'వాల్‌మార్ట్' నుండి ఎంత ముట్టింది బాబూ!హైదరాబాద్, 3 జనవరి 2013: చంద్రబాబు నడకలోనూ, నడతలోనూ రాజకీయ దురుద్దేశాలే ఉంటాయని, అధికార కాంక్ష కనబడుతూ ఉంటుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్.విజయమ్మ విమర్శించారు. చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐ బిల్లుకు సహకరించినందుకుగాను "వాల్‌మార్ట్" నుండి ఎంత ముట్టిందో చెప్పాలని ఆమె చంద్రబాబును నిలదీశారు. రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం ఇండియాలో రూ.125 కోట్లు వెచ్చించామని స్వయంగా వాల్‌మార్టే ప్రకటించిందని ఆమె గుర్తు చేశారు. చంద్రబాబు తన హయాంలో కేవలం ఉన్నవాళ్లకే మేళ్లు చేశారని ఆమె ఆరోపించారు. గురువారం సాయంత్రం మెదక్ జిల్లాలోని పటాన్ చెరు మైత్రీగ్రౌండ్స్‌లో జరిగిన ఒక భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు.

పటాన్ చెరు మాజీ ఎంపీపీ గూడెం మహిపాల్ రెడ్డి వైయస్ఆర్ సీపీలో చేరిక సందర్భంగా ఈ సభ జరిగింది. కాగా సభకు మహిళలతో సహా పెద్ద యెత్తున జనం హాజరయ్యారు. ఢిల్లీ అత్యాచార బాధితురాలి మృతికి సంతాపంగా శ్రీమతి విజయమ్మ క్రొవ్వొత్తి వెలిగించారు. సభ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. 

ప్రజలపై భారం మోపుతున్న ప్రభుత్వం

శ్రీమతి వైయస్.విజయమ్మ ఈ సందర్భంగా ప్రసంగిస్తూ మహానేత వైయస్ తర్వాత ప్రభుత్వం ప్రజలపై చార్జీల పెంపుతో పెనుభారం మోపిందని విమర్శించారు. శాచ్యురేషన్ విధానంతో కులమతవర్గాలకు అతీతంగా వైయస్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారనీ, ఒక్క రూపాయి కూడా పన్ను వేయకుండా వీటిని అందించారనీ ఆమె గుర్తు చేశారు. అయితే రాజశేఖర్ రెడ్డిగారి రెక్కల కష్టం మీద వచ్చిన ఈ ప్రభుత్వం వైయస్ పథకాలన్నిటికీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆమె విమర్శించారు. కరెంటు హాలీడేలతో పరిశ్రమలు మూతబడుతున్నాయనీ, వేలాది మంది ఉపాధి కోల్పోతున్నారనీ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డిగారు పల్లెలతో పాటు హైదరాబాద్‌ను కూడా అభివృద్ధి చేశారని ఆమె అన్నారు. ప్రజల ఆదాయం, వారి ఆస్తుల విలువ పెరగడానికి మహానేత వైయస్ కృషి కారణమని ఆమె గుర్తు చేశారు. పటాన్ చెరువులో పారిశ్రామికవాడ అభివృద్ధి కావడానికి వైయస్ కృషి చేశారన్నారు.

"రూ.150 కోట్లు కేటాయించి వైయస్ ఆనాడు సింగూరు నుంచి తాగునీటిని, సాగునీటిని అందించారు. 160 కిలోమీటర్ల మేర  ఎనిమిది లేన్ల రింగ్‌రోడ్ నిర్మించింది వైయస్ హయాంలోనే. శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం వైయస్ ఘనతే. మెదక్ జిల్లాకు ఐఐటీ కూడా తెచ్చారు. హైదరాబాద్‌లో 14 ఫ్లైఓవర్లు వచ్చాయంటే అది వైయస్ వల్లే. వైయస్ ముందుచూపు వల్లే హైదరాబాద్ చుట్టుప్రక్కల అభివృద్ధి జరిగింది. రాజశేఖర్ రెడ్డిగారు హైదరాబాద్ నగరంలో మంచి నీటి అవసరాల కోసం 5.5 టీఎంసీల నీటిని నాగార్జున సాగర్ నుంచి తీసుకు వచ్చారు. దీనికి రాజశేఖర్ రెడ్డిగారి చొరవే కారణం. "అని శ్రీమతి విజయమ్మ అన్నారు. రాజశేఖర్ రెడ్డిగారు వెళ్లిపోయాక ఒక కార్డుకానీ, ఒక ఇల్లు కానీ, ఒక పెన్షన్ కానీ ఈ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదని ఆమె విమర్శించారు.

భూములు పప్పుబెల్లాలు!

"హైదరాబాద్ తన హయాంలోనే అభివృద్ధి చెందిందని చంద్రబాబు పదే పదే గొప్పలు చెబుతారు. కానీ 1956 నాటికే హైదరాబాద్ దేశంలో అతిపెద్ద నగరాల్లో ఐదవ నగరంగా ఉండింది. ఇప్పుడూ ఐదవ నగరంగానే ఉంది. ఐటీ అంతా తానే అభివృద్ధి చేశానని చెబుతారు. ఆయన ఉన్నవాళ్లకే మేలు చేశారు. ఎవరికి మేలు చేశారు? ఎకరా రూ.50 వేల చొప్పున ఐఎంజీకి 850 ఎకరాలు ఇచ్చారు. ఎకరా రూ. 29 లక్షలకే 535 ఎకరాలిచ్చారు. రహేజాకు హైటెక్ సిటీ పక్కన 110 ఎకరాలు ఇచ్చారు. భూములు పప్పుబెల్లాలు పంచినట్లు పంచారు." అని ఆమె దుయ్యబట్టారు.

ఆల్విన్, రిపబ్లిక్ ఫోర్జ్ వంటి కంపెనీలు మూతబడ్డాయంటే అది చంద్రబాబు చలవే. చంద్రబాబు మీడియాను బాగా మ్యానేజ్ చేస్తారు. నిజానికి ఐటీలో కూడా హైదరాబాద్ చంద్రబాబు హయాంలో ముందంజలో లేదు. చంద్రబాబు పరిపాలనకు ముందు ఐటీ రంగం మూడో స్థానంలో ఉంటే ఆయన హయాంలో అది ఐదవ స్థానానికి వచ్చింది. ఆయన దిగిపోయేనాటికి కూడా అది ఐదో స్థానంలోనే ఉంది."అని శ్రీమతి విజయమ్మ ఎద్దేవా చేశారు.

"చంద్రబాబు హయాంలో మన ఐటీ వాటా దేశంలో 9 శాతం మాత్రమే. కానీ రాజశే్ఖర్ రెడ్డిగారి హయాంలో అది 14 శాతానికి పెరిగింది. కానీ చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే. పాదయాత్రలోనూ అన్నీ అబద్ధాలే చెబుతున్నారు. తొమ్మిదేళ్ల పరిపాలన కాలంలో కానీ తొమ్మిదేళ్ల ప్రతిపక్ష హోదాలో కానీ, 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఎవరికీ, ఏ జిల్లాకీ మేలు చేసింది లేదు. పాదయాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ డిక్లరేషన్ అంటున్నారు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలు అక్కర్లేదు. ఆయనవన్నీ సొంత ప్రయోజనాలే. ఆయనకు విశ్వసనీయత లేదు. విలువలు లేవు. చిత్తశుద్ధి అన్నది లేదు. ఆయన నడకలో, నడతలో రాజకీయ దురుద్దేశాలు కనబడతాయి. అధికార ఆకాంక్ష కనబడుతూ ఉంటుంది." అని శ్రీమతి విజయమ్మ తూర్పారబట్టారు.

ప్రభుత్వానికి సహాయం చేసిన బాబు!

"కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు కుమ్మక్కు అయ్యారు. చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బిల్లు ఓటింగ్ జరిగితే టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు రాజ్యసభలో ఓటు వేయకుండా ప్రభుత్వానికి సహాయం చేశారు. ఈ బిల్లు కోసం రూ. 125 కోట్లు ఇండియాలో ఖర్చు పెట్టామని వాల్‌మార్ట్ కూడా చెప్పింది. అనుబంధ రిటైల్ కంపెనీని ఏర్పాటు చేశామనీ, అందులో విదేశీ పెట్టుబడులు ఆహ్వానిస్తామనీ హెరిటేజ్ వాళ్లు కూడా చెప్పారు. దీని అర్థం ఏమిటి? చంద్రబాబుగారూ ఇందులో మీకు ఎంత ముట్టింది? అని అడుగుతున్నా. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఎన్నికల్లోనూ చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారు. 50 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే సగం స్థానాలలో టీడీపీకి డిపాజిట్లు కూడా రాలేదు. కాంగ్రెస్, టీడీపీ సీబీఐతో కలిసి రాజశేఖర్ రెడ్డిగారిపై, జగన్ బాబుపై కేసులు మోపారు. రాజశేఖర్ రెడ్డిగారు వచ్చి జవాబు చెప్పుకోలేరని ఆయన పేరును దోషిగా చేర్చారు. ఎంపీ, ఎమ్మెల్యే మంత్రి, ఏదీ కాకున్నా, ఏ సంబంధమూ లేకున్నా జగన్ బాబుపై కేసులు పెట్టారు. ఏనాడైనా క్యాంప్ ఆఫీసులో కానీ, సెక్రటేరియట్ లో కానీ జగన్‌ను చూశారా? కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చీ రాగానే జగన్ బాబుకు నోటీసులతో వేధింపులు మొదలయ్యాయి." అని ఆమె విమర్శించారు.

బాబుపై ఈగ వాలదు!

"ఉప ఎన్నికల నేపథ్యంలో సాక్షులను ప్రభావితం చేస్తారనే నెపంతో జగన్ బాబును జైలులో పెట్టారు. మామూలుగా 90 రోజుల్లో బెయిలు రావాలి. కానీ 224 అవుతోంది. ఇంతదాకా బెయిలు రాలేదు. ఒకొక్కరికీ ఒక్కో న్యాయంగా ఉంది. వారంరోజుల్లో బయటకు తెస్తామని చెప్పి మోపిదేవిని బలిపశువును చేసినవారు ధర్మానను కాపాడారు. ధర్మాన ప్రాసిక్యూషన్ కి క్యాబినెట్ అంగీకరించలేదు. ఇప్పుడు 26 జీవోలూ సక్రమమైనవంటున్నారు. టీడీపీ ఎంపీలు చిదంబరాన్ని కలుస్తారు. సాక్షి ఆస్తులు జప్తు అవుతాయి. కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి ల్యాంకో రాజగోపాల్ తమ్ముడిపై ఏ కేసులూ లేవు. అవినీతి అని జగన్ బాబుపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ అవినీతి ఉందో చూపించండి? చిరంజీవి పార్టీని హోల్‌సేల్‌గా అమ్ముకున్నారు. ఆయన కూతురు ఇంట్లో రూ.80 కోట్లు దొరికితే కేసులుండవు. పైగా బహుమతిగా కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు.ప్రభుత్వం పడిపోకుండా కాపాడతాడని చంద్రబాబు మీద కూడా ఏ కేసులూ ఉండవు. విచారణ ఉండదు. ఈగ కూడా వాలకుండా చూస్తారు. అదే మాట గులాం నబీ ఆజాద్ కూడా చెప్పారు. జగన్ బాబు కాంగ్రెస్ లోనే ఉండి ఉంటే తప్పక మంత్రి, ముఖ్యమంత్రి కూడా అయ్యుండేవారన్నారు."అని శ్రీమతి విజయమ్మ గుర్తు చేశారు.

"కానీ ధర్మం మన పక్షాన ఉంది. దేవుడు మన పక్షాన ఉన్నాడు. తప్పకుండా దేవుడు జగన్ బాబును బయటకు తెస్తాడు. జగన్ బాబు నాయకత్వంలో రాజశేఖర్ రెడ్డిగారి "సువర్ణయుగం" మళ్లీ వస్తుంది. రాజశేఖర్ రెడ్డిగారి ప్రతి కలా నెరవేరుతుంది. అమ్మఒడి, రూ. 3 వేల కోట్ల వ్యవసాయ ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు, మరింత సమర్థంగా ఆరోగ్యశ్రీ వంటివి అమలు అవుతాయి."అని శ్రీమతి విజయమ్మ భరోసా ఇచ్చారు. సభలో కేకే.మహేందర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, రహమాన్ తదితర వైయస్ఆర్ సీపీ నేతలు కూడా ప్రసంగించారు.

Back to Top