వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పేరుతో మోసం

హైదరాబాద్, 20 మార్చి 2013:

వ్యవసాయానికి ప్రత్యేకంగా బడ్జెట్ ప్రవేశపెడతానని చెబుతూ వచ్చిన ప్రభుత్వం చివరి నిముషంలో దానిని వార్షిక ప్రణాళికగా మార్చి రైతులను మోసం చేసిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎమ్.వి.ఎస్. నాగిరెడ్డి మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జిల్లా కన్వీనర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఉండాలని తొలుత భావించింది పార్టీ  అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డని ఆయన గుర్తుచేశారు. మూడు నెలలుగా ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ పెడతామని ఆ శాఖ మంత్రి ఊరించారన్నారు. చివరి నిముషంలో మార్పు చేయడం చట్ట సభను తప్పుదోవ పట్టించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. వివిధ పద్దుల కింద ఉండే కేటాయింపులను ఒకే పుటలోకి తెచ్చారనీ, కేటాయింపులను ఏమాత్రం పెంచకుండా రైతుల ఆత్మాభిమానాన్ని బజారుకీడ్చారనీ నాగిరెడ్డి ధ్వజమెత్తారు. మహానేత ఉన్నప్పుడు వార్షిక బడ్జెట్ ఎనబై వేల కోట్లలో పదహారు వేల కోట్లు జలయజ్ఞానికి కేటాయించారనీ, ప్రస్తుతం లక్షా అరవై ఒక్క వేల కోట్ల బడ్జెట్లో అది 13 వేల కోట్లకు తగ్గిపోయిందనీ, ఇలాగైతే ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయనీ ఆయన ప్రశ్నించారు. ప్రాణహిత-చేవెళ్ళ, హంద్రీ-నీవా పథకాలను పూర్తిచేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదన్నారు.
కనీస మద్దతు ధరలు అందించడానికి వంద కోట్ల రూపాయలతో నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఈ ఏడాదే మద్దతు ధర లేక పత్తి రైతులు 1800 కోట్ల రూపాయలు నష్టపోయారనీ, ఈ వంద కోట్ల నిధితో కాపాడుతామనడం రైతులను ఎగతాళి చేసినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. రైతుకు సంబంధించిన అన్ని విభాగాలలోనూ కేటాయింపులు అసంబద్ధంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యవసాయ బడ్జెట్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని మోసగించిందని సమావేశం తీర్మానించినట్లు నాగిరెడ్డి వెల్లడించారు.

Back to Top