తెలంగాణలో పార్టీ బలానికి విజయాలే రుజువు

హైదరాబాద్ 01 ఆగస్టు 2013:

తెలంగాణ లేదా హైదరాబాద్ ప్రాంతంలో తమ పార్టీ బలంగా ఉందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బి. జనార్దనరెడ్డి తెలిపారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ పథకాల ఫలాలు ఈ ప్రాంతానికి కూడా అందడమే దీనికి కారణమన్నారు. ఇటీవలి పంచాయతీ ఎన్నికలలో తమ పార్టీ తెలంగాణ ప్రాంతంలో సాధించిన విజయాలు దీనిని రుజువు చేస్తున్నాయని చెప్పారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీలు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రాంతంలో తమ పార్టీ విజయాలను నిలువరించలేకపోయాయని చెప్పారు. గుర్తులు లేవు కాబట్టి.. ఓడిపోయినవన్నీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీవేనని చెబుతున్నారన్నారు.  పార్టీల గుర్తులతో జరగబోయే ఎన్నికలలో తమ పార్టీ గణనీయమైన విజయాలు సాధించి మరింత బలమైన శక్తిగా ఎదుగుతుందని స్పష్టంచేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి తమ పార్టీ కంకణం కట్టుకుందన్నారు.

Back to Top