బాబు సీఎంగా ఉండడం మన కర్మ

*విద్యార్థులతో వైయస్ జగన్ ముఖాముఖి
*ప్రత్యేకహోదా ప్రాముఖ్యతపై దిశానిర్దేశం
*హోదాకోసం గర్జించిన యువతరం
*కాబోయే సీఎం జైజగన్ అంటూ నినాదాలు
*వైయస్ జగన్ తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్న యువత

కర్నూలుః ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న కపట నాటకాలపై యువతను చైతన్యవంతం చేసేందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అధ్యక్షతన కర్నూలు నగరంలో నిర్వహించిన యువభేరి కార్యక్రమం విజయవంతం అయ్యింది. నగర శివారు జాతీయ రహదారిలోని వీజేఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి యువత, విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చి హోదాపై గళమెత్తారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలను విద్యార్థులు తూర్పారబట్టారు. హోదా ఉద్యమంలో వైయస్‌ జగన్‌కు తోడుగా నిలుస్తామని చెప్పారు. కర్నూలు నగరమంతా యువభేరి సందడి నెలకొంది. యువభేరి కార్యక్రమానికి వెళ్లకుండా విద్యార్థులను ఆపేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హోదా కోసం ఎందాకైనా ఉద్యమిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. 

విద్యార్థులతో వైయస్ జగన్ ముఖాముఖి

కుక్కకున్న విశ్వాసం కూడా బాబుకు లేదా?
సుధారాణి(ఎంబీఏ విద్యార్థిని)
హోదా కోసం పోరాడుతుంటే విద్యార్థులు చెడిపోతున్నారని బాబు అంటున్నారు. కానీ వారి ఎమ్మెల్యేలు మాత్రం ఎమ్మార్వోలను కొట్టొచ్చు.. మంత్రుల కొడుకులు నడిరొడ్డుమీద అమ్మాయిలను అసభ్యంగా వేధించవచ్చు. అదేమంటే కుక్క అడ్డు వచ్చిందని చెబుతారు. ఇక లోకేష్‌ విదేశాల్లో మందు తాగుతూ అమ్మాయిలతో జల్సాలు చేయవచ్చు. కానీ మేము మాత్రం హోదా కోసం పోరాడకూడదంట. కుక్కకైనా విశ్వాసం ఉంటుంది కానీ బాబుకు లేదు. మా ఓట్లతో గెలిచి ఇప్పుడు మాకే వెన్నుపోటు పొడుస్తున్నారు.

వైయస్‌ జగన్‌: చంద్రబాబుకు పిచ్చి పట్టింది. ఓటుకు కోట్ల కేసు కోసం రాజీపడి, ప్రత్యేక హోదా కోసం యువత పోరాడుతుంటే పీడియాక్ట్‌ పెడతామనడం ఏంటి? నిజంగా బాబు సిగ్గుతో తలదించుకోవాలి. కనీసం మీ మాటలు విన్న తర్వాతనైనా బాబుకు బుద్ధిరావాలని భగవంతుడిని కోరుకుందాం. 
––––––––––––––––
బాబు సంపాదనతో అందరూ ఉచితంగా చదువుకోవచ్చు
శ్వేత, బీటెక్‌ సెకండియర్‌
చంద్రబాబు, లోకేష్‌లు అక్రమాలతో సంపాదిస్తున్న అవినీతి సొమ్ముతో రాష్ట్రంలోని ప్రతిఒక్కరూ ఉచితంగా చదువుకోచ్చు. నేడు నేను బీటెక్‌ చదువుకుంటున్నానంటే వైయస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం పుణ్యమే. లేదంటే మా తల్లిదండ్రులు ఎప్పుడో పెళ్లి చేసి పంపేవారు. మీరు చేస్తున్న ఉద్యమానికి అండగా ఉంటాం. మీ పోరాటంలో భాగస్వాములమవుతాం.
–––––––––––––
మీ మార్గంలో నడవడానికి మేం సిద్ధం
రోహిణి దివాకర్‌
ప్రత్కేక హోదా వర్షంలాంటిది. అందరికీ గొంతు తడుపుతుంది. ప్యాకేజీ పైపులైను లాంటిది. పైపులైను వేసుకున్నవారికే నీరు వచ్చేది. హోదా యువభేరికి వస్తున్న మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు. అయినా మేము వెనక్కితగ్గే ప్రసక్తే లేదు. మీరు చూపిన మార్గంలో నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓటుకు కోట్ల కేసు కోసం 5 కోట్ల ప్రజల అభివృద్ధిని తాకట్టుపెట్టడం ఎంతవరకు సమంజసం?

వైయస్‌ జగన్‌: హోదా కోసం పోరాడుతున్న విద్యార్థులపై పీడియాక్ట్‌ కేసులు పెడితే రాష్ట్రం అతలాకుతలం అయిపోతుందని గట్టిగా చంద్రబాబుకు వార్నింగ్‌ ఇస్తున్నాం.. మొత్తం వైయస్‌ఆర్‌ సీపీ విద్యార్థులకు తోడుగా ఉంటుంది. విద్యార్థులంతా ఒక్కటై చంద్రబాబు పార్టీని బంగాళాఖాతంలో కలిపే రోజు వస్తుంది. స్టూడెంట్స్‌పై చెయ్యివేసే ధైర్యం ఎవరికీ లేదు. కనీసం ఇప్పటికైనా బాబుకు జ్ఞానోదయం అవ్వాలని ఆశిద్దాం.
––––––––––––––––––––––––––
నిబంధనల పేరుతో వేధిస్తున్నారు
పూర్ణిమ( కేవీ సుబ్బారెడ్డి కాలేజీ, బీటెక్‌ విద్యార్థిని)
వైయస్‌ఆర్‌ ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సకాలంలో వచ్చేది. ఇప్పుడు సంవత్సరం పూర్తయినా రావడం లేదు. నిబంధనల పేరుతో వేధిస్తున్నారు. 

వైయస్‌ జగన్‌: అందరూ ఇదే సమస్యతో బాధపడుతున్నారు. చదువుకు పేదరికం అడ్డుపడొద్దని, ప్రతి ఒక్కరు గొప్పగా చదివితేనే వారి జీవితాలు మారుతాయని ప్రియతమ నేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ఆర్‌ ఫీజురియంబర్స్‌మెంట్‌ ప్రవేశపెట్టారు. ఆయన మరణాంతరం ప్రభుత్వాలు పద్దతి ప్రకారం చేతులు దులుపుకున్నాయి. మన దురదృష్టవశాత్తు బాబు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కావడంతో విద్యార్థిలోకం సమస్యల వలయంలో చిక్కుకుంది. మేము అధికారంలోకి వస్తే పరిస్థితిని అదుపులోకి తెస్తాం. అందరికీ వంద శాతం అందేలా చేస్తా. మెస్‌ చార్జీలు, బోడింగ్, లాడ్జింగ్‌ చార్జీలు కూడా లేకుండా చేస్తాం. ప్రతి విద్యార్థి నాన్న ఫోటోతో పాటు నా ఫోటో కూడా పెట్టుకునే విధంగా చేస్తాం. 
––––––––––––––––––
ఒక్క పరిశ్రమ అయినా తెచ్చారా?
శ్రావణి(బీటెక్‌ స్టూడెంట్‌)
చంద్రబాబు విదేశాలకు టూర్లు వెళ్లి ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చారు. ? ఎన్ని కోట్లు తెచ్చారు? రాయలసీమకు ఎన్ని పరిశ్రమలు తెచ్చారు?

వైయస్‌ జగన్‌: చంద్రబాబుకు ఆ చిత్తశుద్ది ఉంటే కేంద్రంతో పోరాడి హోదాను సాధించేవారు. హోదా సాధిస్తే పరిశ్రమల కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. పరిశ్రమలే ఇక్కడికి వచ్చేవి. మనకర్మకొద్ది చంద్రబాబు విదేశాలకు టూర్లు వేస్తున్నారు. 16 సార్లు విదేశాలకు వెళ్లి తెచ్చింది ఏమీలేదు. విశాఖలో పాట్నర్‌షిప్‌ సమ్మిట్‌ పెట్టి రూ. 4.6 లక్షల కోట్లతో 300లకు పైగా ఎమ్మోయూలు కుదుర్చుకున్నాం. దాదాపు 10 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని డబ్బాలు కొట్టుకున్నారు. బాబు హయాంలో కొత్తగా పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు వెనక్కు వెళ్లిపోతున్నాయి. యువతకు ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదాతోనే సాధ్యం.  ఇందుకోసం బాబు కాలర్‌ పట్టుకొనైనా ఉద్యమించాలి. రెండున్నర సంవత్సరాలుగా చంద్రబాబు చేసింది సున్నా. బాబును బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. దానికి అందరూ సిద్ధం కావాలి.
–––––––––––––––––––––––––––
తప్పు బాబు చేస్తే శిక్ష మాకా?
జ్యోస్న( బీటెక్‌ విద్యార్థిని)
చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో బ్రీఫ్డ్‌మీ అని విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. తప్పు ఆయన చేస్తే శిక్ష మేమెందుకు అనుభవించాలన్నా?

వైయస్‌ జగన్‌: దేశ చరిత్రలో చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి ఎవరూ ఉండరేమో. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నల్లధనం ఇస్తూ ఆడియో, వీడియో టేపులతో సహా దొరికిపోయి రాజీనామా చేయకుండా సీఎంగా కొనసాగడం ఎక్కడా ఉండదు. అది బాబుకే సాధ్యం. ఆయన అంత గొప్పగా మ్యానేజ్‌ చేసుకుంటాడు. ఎన్నికల హామీలతో ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. 
––––––––––––––––––
మాట తప్పిన సీఎంను ఏంచేయాలన్నా?
స్నేహ(బీటెక్‌ విద్యార్థిని)
ఎన్నికల ముందు బాబు వస్తే జాబు వస్తుంది. లేకపోతే నెలకు రూ. 2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. చంద్రబాబు హామీ మాటలకు పరిమితమైంది కానీ చేతల్లో లేదు. మాట తప్పిన సీఎంను ఏంచేయాలన్నా?

వైయస్‌ జగన్‌: చంద్రబాబు విద్యార్థులనే కాదు. రైతులను, మహిళలను, ఆఖరికి చిన్న పిల్లలను కూడా వదల్లేదు. ఎన్నికల్లో అబద్దాలు చెప్పి మోసం చేశారు. ప్రజాస్వామ్యంలో మార్పు అవసరం. ఆ మార్పుకు బాబు లాంటి మోసకారి రాజకీయ నేతలే కారణం. 
––––––––––––––––––
జగనన్న ధైర్యం మావెంట ఉంది
భానుప్రకాష్(టీటీసీ విద్యార్థి)
5 కోట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజల హక్కుఅయినటువంటి హోదాకు బదులు కేంద్రం ప్యాకేజీ ప్రకటిస్తే అధికారం కట్టబెట్టిన ప్రజల అభిప్రాయాలు తీసుకోరా? ఓట్లు వేసిన ప్రజలను గౌరవించకుండా వారి అభిప్రాయాలు తీసుకోకుండా ఎలా స్వాగతిస్తారు? యువభేరికి రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటే వైయస్‌ జగన్‌ అన్న ధైర్యం మా వెంట ఉందని గట్టిగా నినదిస్తాం

వైయస్‌ జగన్‌: కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ అర్థరాత్రి స్టేట్‌మెంట్‌ ఇస్తే చంద్రబాబు ఎవరు ఆమోదించడానికి, ప్రజలు ఆమోదం తెలపాలని తెలియదా? అధికారం ఉందని ప్రజల మనోభావాలతో ఆడుకోవడం ధర్మం కాదు. ప్రజాస్వామ్యంలో ఓట్లు వేసే ప్రజలను గౌరవించకపోవడం, బాబు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం మన కర్మ.
––––––––––––––
హోదా రావాలంటే జగనన్న సీఎం కావాలి
వినోద్‌కుమార్, విద్యార్థి
వైయస్‌ జగన్‌ మీటింగ్‌లకు వెళితే విద్యార్థులపై కేసులు పెడతానంటున్నారు. హోదా కోసం పోరాడే హక్కు మాకు లేదా? ప్రత్యేక హోదా కోసం జైలుకైనా వెళ్తాం. కానీ బాబులా స్టే తెచ్చుకోం. విద్యార్థిలోకం పోరాటం చేస్తే ప్రభుత్వ నేతలు రోడ్డు మీద తిరగడానికి భయపడతారు. ప్రతి సంవత్సరం అనేక మంది డిగ్రీలు పట్టుకొని రోడ్లమీదకు వస్తున్నారు. ఉద్యోగాలు రావాలంటే హోదా రావాలి. హోదా రావాలంటే మీరు (వైయస్‌ జగన్‌) సీఎం అవ్వాలన్నా. జగనన్న సీఎం అవ్వడానికి, హోదా సాధించుకోవడం కోసం మా ప్రాణాలైనా ఇస్తాం

వైయస్‌ జగన్‌:  ప్రత్యేక హోదాపై చంద్రబాబు బుకాయిస్తున్నాడు. హోదా వల్ల కలిగే లాభాలు పార్టీ వెబ్‌సైట్‌లో పెట్టాం. కేసీ త్యాగి అనే వ్యక్తి హోదా వల్ల లాభాలేంటని అడిగితే పార్లమెంట్‌ సమాధానం ఇచ్చింది. హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలో 10.864 యూనిట్లు రావడం, రూ. 15,324 లక్షల కోట్ల పెట్టుబడితో లక్షా 29 వేల 443 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఉత్తరాఖాండ్‌లో 30,244 యూనిట్లు రావడం రూ. 35,343 లక్షల కోట్ల పెట్టుబడితో రెండు లక్షలా 45 వేల 573 మందికి ఉద్యోగాలు వచ్చాయని కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ మినిస్ట్రీ త్యాగికి సమాధానం ఇచ్చింది. దయచేసి బాబు మొండిగా బుకాయించడం మానుకొని పోరాటం చేయాలి. 
–––––––––––––––––
మోసకారి ప్రభుత్వాన్ని ఏంచేయాలన్నా?
నాగేంద్ర, రాయలసీమ యూనివర్సిటీ
దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి 2008లో రాయలసీమ పీజీ సెంటర్‌ను యూనివర్సిటీగా తీర్చిదిద్దారు. యూనివర్సిటీ ప్రతినిధులు స్టాఫ్‌ రూ. 50 కోట్ల ఫండ్‌ అడిగితే కమిటీ వేసి రూ. 150 కోట్లు ప్రకటించారు. ఆ ఘనత వైయస్‌ఆర్‌దే. కానీ వైయస్‌ఆర్‌ ప్రతి యూనివర్సిటీకి అంబులెన్స్‌ కేటాయించారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం అంబులెన్స్‌లను పూర్తిగా యూనివర్సిటీల నుంచి తీసేంది. అదేమని అడిగితే ఆసుపత్రులకే గతిలేవు అన్నట్లు మాట్లాడుతుంది. ఇలాంటి మోసకారి ప్రభుత్వాన్ని ఏం చేయాలన్నా?

వైయస్‌ జగన్‌: ప్రతిజిల్లాకు యూనివర్సిటీ ఉండాలనేది ప్రియతమనేత వైయస్‌ఆర్‌ ఆలోచన. కడపలో యూనివర్సిటీ, మెడికల్‌ కాలేజ్‌ వైయస్‌ఆర్‌ పుణ్యమే. రాష్ట్రంలో 11 కొత్త యూనివర్సిటీలు తీసుకొచ్చిన ఘనత వైయస్‌ఆర్‌దే. టీడీపీ ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదు. చివరకు కేంద్రం ఇస్తామంటున్న నిధులు మెడికల్‌ కాలేజ్‌ కట్టడానికి కూడా సరిపోవు. ముష్టివేస్తున్నట్లు ఇస్తున్నా కేంద్రాన్ని గట్టిగా అడగడానికి చంద్రబాబు ఎందుకు ముందుకు రావడం లేదు. మళ్లీ ఆ ముష్టిని గొప్పగా ప్యాకేజీ ఇస్తున్నారని పొగడడం ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబు స్వాతంత్ర ఉద్యమ సమయంలో పుట్టివుంటే స్వాతంత్రం ఎందుకు మనం బ్రిటీష్‌ వారికి బానిసలుగా ఉంటేనే మేలు, ప్యాకేజీలు వస్తాయని గోబెల్స్‌ ప్రచారం చేసేవాడేమో? బాబు అప్పుడు లేకపోవడం దేశ అదృష్టం. ఇప్పుడు సీఎంగా కొనసాగడం మన కర్మ. కనీసం నీ మాటలు వినైనా చంద్రబాబు జ్ఞానోదయం కలగాలని ఆశిద్దాం.
–––––––––––––––––––––––––––
నాయకులను ఎలా నమ్మాలి
విక్కి, సీఏ స్టూడెంట్‌
రాష్ట్ర విభజన సమయంలో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఇచ్చిన మాటకు విలువలేదు. ఒకపై వచ్చే నాయకులను ఎలా నమ్మాలి?

వైయస్‌ జగన్‌: పార్లమెంట్‌ సాక్షిగా ప్రధాని ఇచ్చిన మాటకే దిక్కు దివానా లేకపోతే... ప్రజలు ఎవరిని నమ్మాలి.. ఎవరి మాటలు వినాలి. వ్యవస్థ పూర్తిగా మారాలి. యువత ప్రశ్నల నుంచైనా మార్పు పుట్టుకురావాలి. ప్రజలకిచ్చిన వాగ్ధానాలను నెరవేర్చకపోతే ఎన్నికల్లో ఎదిరిస్తారనే భయం రాజకీయ నేతల్లో ఉండాలి. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ కూడా రాలేదు. వచ్చిన ప్యాకేజల్లా చంద్రబాబు ఓటుకు కోట్ల కేసును ముందుకు పోనివ్వం అన్న ప్యాకేజీ దానికోసం రాజీపడ్డారు. నీ మాటలు వినైనా చంద్రబాబుకు బుద్ధి రావాలని కోరుకుందాం. 
–––––––––––––––––––––––––––

యువభేరి కార్యక్రమానికి విద్యా సంస్థల అధినేత పుల్లయ్య అధ్యక్షత వహించగా, వివిధ విద్యా సంస్థల అధినేతలు కేవీ సుబ్బారెడ్డి, న్యాయవాది శంకరయ్య, రిటైర్డ్‌ తహశీల్దార్‌ రోషన్‌ అలీ, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఐజయ్య, గౌరు చరితారెడ్డి, బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, జిల్లా పరిశీలకులు అనంత వెంకటరామిరెడ్డి, జిల్లా నాయకులు కాటసాని రామిరెడ్డి, బుడ్డా శేషారెడ్డి, చెరుకులపాడు నారాయణరెడ్డి, హాఫీజ్‌ఖాన్, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలీంబాబు, యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు.

Back to Top