భూదందా, దోపిడీకి మేం వ్యతిరేకం..!

కేసీఆర్ తో ఏకాంత గుసగుసలేంటి బాబు..!
ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు వెళ్లి కాళ్లు పట్టుకున్నావా..!

హైదరాబాద్ః రాజధాని ముసుగులో చంద్రబాబు చేస్తున్న దోపిడీకి మాత్రమే తాము వ్యతిరేకమని...రాజధానికి కాదని వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. శంకుస్థాపన పేరుతో ప్రభుత్వం సింగపూర్ తో భూదందాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని మండిపడ్డారు. వందలాది కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ హంగూ ఆర్భాటలతో చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బొత్స ఫైరయ్యారు.  వైఎస్సార్సీపీ నేతలు పార్థసారధి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో కలిసి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. 

సింగపూర్ కు తాకట్టు..! 
రాజధానిలో భూమిపూజ లాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు ప్రతిపక్షాలు గుర్తు రాలేదా అని బొత్స ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సింగపూర్ కు తాకట్టు పెడుతున్న కార్యక్రమానికి వచ్చి సాక్షి సంతకాలు పెట్టాలా అని నిలదీశారు. రాజధాని అదేదో కుటుంబవ్యవహారం అన్నట్టు చంద్రబాబు, వారి తాపేదారులు ఇష్టమొచ్చినట్లు చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు.  ఆహ్వానపత్రికలు పంపొద్దని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 8 అంశాలతో బహిరంగ లేఖ రాశారని..ఇప్పటివరకు వాటిలో  ఏ ఒక్క అంశానికి ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదన్నారు.  ప్రధానితో శంకుస్థాపన వేదికపైనే చంద్రబాబు  స్పెషల్ స్టేటస్ ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు.  

దొంగా, పోలీస్ ఆట..!
ప్రగల్భాలు పలికే చంద్రబాబు కేసీఆర్ తో ఏకాంతంగా ఎందుకు సమావేశమయ్యారో ప్రజలకు చెప్పాలన్నారు. ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు వెళ్లిన చంద్రబాబు...మంత్రులని బయటకు పంపించి 30 నిమిషాల పాటు రహస్యంగా ఏం మాట్లారో బయటపెట్టాలన్నారు. ఓటుకు కోట్లు కేసు కోసం  కేసీఆర్ కాళ్లు పట్టుకునేందుకే చంద్రబాబు అందర్నీ బయటకు పంపించారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తో రహస్యంగా కూర్చొని దొంగాపోలీస్ ఆట ఆడారని బొత్స చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఆంధ్ర ప్రజల పరువు తాకట్టుపెట్టిన చంద్రబాబు..తెలుగువారి ఆత్మగౌరవం గురించి మాట్లాడ్డం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు లాంటి స్వార్థ విధానాలు తమకు లేవని బొత్స తెలిపారు. 

Back to Top