యనమల ఆరోపణలపై విచారణకు సిద్ధం

చెప్పుకోడానికి ఏమీ లేకనే ప్రతిపక్షంపై బాబు దుష్ప్రచారం

బిజెపితో అంటకాగుతున్నది టిడిపినే

సుజనా చౌదరీ ఇంకా జైట్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు

కేంద్ర మంత్రి భర్త చంద్రబాబు పక్కనే ఉండవచ్చా

బాబు తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి

నెల్లూరు : పిఎసి ఛైర్మన్, వైయస్ ఆర్ కాంగ్రెస్ నాయకులు బుగ్గన
రాజేంధ్రనాథ్ రెడ్డిపై మంత్రి యనమల చేసిన ఆరోపణలపై విచారణకు తమ పార్టీ సిద్ధమని
ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన రెడ్డి ప్రకటించారు. చంద్రబాబు అవినీతి గురించి
ప్రస్తావిస్తుంటే, బిజెపితో సంబంధాలు అంటగడుతూ తప్పించుకునే యత్నం చేస్తున్నారని,
వాస్తవంలో బిజెపితో ఇప్పటికీ సంబంధాలు నెరపుతున్నదని చంద్రబాబే అని ఆయన స్పష్టం
చేశారు. పూర్తి అభద్రతా భావంలో కూరుకుపోయిన చంద్రబాబు,అసత్య ప్రచారాలతో గందరగోళం
సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. నెల్లూరు లో ఆదివారం ఉదయం కాకాణి మీడియా సమావేశంలో
మాట్లాడారు.

నాలుగేళ్లుగా సిఎంగా చంద్రబాబు చేసిందేమీ లేదు. చెప్పుకోడానికి
ఏమీలేకనే ప్రతిపక్షాలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. వైయస్ ఆర్
కాంగ్రెస్ కు బిజెపితో సంబంధాలు ఉన్నాయని గోల పెడుతున్నారన్నారు. బుగ్గన
రాజేంద్రనాథ్ రెడ్డి తొలుత  అమిత్ షాను  కలిసారని ప్రచారం చేశారనీ,  అయితే అందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు
లేకపోవడంతో రాంమాధవ్ ను కలిసారంటూ అసత్య ప్రచారం మొదలెట్టారని విమర్శించారు.  ఢిల్లీలో బుగ్గన ఏదో చేశారంటూ గందరగోళం సృష్టిస్తున్నారన్నారు.
ఇలాంటి చర్యలు చూస్తుంటే చంద్రబాబు పూర్తిగా అభద్రతా భావంలో ఉన్నారంటూ స్పష్టమవుతోందని
కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. రోజురోజుకు ప్రజాదరణ పొందుతున్న వైయస్ ఆర్
కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూసి చంద్రబాబు ఆయన వంధిమాగధులు ఓర్వలేకపోతున్నారన్నారు.

పిఎసి ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ పై మంత్రి యనమల చేసిన చేసిన
ఆరోపణల మీద విచారణకు సిద్థమని స్పష్టం చేశారు. అధికారిక సమాచారాన్ని బుగ్గన ఎవరికీ
ఇవ్వలేదని పేర్కొన్నారు. బుగ్గన ఢిల్లీ పర్యటనను భూతద్ధంలో చూపడం, చిలువలు చేసి అసత్య ప్రచారానికి వాడుకోవడం సిగ్గు చేటన్నారు. నాలుగేళ్లుగా బిజెపితో కలిసి నడిచి,  ఏ ఎండకు ఆ గొడుకు
పట్టే చంద్రబాబు వ్యవహారశైలిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు అవినీతి
గురించి ప్రశ్నిస్తుంటే, బిజెపితో సంబంధాలు ఉన్నాయంటూ తప్పించుకుంటున్నారని
తీవ్రంగా మండిపడ్డారు. బిజెపి ప్రభుత్వంలో మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల
ప్రభాకర్ ముఖ్యమంత్రి సలహాదారుగా ఉండవచ్చు, మహారాష్ట్రకు చెందిన మంత్రి భార్య
టిటిడి బోర్డు సభ్యురాలిగా ఎలా నియమితులయ్యారని ప్రశ్నించారు. టిడిపి పార్లమెంటు
సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి నిత్యం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
చుట్టూ తిరుగుతూనే ఉన్నారనీ, చంద్రబాబు నాయుడుకి వైయస్ జగన్ ను విమర్శించే నైతిక
హక్కే లేదన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ఇప్పుడు
మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.

Back to Top