌పోవ‌డం దుర్మార్గ‌మ‌న్నారు. కేంద్రంలో అధికార పార్టీకి రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఉన్న విశాఖ ఎంపీ హ‌రిబాబు సైతం రైల్వేజోన్ విష‌యంలో చిత్త‌శుద్ధి చూపించ‌క‌పోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. రైల్వేజోన్ కోసం జిల్లా అధ్య‌క్షుడు అమ‌ర్‌నాథ్ చేప‌ట్టిన పాద‌యాత్ర‌కు స‌హ‌క‌రించిని ప్ర‌తీ ఒక్క‌రికి బొత్స కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. 

Back to Top