కేఈని ఎందుకు దూరం పెడుతున్నారు: ఆర్కే

హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన రాష్ట్ర రాజధాని విషయంలో రెవెన్యూ మంత్రి కేఈ
కృష్ణమూర్తిని ఎందుకు దూరంగా పెడుతున్నారని మంగళగిరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.  అనుభవజ్ఞుడైన కేఈ కాదని ఈ వ్యవహారాన్ని మంత్రి నారాయణకు
ఎందుకు అప్పజెప్పారని అనుమానం వ్యక్తం చేశారు. కేఈ భూసేకరణ విషయంలో
అభ్యంతరాలు చెబుతారనే, చంద్రబాబు తన నమ్మిన బంటు అయిన నారాయణకు ప్రాధాన్యం
ఇచ్చి ఈ పని అప్పజెప్పారని అన్నారు. తాత్కాలిక రాజధాని కార్యాలయాలను విజయవాడ, గుంటూరు అందుబాటులో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లోనే నెలకొల్పాలని సూచించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి గుంటూరు మధ్య ఏర్పాటయ్యే తాత్కాలిక రాజధాని ప్రాంతాన్ని రెండు రోజుల్లో ప్రకటించి షెడ్ల నిర్మాణానికి టెండర్లు పిలుస్తామని పురపాలక మంత్రి నారాయణ ప్రకటించడంపై ఆర్‌కే తీవ్ర అభ్యంతరం తెలిపారు. అందుబాటులో చక్కటి ప్రభుత్వ భవనాల నుంచి పరిపాలన సాగించకుండా మళ్లీ ఈ దుబారా ఖర్చు ఎందుకని ప్రశ్నించారు. మంగళగిరి పరిసరాల్లో 10 వేల నుంచి 12 వేల ఎకరాల వరకు ప్రభుత్వ భూములున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. అదే సమయంలో తూళ్లూరులోని పచ్చని పొలాలను రైతుల నుంచి లాక్కోవడాన్ని తప్పుబట్టారు. తాత్కాలిక రాజధాని అయినా, శాశ్వత రాజధాని అయినా ప్రభుత్వ భూముల్లో చేపట్టాలని సూచించారు.


Back to Top