విభజన బిల్లుపై ముందే ఓటింగ్‌ నిర్వహించాలి

హైదరాబాద్ :

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు -2013పై చర్చ  ముగిసే ముందే ఓటింగ్ నిర్వహించాలని వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ శాసనసభా పక్షం పునరుద్ఘాటించింది. రాష్ట్రాన్ని కాపాడేందుకు తాము పోరాటం చేస్తుంటే.. కాంగ్రెస్, టీడీపీ నాయకులు మాత్రం తమ పార్టీలను కాపాడుకునేందుకు పాట్లు పడుతున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభా పక్షం ఎద్దేవా చేసింది.‌ విభజన బిల్లుపై ఓటింగ్ నిర్వహిస్తే ఎలాంటి వైఖరి అనుసరించాలో స్పష్టత లే‌నందువల్లే కాంగ్రెస్, టీడీపీలు తమ పార్టీని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నాయని దుయ్యబట్టింది. తమ పార్టీపై విమర్శలు చేసే బదులు విభజనకు అనుకూలమో, వ్యతిరేకమో చంద్రబాబు ఎందుకు సూటిగా చెప్పలేకపోతున్నారని ప్రశ్నించింది. వై‌యస్ఆర్‌సీపీ నాయకులు భూమన కరుణాకరరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి, కె.శ్రీనివాసులు, కాటసాని రామిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సోమవారం మీడియా పాయింట్ వద్ద మాట్లా‌డారు.

బిల్లుపై చర్చ పూర్తయిన తర్వాత ఓటింగ్ నిర్వహిస్తే తెలంగాణ ఎమ్మెల్యేలు ఆ ప్రక్రియను అడ్డుకునే అవకాశాలున్నా‌యని, అందుకే ముందే ఓటింగ్ నిర్వహించాలని ‌‌వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. బిల్లుపై ఓటింగ్ ఉంటుందో లేదో ఎమ్మెల్యేలకు సైతం స్పష్టత లేని పరిస్థితి నెలకొందని, బిల్లుపై ఏ విధంగా ముందుకెళుతున్నారో కనీసం బీఏసీ సమావేశం నిర్వహించి అయినా సభ్యులకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

అన్ని పార్టీలు రాజకీయాలను పక్కనపెట్టి సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించేందుకు కృషిచేయాలని విజ్ఞప్తి చేశారు. బిల్లుపై ముందుగా ఓటింగ్ నిర్వహించాలన్న తమ డిమాండ్‌ను వ్యూహాత్మకంగా నీరుగార్చారని చెప్పారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సభా నాయకుడిగా ఓటింగ్ నిర్వహించాలని ఎందుకు పట్టుబట్టడంలేదని ప్రశ్నించారు. ఈ విషయంలో‌ చంద్రబాబు మౌనంగా ఉండటంలో ఆంతర్యమేమిటని వారు నిలదీశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top