దాడి చేసి సారీ చెబితే ఒప్పుకుంటారా బాబూ?

  • ఎమ్మెల్యే చెవిరెడ్డి చేసిన నేరం ఏంటీ?
  • ముఖ్యమంత్రే మధ్యర్తిత్వం చేయడం సిగ్గుచేటు
  • రాష్ట్రంలో పోలీసులకు కూడా రక్షణ లేదు
  • కేశినేని, బోండా ఉమాలపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి
  • ఎమ్మెల్యే డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌
  • విజయవాడ: ఎవరిమీదనైనా దాడి చేసి సారీ చెబితే ఒప్పుకుంటారా..? అలాంటి కొత్త చట్టాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకురావాలని ఎమ్మెల్యే డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ధ్వజమెత్తారు. అలాంటి చట్టం వస్తే మీ లాంటివాళ్లు తప్పు చేసినప్పుడు మాకు కూడా కొంత వెలుసుబాటు వస్తుందని టీడీపీ నేతలను ఉద్దేశ్యించి వ్యాఖ్యానించారు. టీడీపీ నేతల అరాచకాలపై శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వైయస్‌ఆర్‌ సీపీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి ఎక్కడున్నారో ఆచూకీ కూడా తెలియనివ్వడం లేదని మండిపడ్డారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఏమైనా క్రైం చేశారా..? లేక మీ నేతల్లా అధికారులపై దాడులకు తెగబడ్డాడ ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. మా శాసనసభ్యుడిని ఏ కారణంతో నిర్భందించారని సభలో అధికార పార్టీని నిలదీసేందుకు కూడా ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మైక్‌ ఇవ్వడం లేదని మండిపడ్డారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఐఏఎస్‌ అధికారిపై టీడీపీ నేతలు దాడి చేసిన కేసులో మధ్యవర్తిత్వం వహించడం సిగ్గుచేటన్నారు. మేము ఎవరినైనా దుర్భాషలాడుతాం.. దాడి చేస్తాం.. క్షమాపణ చెప్పేస్తాం అంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. దానికో చట్టం ఉంది. దాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. క్షమాపణ ఆర్టీఏ కమిషనర్‌కు చెప్పారు గానీ దాడి చేసిన కానిస్టేబులకు చెప్పారా.. కానిస్టేబుల్‌కు మనోభావాలు ఉండావా అని నిలదీశారు.

    తప్పుచేయనందుకు దాడులు చేస్తారా
    ప్రజల సమస్యల పరిష్కరానికి కాకుండా సొంత ప్రయోజనాల కోసం అధికారుల దగ్గరకు వెళ్లి వారిపై దాడికి తెగబడడం ఎంత వరకు న్యాయమని అనిల్‌కుమార్‌ యాదవ్‌ ప్రశ్నించారు. ఆరెంజ్‌ ట్రావెల్స్‌పై ఉన్న కేసుకు సంబంధించి వివరాలను మార్చి రాయాలను అధికారులపై ఒత్తిడి తెచ్చే క్రమంలోనే ఈ తతంగం జరిగిందని స్పష్టం చేశారు. భద్రత విషయంలో చంద్రబాబు చాలా గొప్పగా చెబుతున్నారు కానీ రాష్ట్రంలో పోలీసులకే రక్షణ కరువైందని పేర్కొన్నారు. అధికార పార్టీ నుంచి పోలీసులను కాపాడటానికి ఇంకో వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సని పరిస్థితి ఏర్పడుతోందన్నారు. నేను నోరు విప్పితే మీలోని చాలా మంది జాతకాలు బయటపడతాయని అధికారి బాలసుబ్రమణ్యం అన్నారని గుర్తు చేశారు. అవేంటనేవి ప్రజలకు తెలియజేయాలన్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళితేనే అధికారుల ఆటంకాలకు అడ్డుతగిలారని క్రిమినల్‌ కేసులు పెట్టారే.. మరి సొంత పనికోసం వెళ్లి అధికారులపై దాడులు చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా, ఎంపీ కేశినేనిలపై ఎలాంటి కేసులు పెట్టాలో చంద్రబాబు చెప్పాలన్నారు. రాష్ట్రంలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న టీడీపీ నేతలపై క్రిమినల్‌ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దివంగత భూమా నాగిరెడ్డి కేవలం మాట్లాడితేనే ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ కింద కేసులు పెట్టి వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనపై కేంద్ర ప్రభుత్వం కన్నెయాలని కోరారు.
Back to Top