అడుగులో అడుగేద్దాం..సర్కార్‌ను సాగనంపుదాం

  • బాబు మూడేళ్ల పాలనలో కరువే..కరువు
  • పంటలకు గిట్టుబాటు ధర లేదు 
  • రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ ఇవ్వడం లేదు
  • అబద్ధపు హామీలతో బాబు అందర్ని మోసం చేశాడు
  • శ్రీశైలంలో నీళ్లున్నా..సీమకు ఇవ్వని పరిస్థితి
  • మహానేత కట్టించిన ప్రాజెక్టుల వద్ద బాబు ఫోజులు
  • ఆరోగ్యశ్రీని నీరుగార్చిన టీడీపీ సర్కార్‌
  • పిల్లలను చదివించాలంటే ఇల్లు, పొలాలు అమ్ముకోవాల్సి వస్తోంది
  • బాబు హామీలపై నిలదీయండి
  • కర్నూలు జిల్లాలో ముగిసిన మొదటి విడత రైతు భరోసా యాత్ర

కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 90 శాతం ప్రాజెక్ట్ లు పూర్తయ్యాయి. ఇప్పుడు చంద్రబాబు 5 శాతం మాత్రమే పనులు చేసి ఆ ప్రాజెక్టులన్నింటినీ తానే కట్టించినట్లు అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తిని మనందరం ఒక్కటై బంగాళాఖాతంలో కలిపేద్దామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లాలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర మంగళవారం ఆరో రోజు శ్రీశైలం నియోజకవర్గంలోని మహానంది మండలంలో సాగింది. ఉదయం ఆయన మహానంది మండలం వెంగళరెడ్డి పేట నుంచి యాత్రను ప్రారంభించారు. బుక్కాపురం, అల్లినగరం, శ్రీనగరం మీదగా రోడ్డుషో నిర్వహించారు. అనంతరం మహానందిలో కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరుడి దర్శించుకున్న ప్రతిపక్ష నేత గాజులపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ..చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రానికి వచ్చిందేమీ లేదని, మూడేళ్ల నుంచి ఇక్కడ కరువే కరువని ధ్వజమెత్తారు. 2015వ సంవత్సరంలో  రైతులకు ఇవ్వాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. 2014 ఎన్నికలకు ముందు ఏ టీవీ ఆన్‌చేసినా, ఏ గోడపై చూసినా, పేపర్‌లో ఏ ప్రకటన చూసిన బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని, రైతు రుణాలు బేషరత్తుగా మాఫీ చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారని గుర్తు చేశారు. బాబు సీఎం అయ్యాడు కానీ రైతుల రుణాలు మాఫీ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు మాటలు నమ్మిన రైతులు చేసిన అప్పులు తీర్చలేక, పంటలు పండక, బ్యాంకుల్లో రుణాలు చెల్లించలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారిక లెక్కల ప్రకారమే కర్నూలు జిల్లాలో 40 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, అయినా ఎక్స్‌గ్రేషియా మాత్రం కేవలం నలుగురికే ఇచ్చారని మండిపడ్డారు. 

మూడేళ్లుగా రబీకి సాగునీరేది?
దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో ప్రతి రబీ పంటకు శ్రీశైలం నుంచి నీళ్లు అందాయని, బాబు ముఖ్యమంత్రి అయ్యాక రబీకి సాగునీరేదని వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు. శ్రీశైలం ప్రాజెక్టులో గతేడాది ఆగస్టు 16 నుంచి 844 అడుగుల నీటిమట్టం ఉన్నా కూడా రాయలసీమ రైతులకు నీళ్లు ఇవ్వడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో పేరుగాంచిన కర్నూలు సోన రైతుల పరిస్థితి దారుణంగా మారిందని, క్వింటాల్‌ రూ.1250 చొప్పున కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. ఉల్లి రైతులు కిలో రెండు రూపాయలకు అమ్ముకోలేక పొలంలోనే దున్నేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టమోట రైతుల పరిస్థితి అంతే దారుణంగా ఉందన్నారు. తాను జిల్లాలో పర్యటించిన సమయంలో వరి, కంది, మిరప, మినుము, పెసర, అరటి, పసుపు తదితర పంటలు పరిశీలించానని, దిగుబడులు బాగా తగ్గాయని, పంటలకు గిట్టుబాటు ధరలు కూడా దక్కడం లేదని వైయస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

అవేమైనా బాబు అత్తగారి సొమ్మా?. 
దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 23 లక్షల మంది పేదలకు 31 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేస్తే, ఇప్పుడు చంద్రబాబు వచ్చి ఆయన అత్తగారి సొమ్ములా దళితుల భూములు లాక్కుంటున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. కేబినెట్‌ సమావేశాల్లో కూడా రైతుల సమస్యలపై మాట్లాడకుండా.. భూములు ఎలా లాక్కోవాలనే విషయంపైనే మాట్లాడుతున్నారని అన్నారు.  ఎస్సీ, ఎస్టీల భూములు లాక్కొని సింగపూర్‌ కంపెనీలకు కట్టబెట్టి వారి నుంచి టీడీపీ నేతలు కమీషన్లు తీసుకుంటున్నారని దుయ్యబట్టారు.

ఇలాంటి వ్యక్తి పరిపాలనకు యోగ్యుడా?
ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యంకాని హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. ఇలాంటి వ్యక్తి సీఎంగా ఉండటానికి యోగ్యుడా అని ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే, చంద్రబాబు ఇప్పుడు దాన్ని కూడా నీరుగార్చారని విమర్శించారు. నాడు 108కు పోన్‌ చేస్తే కూయ్‌..కూయ్‌ అంటూ 20 నిమిషాల్లో మనముందు వాలిపోయి బాధితులకు కార్పొరేట్‌ ఆసుపత్రికి చేర్చేవారన్నారు. లక్షల రూపాయల విలువ చేసే వైద్యాన్ని పూర్తి ఉచితంగా చేసేవారని గుర్తు చేశారు.మూగ, చెవిటి ఆపరేషన్లు చేయించాలంటే ఇప్పుడు రూ.6 నుంచి రూ. 9లక్షలు ఖర్చు అవుతుందన్నారు. వైయస్‌ఆర్‌ పాలనలో 12 సంవత్సరాల వయసు వరకు ఉచితంగా ఆపరేషన్లు చేసేవారన్నారు. బాబు వచ్చాక ఆ పరిమితిని మూడేళ్లకు కుదించారని, ఆ వయసులో వారికి ఏ లోపం ఉందో గుర్తించలేమని, ఇంతటి దారుణంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేశారన్నారు. ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఎక్కడున్నాయో కూడా తెలియదని, కాక్లియర్‌ ఇంప్లాట్ల కోసం మూడేసి సంవత్సరాలు వేచి చూడాల్సి వస్తోందని అన్నారు. కిడ్నీ ఫెయిల్‌ అయిన రోగులకు డయాలసిస్‌ చేయాలంటే రూ.లక్షలు ఖర్చు అవుతుందని, ప్రభుత్వం ఏడాదికోసారి వెయిటింగ్‌ లిస్టులో పెడుతున్నారని మండిపడ్డారు.  పేదలు చదువుకోవాలనే సదుద్దేశంతో వైయస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం పెడితే, చంద్రబాబు దాన్ని కూడా పక్కన పెట్టేశారన్నారు. ఇప్పుడు పిల్లలను చదివించుకోవాలంటే ఇల్లు, పొలాలు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. అబద్ధపు హామీలతో రైతులు, మహిళలు, విద్యార్థులతో సహా ఎవరినీ వదిలిపెట్టకుండా చంద్రబాబు అందరినీ మోసం చేశారన్నారు. వైయస్‌ హయాంలో ప్రాజెక్టులన్నీ 90 శాతం పూర్తయ్యాయని, ముచ్చుమ్రరి ఎత్తిపోతల పథకాన్ని ఐదు శాతం అరకొరగా పూర్తి చేసిన చంద్రబాబు ఆ ప్రాజెక్టు గురించి కలలు కన్నానని, తానే కట్టానని బిల్డప్‌ ఇస్తున్నారని దుయ్యబట్టారు. రేపు పులివెందుల నియోజకవర్గంలోని పైడిపాలెం ప్రాజెక్టును కూడా బాబు ప్రారంభిస్తున్నారని, అక్కడ కూడా ఇదే అబద్దాలు ఆడతారని పేర్కొన్నారు. పైడిపాలెం ప్రాజెక్టుకు చంద్రబాబు కేటాయించింది కేవలం రూ.24 కోట్లు ఇచ్చారని, అంతమాత్రానికే ఆయన ఫోజులు కొడుతున్నారని ఫైర్‌ అయ్యారు. అబద్ధాలు ఆడే మనిషి మనకొద్దని, అందరం కలిసికట్టుగా ఒక్కటై అడుగులో అడుగేద్దామని, చేతిలో చెయ్యి కలపాలని, నాతో కలిసి రావాలని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
  
–––––––––
మహానందిలో వైయస్‌ జగన్‌ ప్రత్యేక పూజలు
కర్నూలు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం  మహానందీశ్వరాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ప్రతిపక్ష నేతకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు తీర్థ ప్రసాదాలు అందించారు. 
 –––––––––––––
పసుపు పంటను పరిశీలించిన వైయస్‌ జగన్‌
కర్నూలు : రైతు భరోసా యాత్రలో భాగంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  మంగళవారం మహానంది మండలం శ్రీనగరంలో పసుపు, అరటి పంటలను పరిశీలించారు. మద్దతు ధర, ఇన్‌పుట్‌ సబ్సిడీకి సంబంధించిన వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. కాగా వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పసుపు, అరటి పంటకు గిట్టుబాటు ధర లభించిందని, ఇప్పుడు మాత్రం కనీసం పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఈ సందర్భంగా తమ ఆవేదన వెళ్లబోసుకున్నారు. నాడు క్వింటాల్‌ పసుపు రూ.15 వేల దాకా ఉండేదని, ప్రస్తుతం రూ.5 వేల నుంచి రూ.6 వేల కూడా ఇవ్వడం లేదని రైతులు పేర్కొన్నారు. గతంలో ఎకరాలకు 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని, ప్రస్తుతం 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరా పసుపు పంట సాగుకు కౌలుతో కలిపి రూ.1.60 లక్షలు ఖర్చు వస్తుందని, అయితే ప్రస్తుతం గిట్టుబాటు ధర లేక పెట్టుబడులు కూడా చేతికందడం లేదని రైతులు వాపోయారు.  ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ రెండేళ్లలో రైతు ప్రభుత్వం వస్తుందని ధైర్యం చెప్పారు.
 
Back to Top