సమైక్యం అన్నవారికే ఓటు వేయండి

పీలేరు (చిత్తూరు జిల్లా) :

రాజకీయ లబ్ధి కోసమే సోనియా గాంధీ మన రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. సమైక్యాంధ్ర కోసం పాటుపడే వారికే ఓటు వేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. సమైక్యాంధ్రకు కట్టుబడిన సీమాంధ్రుల ఓట్లతో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 30 లోక్‌సభా స్థానాల్లో విజయం సాధిస్తుందని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విషయంలో జాతీయ రాజకీయాలనే శాసిస్తుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత నియోజవర్గమైన చిత్తూరు జిల్లా పీలేరులో మంగళవారం నిర్వహించిన సమైక్య శంఖారావం బహిరంగ సభలో శ్రీ జగన్‌ అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడంలో సోనియా గాంధీకి టీడీపీ అన్ని విధాలా సహాయపడుతోందని ఆరోపించారు.

రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసుకోవడం కోసం మన రాష్ట్రాన్ని తన ఇష్టం వచ్చినట్లుగా విభిజిస్తున్న సోనియాకు ఇదే పీలేరు నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వీర విధేయుడై ఆమె ఆదేశాలను అమలు చేస్తుండగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు విభజన ప్రక్రియకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారని శ్రీ జగన్‌ దుయ్యబట్టారు.

అసెంబ్లీ సమావేశాలకు బాధ్యతా రహితంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గైర్హాజరు ఆట ఆడుతున్నారని శ్రీ జగన్‌ నిప్పులు చెరిగారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయడు తమ పార్టీ ఎమ్మెల్యేల చేత వారి వారి ప్రాంతాలకు అనుగుణంగా నినాదాలు చేయిస్తున్నారని, సమైక్యం అన్న ఒక్క మాట ఆయన ఏనాడూ అనడంలేదని శ్రీ జగన్‌ దుయ్యబట్టారు.

మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి దేశ ప్రజలందరికీ తెలిసినా సీమగడ్డలో పుట్టిన చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డికి మాత్రం ఇతన ప్రయోజనాలు ఏవో ఆశించి చెవిటి, గ్రుడ్డివాళ్ళలా వ్యవహరిస్తున్నారని శ్రీ వైయస్‌ జగన్‌ విమర్శించారు. ఏ ఇతర రాష్ట్రంలో అయినా విభజనకు ముందుగా ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన తరువాత మాత్రమే కేంద్రం ముసాయిదా బిల్లు తయారు చేసి రాష్ట్రపతికి పంపిందని, తదుపరి చర్చ కోసం దానిని రాష్ట్రపతి శాసనసభకు పంపించారని శ్రీ జగన్‌ తెలిపారు. అయితే, ఒక్క మన రాష్ట్ర విభజన విషయంలో మాత్రం ఆ సంప్రదాయాన్ని అనుసరించడంలేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ముందుగా రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని, ఆ తరువాత మాత్రమే అసెంబ్లీలో చర్చకు ముసాదా బిల్లును పంపిందని అన్నారు.

రాష్ట్ర విభజన విషయంలో ఢిల్లీ అహంకారానికి తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య పోరాటం జరుగుతోందని శ్రీ జగన్‌ అభివర్థించారు. సమైక్యవాదంలో 30 లోక్‌సభ స్థానాలను మనమే గెలుచుకుందామని, సమైక్యాంధ్రకు కట్టుబడతామని హామీ ఇచ్చే వారినే ప్రధానిగా నిర్ణయిద్దామని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రం విడిపోతే రైతులు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని శ్రీ జగన్‌ ఆందోళన వ్యక్తంచేశారు. చదువు పూర్తి చేసుకున్న సీమాంధ్ర యువకులు ఉద్యోగాల కోసం హైదరాబాద్‌ వెళ్ళే అవకాశాన్ని కోల్పోతారని ఆయన అన్నారు. విభజన జరిగిపోయి మధ్యలో నాలుగో రాష్ట్రం పంచుకుంటే.. కృష్ణా నీళ్ళు సీమాంధ్ర రైతులకు అందకుండా పోతాయని ఆవేదన వ్యక్తంచేశారు.

రాష్ట్ర ఖజానాలో 50 శాతానికి పైగా ఆదాయం కేవలం హైదరాబాద్‌ నుంచి వస్తుందని, విభజన జరిగి రాజధాని నగరాన్ని ఒక ప్రాంతానికే పరిమితం చేస్తే.. మిగిలిన ప్రాంతంలో ఉద్యోగులకు కనీసం జీతాలు చెల్లించే పరిస్థితి కూడా ఉండబోదని శ్రీ జగన్‌ విచారం వ్యక్తంచేశారు. రాజధాని నగరం, ఓడరేవులు వేర్వేరు ప్రాంతాలకు ఇస్తే అభివృద్ధి పూర్తిగా వెనుకబడిపోతుందని అన్నారు. రెండు కొత్త రాష్ట్రాలు మరింత కింది స్థాయికి దిగజారిపోతాయని అన్నారు.

చంద్రబాబు నాయుడు ఇటీవల నిర్వహిస్తున్న సమావేశాల్లో 'హామీల చంద్రుడి'లా మారిపోయారని శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రుణాలు మాఫీ చేస్తానంటూ, ఉచిత విద్యుత్‌ ఇస్తానంటూ మహిళలకు చంద్రబాబు హామీలు ఇస్తుండడంపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేయడం, తాను ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకపోవడం అనే చంద్రబాబు విధానాలే ఆయన తీరును బహిర్గతం చేస్తాయన్నారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోతుందంటూ మద్యనిషేధాన్ని అమలు చేయలేదని, బెల్టు షాపులను విపరీతంగా ప్రోత్సహించారని ఈ సందర్భంగా శ్రీ జగన్‌ నిప్పలు చెరిగారు. మహిళల నుంచి రుణాలపై అత్యధిక వడ్డీని చంద్రబాబు నాయుడు వసూలు చేస్తే.. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత 'పావలా వడ్డీ' పథకం ప్రవేశపెట్టి వారిపై ఆర్థిక భారాన్ని బాగా తగ్గించిన వైనాన్ని శ్రీ వైయస్‌ జగన్‌ గుర్తుచేశారు.

చంద్రబాబు నాయుడుకు విశ్వసనీయత లేదన్నారు. చంద్రబాబు నాయుడు ఇస్తున్న హామీలను నెరవేరుస్తారన్న నమ్మకం కూడా ప్రజల్లో ఏమాత్రం లేదన్నారు. రైతులు వినియోగించే విద్యుత్‌పై చార్జీలను విపరీతంగా పెంచేసిన చంద్రబాబు నాయుడు వాటిని కట్టలేని వారిని జీవోలు తెచ్చి అరెస్టులు చేయించారని, ఆ అవమానాలను తట్టుకోలేక వేలాది మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి కల్పించారని శ్రీ జగన్‌ గుర్తుచేశారు. హామీలు తు.చ. తప్పకుండా అమలు చేసిన మహానేత వైయస్ఆర్‌ విధానాన్నే అనుసరిస్తున్న జగన్మోహన్‌రెడ్డిని ప్రజలు విశ్వసిస్తున్నారని ఆయన తెలిపారు.

కిరణ్ ఇలాకాలో జగ‌న్‌కు జనం బ్రహ్మరథం :
చిత్తూరు జిల్లాలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గం పీలేరులో జనం శ్రీ జగన్మోహన్‌రెడ్డికి బ్రహ్మరథం పట్టారు. నియోజకవర్గం పరిధిలోని వాల్మీకిపురం, కలికిరి మండలాల్లో మంగళవారం నిర్వహించిన సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్రకు వారి నుంచి అనూహ్య స్పందన లభించింది. వాల్మీకిపురంతో పాటు సీఎం కిరణ్ సొంత మండలమైన కలికిరిలో రహదారులకు ఇరువైపులా జనం బారులుతీరి జననేతకు స్వాగతం పలికారు. ఉదయం వాల్మీకిపురం గంగాదొడ్డిలో ఒలిపి రామచంద్ర కుటుంబాన్ని, తోటవీధిలో ఎ‌స్. రెడ్డిగౌస్ కుటుంబాన్ని‌ శ్రీ జగన్ ఓదార్చారు.‌ వాల్మీకిపురం బస్టాండ్ సర్కి‌ల్‌లో మధ్యాహ్నం జరిగిన సభలో సమైక్య గళాన్ని బలంగా వినిపించారు.

చింతపర్తి, గండబోయినపల్లెలలో మహానేత డాక్టర్ వై‌యస్‌ఆర్ విగ్రహాలను‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. తర్వాత కలికిరి నాలుగురోడ్ల జంక్షన్‌లో జరిగిన భారీ సభలో ప్రసంగించారు. అనంతరం అక్కడకు దగ్గరలో ఏర్పాటు చేసిన వైయస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాత్రి పది గంటల సమయానికి సోమల మండలంలోని కందూరుకు చేరుకున్నారు. చలి బాగా ఉన్నా, రాత్రి పది గంటల వరకూ దారిపొడవునా జనం వేచి ఉన్నారు.‌

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top