కేంద్రం మెడలు వంచైనా రైల్వేజోన్‌ సాధిస్తాం

  • ఈ నెల 22వ తేది నుంచి ప్రత్యేక రైల్వేజోన్‌ పాదయాత్ర
  • ఆత్మగౌరవ యాత్రగా నామకరణం
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌
విశాఖ: పాదయాత్ర ద్వారా ఢిల్లీ నాయకుల మెడలు వంచైనా విశాఖ రైల్వే జోన్‌ సాధించుకుంటామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు.  ప్రజల మనోభావాలను సీఎం చంద్రబాబు ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టాడని అమర్‌ మండిపడ్డారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... రైల్వేజోన్‌ సాధనకు చేయబోయే పాదయాత్ర వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన తరువాత నూతనంగా ఏర్పాటైన ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి కోసం అనేక అంశాలను చట్టంలో పొందుపర్చారని గుర్తు చేశారు. రాష్ట్రానికి జీవనాధారం అయిన పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే నిర్మాణం చేపడుతోందని, విశాఖ అభివృద్ధి చెందాలంటే ఆరు నెలల్లో ప్రత్యేక రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని చట్టంలో పొందుపరిచారన్నారు. వీటన్నింటితో పాటు రాష్ట్ర సంజీవని అయిన ప్రత్యేక హోదాను ఇస్తామని చెప్పి పార్లమెంట్‌లో పోటీపడ్డారని గుర్తు చేశారు. చంద్రబాబు పార్ట్ నర్ షిప్‌ సమ్మిట్‌ల పేరుతో వందలాది కోట్లు ఖర్చు చేస్తున్నారు కానీ ఇంతవరకు ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పలేకపోయారని ఎద్దేవా చేశారు. విశాఖకు రైల్వేజోన్‌ కేటాయిస్తే పార్ట్ నర్ షిప్‌ సమ్మిట్‌లు పెట్టాల్సిన అవసరం ఉండదని బాబుకు చురకంటించారు. 

విశాఖ రైల్వేజోన్‌ కోసం పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప  అన్న నినాదంతో వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై శాంతియుత పోరాటానికి సిద్ధపడిందన్నారు. విశాఖ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కేంద్రానికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో అనకాపల్లి నుంచి భీమిలీ వరకు 8 నియోజకవర్గాలు, 220 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు. విశాఖలో ఎన్నికల కోడ్‌ కారణంగా మార్చి 22వ తేది నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. అనకాపల్లిలో రాజ్యాంగ ప్రదాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం నుంచి పాదయాత్ర మొదలై భీమిలీ మున్సిపాలిటీ వద్ద ముగుస్తుందన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పాదయాత్రకు ఆత్మగౌరవ యాత్రగా నామకరణం చేస్తున్నామని చెప్పారు. ఈ పాదయాత్రలో ప్రజలంతా పార్టీలకు అతీతంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టిన చంద్రబాబుపై పోరాటం జరుగుతుందన్నారు. పాదయాత్ర ద్వారా ఢిల్లీ నాయకుల మెడలు వంచైనా ప్రత్యేక రైల్వే జోన్‌ సాధించుకుంటామన్నారు. 
Back to Top